Tuesday, November 27, 2007

ఒక్క కాలు కాకి

మొన్న ఆరు కాళ్ల సాలీడుని చూసారు ఇప్పుడు, ఒకే కాలు ఉన్న కాకిని చూడండి. ఈ వీడియోను సుమారు రెండు సంవత్సరాల క్రితం NITKలో MTech చేస్తున్నప్పుడు చిత్రీకరించాను...


ఈ కాకులకు వేరుశనగ పలుకులు విసురుతున్నాము, అందుకే మా చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తమన్ని కాకులూ వేరుశనగ పలుకులను నేలమీద పడక ముందే తినాలని వాటిని మేము విసురుతున్నప్పుడు గాలిలోనే అందుకునేవి. కొన్నయితే రెండు మూడు పలుకులను ఒకేసారి అందుకోవాలని ప్రయత్నించేవి. కానీ మొత్తానికి వేరుశనగ పలుకులను గాలిలోనే, చాలా బాగా అందుకునేవి. బెంగుళూరు వచ్చిన తరువాత కాకులను ఒక్కసారి కూడా చూసిన గుర్తులేదు!

Sunday, November 25, 2007

ఆరుకాళ్ళ సాలీడు

Spider Hanging
అసలు పరిమాణం
కొన్ని రోజుల క్రితం ఒక ఆదివారం రోజు నిద్ర లేస్తూనే ఇలా వేలాడుతూ కనిపించింది. అంత పెద్ద సాలీడును నేను ఇంతవరకూ చూడలేదు. పైగా చాలా సేపు కదలకుండా అలాగే వేలాడుతూ ఉంది. వెంటనే కెమరాతీసి ఒక క్లిక్కు క్లిక్కాను. ఫ్లాష్ వెలుతురుకి బయపడింది కావచ్చు, వెంటానే కిందకు జారి...

'Six' legged spider
అసలు పరిమాణం
ఇలా ఒక తలుపు సందులోకి వెళ్ళి దాక్కుంది, ఈ సారి మెళ్ళగా తలుపును తెరచి దగ్గరి నుండి ఇంకో ఫొటో తీసాను, ఈ సారి ఇంకా తొందరగా ఎక్కడికో వెళ్ళి మాయమైపోయింది.

బొమ్మలను కంప్యూటరులో ఎక్కించిన తరువాత, దీనికి ఒక పక్కన నాలుగు కాళ్ళకు బదులుగా రెండే ఉన్నాయని గమనించాను. అందుకే గావచ్చు ఎక్కడో under groundలో ఉండాల్సింది ఇలా బయటకు వచ్చింది!!!

Thursday, November 22, 2007

ఒకప్పటి IT నిపుణుడు!

IT నిపుణుల కష్టాల గురించి బొలెడన్ని రకాలుగా, కధలు కధలుగా చెబుతూ ఉంటారు. అసలు ఆ వృత్తి ఎందుకు కష్టంగా ఉంటుందో ఈ యూట్యూబులో ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోండి...

Tuesday, November 20, 2007

స్టాకు మార్కెట్టు???

కొన్ని నెలల క్రితం బ్లాగ్‌షేర్స్ అనే సైటులో నా బ్లాగులో షేర్లను అమ్మకానికి పెట్టి నేను నా మొటమొదటి షేర్ల వ్యాపారాన్ని మొదలు పెట్టాను. అక్కడ డబ్బు తప్ప మిగతాదంతా నిజంగానే జరుగుతుంటుంది. ఆ రకంగా కొన్ని రోజులు అక్కడ షేర్ల ఆట ఆడాను. అలా అక్కడ వేరే బ్లాగులలో షేర్లను కొంటూ అమ్ముతూ ఉంటే కొన్ని రోజులకు నా బ్లాగులో నా దగ్గర ఉన్న వాటాకంటే ఎక్కువ వాటాను ఇంకోడెవడో కొట్టేసాడు. నా బ్లాగు నాకు కాకుండా ఇంకోడెవడి దగ్గరో ఉండటమేమిటని (అప్పటికి ఆ సైటు బోరుకొట్టటం మొదలైయింది), ఆ సైటుకు వెళ్లటం మానేసాను. 1000 బ్లాగు డాలర్లతో మొదలు పెట్టి ఆరేడు నెలల్లో సుమారు 500,000 బ్లాగు డాలర్లు సంపాదించానక్కడ :) (అయితే అక్కడ బ్లాగు డాలర్లలో కొంత మంది ఆస్తి 13-14 అంకెలలో ఉండేది).

ఈ మధ్య కాలంలో "నిజమైన" స్టాకు మార్కెట్టును గమనించటం లేదా అందులో పెట్టుబడి పెట్టడం అనే ఒక కొత్త వ్యాపకం మొదలుపెట్టాను. ఇక్కడ కొనటం అమ్మటం ఎంత నిజమో డబ్బులు పోవటం రావడం కూడా అంతే నిజం! నేను స్టాకు మార్కెట్టుకి కొత్త కాబట్టి పెట్టుబడి పెట్టేబదులుగా వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తున్నాను. అందుకుగాను ఒక నాలుగైదు షేర్లను ఎంచుకుని వాటిని పరిశీలించటం మొదలు పెట్టాను. వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తుంటే నా చిన్న బుర్రలో ఉన్న లాజిక్కుకి అందనివి ఏవేవో జరిగిపోతున్నాయక్కడ...

ఉదాహరణకు ఒక "క", "చ" అనే రెండు కంపెనీల షేర్లను తీసుకుందాం. రెండు కంపెనీల షేర్లూ పెరుగుతుతున్నాయి. అంతా బాగానే ఉందికదా అనుకుంటూ వాటి తీరుతెన్నులు పరిశీలించాలని అనుకున్నాను, అప్పుడే గమనించాను "చ" అనే కంపెనీ షేర్లను అమ్మే వాళ్ళకంటే కొనేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటప్పుడు దాని షేరు విలువ పెరగటం సహజం. అయితే "క" అనే కంపెనీ స్టాకులను కొనేవారి కంటే అమ్మేవాళ్ళు 3-4 రెట్లు ఎక్కువమంది ఉన్నారు, అయినా దాని విలువ ఆ రోజంతా పెరుగుతూనేఉంది. అంతేకాదు "చ" కంటే "క" విలువ బాగా పెరిగింది ఆ రోజు. దీని బట్టి కంపెనీ షేర్ల విలువలు కొనటం/అమ్మటం మీద మాత్రమే ఆధారపడవని తెలుసుకున్నాను. మరింకా వేటిమీద ఆధారపడతాయనే ఇంకో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది :(

సరే ఇంక ఇక్కడ చర్చించుకోదగ్గ ఇంకో విషయం ఏమిటంటే ప్రతి 5 నిమిషాలకొకసారి refresh బట్టన్ని నొక్కి షేరు విలువ ఎంత పెరిగిందో చూసుకోవటం మొదలు పెట్టాను. కూడలిని కూడా ఇన్నిసార్లు నేనెప్పుడూ refresh చేయలేదు!... ఇంకా ఏ షేర్లనూ కొనకుండానే ఇంతలా ప్రతీ ఐదు నిమిషాలకొక సారి చూస్తున్నానంటే మరి వందల సంఖ్యలో షేర్లను కొని అమ్మేవారి పరిస్తితి ఎలాగుంటుందో!... లేక కొత్తొక వింత, అన్నట్లు స్టాకు మార్కెట్టు క్లబ్బులో కొత్తగా జేరిన వాళ్లే ఇలాంటి విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారా?...

ఇదంతా అయిన తరువాత ఇంక పరిశీలించింది చాలనుకుని, ధైర్యం చేసి నా "బిగినర్స్ లక్కు"ను పరీక్షించుకుందామని అంతకుముందు తగ్గి ఇప్పుడు పెరుగుతున్న రెండు కంపెనీల షేర్లను తలా మూడు కొన్నాను... తీరా కొన్న ఐదు నిమిషాలలోనే షేరుకి ఐదు శాతం చప్పున వాటి విలువ పడిపోయింది... స్టాకు మార్కెట్టులో కనీసం "బిగినర్స్ లక్కు" కూడా పని చేయదని ఇంకో పాఠాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు వాటిని వదిలించుకుందామని ప్రతీ రెండు నిమిషాలకోసారి వాటి విలువలోని హెచ్చుతగ్గులను పరిశీలించటం మొదలు పెట్టాను...

Monday, November 19, 2007

బెంగుళూరు - లాల్‌బాగ్

Lalbagh
అసలు పరిమాణం

చాలా రోజుల క్రితం తీసిన పొటో ఇది, అప్పుడు సమయం లేక ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. రెండు మూడు రోజుల నుండి ఇక్కడ బెంగుళూరులో అసలు ఎండనేదే కనపడటం లేదు. మధ్యాహ్నం ఒంటిగంటా రెండు గంటలకు కూడా బాగా చలనిపిస్తుంది. ఆఫీసులో ఏసీ కంటే బయటే ఎక్కువ చలిగా ఉంది. నాలుగు వారాల క్రితం తీసాను ఈ ఫొటోను, అప్పుడు చూడండి ఎంత ఎండ ఉందో! బెంగుళూరు లాల్‌బాగ్‌లో ఇలాంటి కనువిందు కలిగించే దృశ్యాలు ఇంకా చాలా ఉన్నాయి, త్వరలోనే మరికొన్ని ఫొటోలు పెడతాను.

Friday, October 19, 2007

అమెరికా తెలుగు కథ (మొదటి సంకలనం)


రెండు నెలల క్రితం ఈ పుస్తకాన్ని మా చుట్టాల ఇంట్లో చూసాను, అప్పటికే వాళ్లింట్లో చదవాల్సినవారందరూ చదివేసినట్లున్నారు, బీరువాలో ఓ మూలకెళ్లిపోయింది... ఏట్లాంటి కథలుంటాయో చూద్దామని మొదటి పేజీ చదవటం మొదలుపెట్టాను, ఇంకొంత సేపటికి పుస్తకంలోని మొదటి కథ పూర్తయిపోయింది; అప్పుడే ఇది మొత్తమంతా చదవాల్సిన పుస్తకం అని అనిపించింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని రెండోసారి చదువుతున్నాను!

ఈ పుస్తకాలలోని కథలు చదువుతున్నంత సేపూ బ్లాగులలోని పోస్టులు చదువుతున్నట్లే అనిపించింది. కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని పరవాలేదనిపించాయి, ఇంకొన్ని నాకు నచ్చలేదు(అర్థంకాలేదు?). కానీ ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న కథలన్నీ, రచయితల అనుభవాల నుండి పుట్టినవే ఉన్నాయి (నాకలా అనిపించింది).

ఆ పుస్తకంలోని మొదటి కథే (యాదృచ్చికం) నాకు అన్నింటికంటే చాలా బాగా నచ్చిన కథ, అసలు ఆ కథే నన్ను పూర్తి పుస్తకాన్ని చదివేటట్లు చేసింది. ఆ తరువాత వెంటనే చెప్పుకోవలిసిన కథ "తుపాకి", ఇది ఆ పుస్తకంలో అన్నిటికంటే పెద్దకథ. కానీ అది కాదు దీని గొప్పదనం. కథలోని కధనం పాత్రలను మలచిన తీరు, నాకు బాగా నచ్చాయి. ఈ కథను చదివితే అమెరికా జీవితాన్ని విహంగవీక్షణం చేసిన అనుభూతికి లోనవుతారు. పుస్తకంలోని కథలను చదువుతున్నంతసేపూ వాటి పైన ఒక సమీక్షరాద్దామని అనుకున్నాను. కానీ రాయటం మొదలు పెట్టిన తరువాత తెలిసింది సమీక్షను రాయటం అంత సుళువు కాదని. ఈ పుస్తకం లోని 50% కథలు చాలా బాగున్నాయి, ఇంకో 30% బాగున్నాయి. మిగిలిన 20% కథలు, పేజీలు నింపటానికి మాత్రమే, అని చెప్పను కానీ, నాకు అర్థంకాని ఇంకో స్థాయిలో రాసారేమో అని అనిపించింది, వాటిని పూర్తిగా చదవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

పొరుగింటి పుల్లకూర, అమెరికా ఇల్లాలు, అమ్మ, లక్ష డాలర్లు, అగాధం మొదలైన కథలు చదువుతుంటే మాతృదేశాన్ని వదిలి, అమెరికా వచ్చి, చాలా కోల్పోయామేమోననే భావన నుండి తయారయ్యాయి. అంతేకాదు, మనం విన్న "కుందేలూ-తాబేలు" కథకు ముందు జరిగిన కథను వేమూరిగారు అద్భుతంగా వివరించారు. "తెమీనచా-నమీతెచా" అంటూ సత్యం మందపాటిగారు బాగా వాతలు పెట్టారు. "సావాసం సహవాసం", పదాల మధ్యన తేడాను, "ఆవగింజ ఆంతర్యాన్ని" కూడా కథలరూపంలో వివరించేసారు. పుస్తకంలోని కథలు ఒక ఎత్తయితే, పుస్తకం చివరన కథకులను పరిచయం చేయటం ఇంకో ఎత్తు. వారందరు ఒక్క జీవితకాలంలోనే అన్ని అద్భుతాలు ఎలా సాధించారా అనిపించటం కద్దు.

ఈ పుస్తకం మొత్తంలో నాకు అస్సలు అర్థంకాని కథ "లుండెర్ క్లుంపెన్". నేను రెండు సార్లు చదివినా, ఆ కథ ద్వారా రచయిత ఏంచెప్పాలనుకున్నడో, నాకు అస్సలు అర్థం కాలేదు.

ఈ పుస్తకంలో ఒక్కో కథా 2-3 పేజీల నుండీ 15-20 పేజీల వరకూ ఉంది. మొత్తం 35 కథలు. రొజుకో కథ చప్పున పుస్తకాన్ని పూర్తిచేయడానికి నెలపైనే పట్టింది నాకు. "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు అమెరికాలో అయితే 15డాలర్లు, భారతదేశంలో 100 రూపయలు మాత్రమే.

అనట్లు ఈ పుస్తకంలో మన నాసీగారి కథ కూడా ఒకటి ఉందండోయ్.

Sunday, September 23, 2007

ఎలా జరిగింది?

అసలు మొదటిగా ఏం జరిగిందో తెలుసుకుందాము. ఆ తరువాత ఎలా జరిగింది అని అలోచిద్దాము. నా బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో ఎప్పుడొ online photo hosting sites కోసం వెతుకుతున్నప్పుడు నాకు flickr గురించి తెలిసింది. ఇంకొన్ని వేరే సైట్లు ఉన్నా కూడా flickr నచ్చినంతగా అవి నచ్చలేదు. అప్పుడప్పుడూ అలా flickrలో తిరుగుతున్నప్పుడు కొంత మంది పేర్ల పక్కన pro అని కనపడుతూ ఉండేది. మొదట్లో మంచి మంచి ఫొటోలు తీసేవాళ్ల పక్కన అలా pro అని వస్తుందేమో అని అనుకున్నాను, తరువాత తెలిసింది లెండి, ప్రతీ నెలా రెందు డాలర్లు కడితే మన పేరు పక్కన కూడా pro అని వచ్చేస్తుందని తెలిసింది. నాకంతెందుకులే అని, ఉచిత సేవలతోనే సరిపెట్టుకున్నాను.

అయితే మొన్న 21న జరిగిందది. flickrలో నా పేరు పక్కన కూడా pro అని కనిపించటం మొదలయింది, అలా అని నేను డబ్బులేమయినా కట్టానా అంటే, ఒక్క రూపాయి కూడా కట్టలేదు. మరింకెందుకు అలా కనిపించటం మొదలయ్యింది. ఇంకా వివరాలలోకి వెళితే నేను ఇంకో నెలపాటు(వచ్చే నెల 21 వరకు) అలా నా పేరు పక్కన proని చూసుకుంటూ మురిసిపోవచ్చని తెలిసింది.

ఇప్పుడు అసలు ప్రశ్న flickrలో నేను డబ్బులు కట్టకపోయినా, నా ఎకౌంటు proగా ఎలా మారిపోయింది? ఇలా జరగటానికి నాకు రెండు కారణాలు కనపడుతున్నాయి. ఈ రెండిటిలో ఏదయినా కవొచ్చు. ఎవరయినా నాకు బహుమతిగా పంపించుండొచ్చు... కానీ అలా నాకు ఒక pro ఎకౌంటు కొంటునట్లు ఎటువంటి మెయిల్లు రాలేదు... ఇంక రెండోది flickrలో ఇదొక feature లాంటి bug అనుకుంటా :)

మీకీ సంగతి తెలుసా; flickrలోకి మీరు ఎక్కించిన ఫొటోలు, ఇతరులకు నచ్చుతాయా నచ్చవా అనే అంశం పరిశీలించి వాటిని ఆ రకంగా వర్గీకరిస్తుంది. ఇది కూడా మనుషులు కాకుండా ప్రోగ్రాములే చేస్తాయని నా వుద్దేశం...

Friday, September 21, 2007

తెలుగులో అతి తరచుగా ఉపయోగించే అక్షరం ఏది?

ఆంగ్లంలో "E" అనే అక్షరాన్ని అతి తరచుగా వాడతారని మనందరికీ తెలిసిందే, మరి తెలుగులో కూడా అటువంటి అక్షరం ఒకటి ఉండాలి కదా... ఈ ప్రశ్నకు జవాబును కనుక్కోవటానికి తెలుగు వికీపీడియాలో ఉన్న సుమారు 58 వేల పేజీల సమాచారాన్ని సేకరించి పరిశీలించాను. అయితే చివరికి వచ్చే ఫలితాల నాణ్యత కాపాడటానికి 2KB కంటే తక్కువ సమాచారం ఉన్న పేజీలను పరిశీలన నుండి తప్పించాను, ఇలా తప్పించటం వలన దాదాపు అన్ని గ్రామాల పేజీలు, చాలా మట్టుకు సినిమా పేజీలు విశ్లేషణ నుండి బయట పడ్డాయి. అంటే విశ్లేషణకు ఇక మిగిలిన పేజీలలో ఉన్న సమాచారం మొత్తాన్ని ప్రోగ్రాములతో కాకుండా దాదాపూ పూర్తిగా మనుషులతోనే సృష్టించారు.

ఈ గణాంకాలు తీసుకుంటున్నప్పుడు వత్తులను కూడా మామూలు అక్షరాలతో సమానంగా లెక్కగట్టాను. ఈ గణాంకాలను తెలుగు వికీపీడియాలోని 3419 పేజీలలో ఉన్న సుమారు 66 లక్షల అక్షరాల(వత్తులు గుణింతాలు కలుపుకుని) నుండి సేకరించాను.

అచ్చులలో " లేదా ి" ఎక్కువగా ఉపయోగిస్తుంటే, హల్లులలో ""ను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ రెండిటికంటే కూడా ఎక్కువగా అచ్చు-హల్లు కాని (పొల్లును) ఉపయోగిస్తున్నారు!!!

వికీపీడియాలో నాకు వచ్చిన పూర్తి ఫలితాలను ఇక్కడ చూడండి.

ఇలాంటి విశ్లేషణ ఇంతకు ముందే ఒకసారి అన్నమైయ్య పాటలపై ఒకసారి, రచ్చబండ గుంపులోని చర్చలో ఇంకోసారి జరిగాయి. ఈ రెండు చోట్లా మట్టుకు "" అనే అక్షరం అత్యధికంగా వాడుతున్నట్లుగా గణాంకాలు వచ్చాయి.

Sunday, September 16, 2007

నేనూ ఒక ఇంటివాడినయ్యాను

నిజం చెప్పాలంటే నా బ్లాగు ఒక ఇంటిదయ్యింది, నేను కాదు :) ఈ మధ్యనే నేను ఒక 10 డాలర్లు పెట్టి ఒక URL కొనుకున్నాను, ప్రతీ సంవత్సరం ఇలా 10 డాలర్లు కడుతూ ఉండాలంట!. గూగుల్ ద్వారా గోడాడీలో కొనుక్కున్నాను. అంటే గూగులే ఇప్పుడు నా సైటుకు కావలిసిన స్టోరేజీ, బ్యాండ్‍విడ్తూ ఇచ్చి వాటి నిర్వహణా బాద్యతలను కూడా ఉచితంగా చేపడుతుంది. కాకపోతే మనకు ఇక్కడ వెబ్ సర్వర్, డేటాబేసు సర్వర్ ఉండవు.

URL కొనుక్కున్న తరువాత నేను చేసిన కొన్ని ప్రయోగాల వలన, తేనెగూడులో నా పాత టపా మూడు సార్లు వచ్చింది, ఆ తరువాత నేను తేనెగూడులో ఉన్న click analysisతో చేసిన ప్రయోగాల వలన, అక్కడ ఉండే "ఎక్కువగా చూచిన టపాలు" అనే శీర్షికలో మొదటి మూడు టపాలూ నావే వచ్చేసాయి :)

Tuesday, September 11, 2007

ఈ ఫోటోకి పేరు పెట్టలేదు

మొన్న బెంగులూరు నుండి విజయవాడ వెల్తున్నప్పుడు ఇతని ఫొటోను తీసేసాను. ఫొటో తీస్తునప్పుడు నేను ట్రెయిను లోపట ఉండటం వలన, అతనికి నేను ఫొటోను తీస్తునట్లు తెలీదు. ఎందుకో ఈ ఫొటో నాకు చాలా బాగా నచ్చింది. ఎవరయినా ఈ ఫొటోకి ఒక మంచి పేరు పెట్టగలరు.

Caption Wanted

Wednesday, September 05, 2007

మధురైకి వెళ్ళి వచ్చాను

ఈ మధ్యన ఒక తోటి ఉద్యోగస్తుడి పెళ్లికని మధురై వెళ్ళి వచ్చాను. ఇంతకుమునుపే ఒక సారి కన్యాకుమారి వెళ్తూ మధురై కూడా వెళ్లాను. కానీ అప్పుడు మధురైలో పేరెన్నికగన్న మధుర మీనాక్షిగుడి నొక్కదానిని హడావిడిగా చూసేసి వచాను. ఈ సారి మధురైలో ఇంకొంత నింపాదిగా తిరిగటానికి అవకాశం లభించింది. పొద్దున్నే మీనాక్షీగుడికి వెళ్లాము, గుడిలో విగ్రహాన్ని ఎక్కడికో ఊరేగింపుకి తీసుకుని వెళ్ళటంవలన గుడిని మూసేసారంట! గుడి పరిసరాలలోనే ఉండే 1000 స్థంభాల హాలులో ఉండే మ్యూసియంను ఓ చుట్టు చుట్టి వచ్చేసాము. తరువాత పెళ్లివారింటికి వెళ్ళి తమిళులకు ప్రీతిపాత్రమైన సాంబారుతో భోజనం కానిచ్చేసి మధురైకి 20కిమీల దూరంలోనే ఉండే అలగర్‌కోవిల్ గుడికి బయలుదేరాము.

అలగర్‌కోవిల్ తమిళనాడులో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి, ఇది అలగర్ అనే కొండపైన ఉంటుంది. కొండ కింద ఒక గుడి, పైన రెండు గుళ్లు ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 అయిపోయింది. కింద ఉన్న గుడికి మరమత్తులు చేస్తున్నారు. కొండమీద ఉండే గుడికి రోడుమార్గం ఉంటుంది. మేము మాత్రం ఆ రోడ్డుకు ఆనుకుని ఉండే అడవిమార్గంలో నడుచుకుంటూ కొండ మీదకి వెళ్లటానికి నిశ్చయించుకున్నాము. (అసలు అలా trekking చేయొచ్చన్నే అక్కడకు వెల్లాము)

well
ఈ బావి అడవిదారి మొదట్లోనే కనపడుతుంది. ఇక్కడిదాకా రావాలంటే కొండ కింద ఉన్న గుడి లోపలకు వెళ్లి, కొండకు గుడికి అడ్డంగా కట్టిన పెద్ద గోడలో ఉన్న ఒక చిన్న ద్వారం గుండా వెళ్లాలి.

damp way
dark forest
వర్షాకాలం అవ్వటం వళ్లనేమో అడవి చాలా దట్టంగా ఉంది, మేము బస్సులో కొండను చేరుకునే వరకూ వర్షం పడుతూనే ఉండటం వలన నేలంతా తడి తడిగా ఉంది.

road way
అలా అడవిమార్గంలో కొంత దూరం నడిచిన తరువాత రోడ్డు ఇలా రోడ్డు కనపడింది. అడవిలోనే వెళ్లటానికి మాకు ఇంక దారి కనపడలేదు. సరే అని ఇంక రోడుమార్గంలోనే మిగతా కొండ ఎక్కడం మొదలు పెట్టాము.

tired men
అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ ...

first hilltop
సుమారు గంటన్నర నడక తరువాత ఇలా కొండపైన ఉన్న గుడి ఆనవాలు కనపడింది. ఇక్కడ కొండపైన ఉండే మొదటి గుడి ఉంటుంది. ఇక్కడి నుండి ఇంకో 10-15 నిమిషాలు నడిస్తే రోడ్డు అంతమయ్యి ఇంకో గుడి ఉంటుంది. ఈ రెండో గుడిని చత్తాచెదారాన్ని పేర్చడానికి వాడుతున్నారా అని అనిపిస్తుంది.

అలా కొండపైవరకూ వచ్చిన తరువాత అక్కడ ఏంచేయాలో తోచక మళ్లీ కిందకు దిగటం మొదలుపెట్టాము. ఈ కొండ నిండా బోలెడన్ని కోతులు ఉంటాయి, అవి మన దగ్గర ఉన్న సంచీలలో ఏవయినా తినుబండారాలు ఉన్నాయేమోనని వాటిని లాక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, కాబట్టి మీరు ఎప్పుడయినా ఇక్కడికి వెళ్ళినప్పుడు వాటితో జాగ్రత్తగా ఉండండి.

couple
కొండమీద నుండీ దిగుతున్నప్పుడు ఇలా ఒక జంట కనపడితే కెమెరాతో ఒక క్లిక్కు క్లిక్కాను. జంట ఎక్కడా కనపడటంలేదంటారా :) అయితే ఫొటో అసలు సైజులో వెతకండి కనపడుతుందేమో.

nature2
nature1
కొండదిగుతున్నపుడు కనిపించిన ప్రకృతి దృశ్యాలు.

తరువాతి రోజు పెళ్లిలో సాంబారులో అన్నం కలుపుకు తినేసి, మధురైలోనే ఉండే నాయక్ మహల్ చూడటానికి వెల్లాము. 17వ శతాబ్ధంలోనే అంత పెద్ద భవనాన్ని కట్టడం ఒక ఎత్తయితే పైకప్పుతో సహా భవనం మొత్తాన్ని ఇటుకలూ సున్నంతోనే కట్టేసారు, అయినా ఇంకా చెక్కుచెదరలేదు.

nayak mahal
ప్రస్తుతం మహలులో ఒక దర్బారు, ఆసనం, దర్బారు చుట్టూ ఒక వరండా కొన్ని చిన్న చిన్న గదులూ మిగిలి ఉన్నాయి. మిగతా చాలాభాగం ద్వంసం చేసేసారంట. ఒక గదిలో మహలు చుట్టుపక్కల లభ్యమైన రాతిశిల్పాలు, టెర్రకోట బొమ్మలను ప్రదర్శనకై ఉంచారు.

ఇంకొన్ని విశేషాలు:
  • బెంగుళూరులోనూ, హైదరాబాదులోనూ ఫుట్‌పాతులపై అమ్మే దొంగ CDలను అమ్మటానికి ఇక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అమ్ముతున్నారు. కొనే ముందు CDలో ఉన్న సినిమా ఎంత క్వాలిటీ ఉందో చూసుకోవటానికి డీవీడీ ప్లేయర్లను కూడా ఏర్పాటు చేసారు!!!
  • మధురైలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం "జిగర్ తండా".
  • మధురైలో నుండీ 100-150కీమీల దూరంలో మంచి మంచి జలపాతాలు కూడా ఉన్నాయి, కానీ మేము వాటిని చూడలేకపోయాము.

జల్లెడలో లోపం

మొన్నా మధ్యన జల్లెడలో టపాల తేదీలను తీసుకోవటంలో ఒక చిన్న లోపాన్ని గమనించాను. దానిని సవరించేవరకూ నాయీటపా అన్నిటికంటే మొదటిగా కనపడుతుంది మరి :) అంతేకాదు నా బ్లాగులో కూడా అన్నిటికంటే ముందు ఈ టపానే కనపడుతుంది :(

టపా రాసిన ఏడు గంటల తరువాత చేసిన మార్పు...
మీ అందరికీ కలిగిన అసౌకర్యానికి నన్ను క్షమించాలి. నాకు ఆటలా తోచింది ఇంకొంతమందికి ఇబ్బందిని, చికాకును తెచ్చిపెడుతున్నాయి. ఏదేమయినా నేను చెప్పాలనుకున్నది చెప్పేసాను కాబట్టి ఈ టపా తేదీని మళ్లీ మార్చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ టపా నా బ్లాగులో కూడా మొదటి టపాగా ఎంత మాత్రమూ ఉండదు :)

Monday, August 06, 2007

కుక్క మరియు దాని తోక

ప్రశ్న: కుక్క దాని తోకను ఎందుకు ఆడిస్తూ ఉంటుంది?
జవాబు: కుక్క తన తోకకంటే తెలివైనది కాబట్టి.

మరి తోకే కుక్క కంటే తెలివిగలదైతే...,
అప్పుడు తోకే కుక్కను ఆడిస్తూ ఉంటుంది!!!

"Wag the Dog" సినిమా ఈ పై ఆలోచనను నిజంగా జరిగితే ఎలా ఉంటుందో మనకు చూపిస్తుంది. రాజకీయ నాయకులు తాము చేసే కొన్ని తప్పులను, ఆకర్షనీయంగా ఉండే వార్తలను సృష్టించి ఏ విధంగా తప్పించుకుంటారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. 1997లో విడుదలైన ఈ సినిమా అమెరికా రాజకీయాలకు అనుగుణంగా తీసారు. ఇంకా పెద్ద వింతేమిటంటే ఈ సినిమా విడుదలైన నెల రోజుల తరువాత, ఈ సినిమాలో చూపించిన సంఘటనలు అమెరికా రాజకీయాలలో నిజంగానే జరిగాయి.

అమెరికాలో ఎన్నికలకు ఇంకా 2 వారాల సమయం ఉంటుంది. ప్రస్తుత అమెరికా అధ్యక్ష్యుడికి ప్రజలలో ఇంకా మంచి ఆధరాభిమానాలు ఉంటాయి. అయితే ఇంతలో ఒక సెక్స్ స్కాండలు బయటపడుతుంది, దానివలన అతని పాపులారిటీ దెబ్బతినే పరిస్తితి ఏర్పడుతుంది. దాని నుండి ప్రజల ఆలోచనలను మళ్లించటానికి, అధ్యక్ష్యుడికి ప్రచార సిబ్బంది ఒక నకిలీ యుద్దాన్ని సృష్టించాలని అనుకుంటారు. అలా సృష్టించాలంటే పత్రికలకూ, టీవీ చానల్లకూ ఆధారాలు చూపించాలి కాబట్టి, అలా ఆధారాలు తయారు చేయటానికి వారు ఒక హాలీవుడ్డు నిర్మాతను సంప్రదిస్తారు. ఆ తరువాత సినిమా అంతా ఈ నిర్మాత నకిలీ యుద్దాన్ని నిజమైన యుద్దమే నమ్మించటానికి తెయారు చేసే స్క్రిప్టులు, స్టంటులతో సినిమా చాలా రసవత్తరంగా సాగుతుంది.

చివరికి మచ్చపడ్డా కూడా నిర్మాతగారి మరియు అధ్యక్ష్యుడికి ప్రచార సిబ్బంది అత్భుత ప్రతిభా పాటవాల వలన, మచ్చపడ్డా కూడా ఇంకోసారి సారి అధ్యక్ష పదవిని అలకరించటంతో సినిమా ముగుస్తుంది...

మనరాష్ట్రంలో కూడా పార్టీలకు సొంత పత్రికలు, టీవీలు వచ్చేస్తుండటం వల్ల, మన పరిస్థితి కూడా తోకచే ఆడింపబడే కుక్కలాగా అయిపోతుందేమో.

Sunday, July 29, 2007

రూపాయి విలువ

నేను ఇన్ని రోజు డాలరుతో రూపాయి విలువ పెరగటం వలన మనకు ఇక్కడ అన్నీ లాభాలే అని భావిస్తూ ఉండేవాడిని. అంటే డాలరు విలువతో మన రూపాయి విలువ సమానంగా అవుతున్న కొద్దీ ఇక్కడ మన జీవన ప్రమాణాలు కూడా అమెరికా జీవన ప్రమాణాలకు దగ్గరగా అవుతాయి అని అనుకుంటూ ఉండే వాడిని. 1000 డాలర్లు ఉండే ల్యాప్‌టాపుని ఇప్పుడు 40000 రూపాయలకే కొనుక్కోవచ్చు, అంటే ఇక్కడ మనం సుమారు 10000 మిగుల్చుకున్నాము. ఇంకో రకంగా చెప్పాలంటే రూపాయి విలువ పెరుగుతున్నంత కాలం, మన కొనుగోలు శక్తి పెరుతుంది. అంటే దిగుమతుల వ్యాపారం కనీ వీనీ ఎరుగనంత లాభాలు ఆర్జిస్తున్నాయన్నమాట.

కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, రెండో వైపు ఎగుమతులు ఉన్నాయి. భారత దేశంలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న రంగమైన సాఫ్టువేరు రంగం, పూర్తిగా ఎగుమతుల మీదనే ఆధారపడుతున్న రంగం. ఈ రంగం అతిపెద్ద వినియోగదారుడు నిస్సంకోచంగా అమెరికానే. అయితే డాలరు విలువ 49 రూపాయల నుండి 40 రూపాయలకు పడిపోయిందంటే ఇది సాఫ్టువేరు కంపెనీలకు చాలా పెద్ద దెబ్బ. కంపెనీలకే కాదు వాటిలో పనిచేసే కూలీలకు కూడా ఈ దెబ్బ తగులుతుంది. అది ఎలా గంటే డాలరు విలువ పడిపోవటం వలన, ఇక్కడ రూపాయలలో జీతం తీసుకునే సాఫ్టువేరు కూలీలకు, జీతాలు పెంచక పోయినా కూడా
ఎక్కువ డాలర్లు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు సాఫ్టువేరు కంపెనీలు తమ మీదున్న భారాన్ని ఈ కూలీల పైకి కూడా తోసేయటానికి ప్రయత్నించవచ్చు.

ఒక సాఫ్టువేరు కూలీగా రూపాయి విలువ మళ్లీ పడిపోతే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఒక భారతీయుడిగా చూస్తే ఇది
మనందరికీ చాలా శుభసూచకం అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా మనదేశంలో మట్టుకు పెరగలేదు. ఇది పెరిగిన రూపాయి మహత్యమే. ఇలాంటి లాభాలు ఇంకా చాలా ఉంటాయి. వాటిలో ఒకటి మన మీద వేసే పరోక్ష పన్నులను తగ్గించటం, కూడా ఉండొచ్చు.

పెరిగిన రూపాయి విలువ తీసుకొచ్చిన సమస్యలపై ఇవాల్టి ఈనాడులో ఆదివారం అనుభందంలో వచ్చిన శ్రీధర్ కార్టూను చూడండి.

Monday, July 16, 2007

జింప్ మరియు ఇంక్‌స్కేప్

జింప్ మరియు ఇంక్‌స్కేప్ ఈ రెండూ వేర్వేరు అవసరాలకు ఉపయోగించగలిగే సాఫ్టువేర్లు. రెండిటినీ ఉపయోగించి బొమ్మలపై చిన్న చిన్న మార్పులు-చేర్పులు చేసుకోవచ్చు. రెండు సాఫ్టువేర్లు అంతర్గతంగా rendering కొరకు GTKను ఉపయోగిస్తాయి. కాబట్టి GTKలో యూనీకోడ్ తెలుగు rendering ఉంటే రెండిటిలోనూ, మనకు తెలుగు కనిపిస్తుంది.

ఇంక్‌స్కేప్ ఒక వెక్టారు గ్రాపిక్సు పరికరం. అంటే గీతలతో తయారు చేయగలిగే బొమ్మలకు ఎక్కువగా ఉపయోగపడుతుందన మాట. గీతలతో తయారు చేయగలిగే బొమ్మలంటే మ్యాపులను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. 3డ్ బొమ్మల తయారీలో తయారు చేసే వైర్‌ఫ్రేములు(wireframes) కూడా ఇంక్‌స్కేప్‌లోతయారు చేయవచ్చు. వెక్టారు గ్రాపిక్సుకు XML ప్రామాణికమయిన SVGని చాలా వరకు support చేస్తుంది. ఇంక్‌స్కేప్‌లో మామూలు పొటోలపై కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కానీ అలాంటి పనులకు జింప్‌ను వాడటం ఉత్తమం. ఇంక్‌స్కేప్‌లో మీరు వెక్టారు బొమ్మలను తయారు చేసి వాటిని SVGలో బద్రపరచుకూవచ్చు కూడా.

జింప్‌తో మనం ఫొటోలపై మార్పులు చేర్పులు చేయవచ్చు. ఉదాహరణకు, నలుపు-తెలుపు ఫొటోలను రంగుల ఫొటోలుగా మార్చుకోవడం, మరకలుపడి పాడయిన ఫొటోలపై మరకలను తొలగించి బాగుచేయటం లాంతివి చేయొచ్చు. అవే కాకుండా నేను చిరంజీవితో కరచాలనం చేస్తూ ఫొటో దిగినట్లు లేకపోతే ఇల్లియానా నేను కలిసి గోవా బీచిలలో డ్యాన్సు వేస్తునట్లు ఫొటోలను తయారుచేసుకోవచ్చనమాట (ఇలాంటివి నిజజీవితంలో జరగవు కాబట్టి ఇలాంటి శునకానందాలు వస్తుంటాయి అప్పుడప్పుడు).

జింప్ మరియు ఇంక్‌స్కేప్ రెండూ ఉచితంగా లభించే సాఫ్టువేర్లు. Adobe వారి Photoshop(ఫొటోల కోసం) మరియు Illustrator(గీతల కోసం)లు కూడ ఇలాంటి అవసరాల కోసమే ఉపయోగిస్తారు. కానీ వాటిని కొనుక్కుని వాడాలి కాబట్టి జింప్ మరియు ఇంక్‌స్కేప్‌ల కంటే బాగాపనిచేస్తాయని అనిపించవచ్చు.


ఎప్పుడో నెల రోజుల క్రితం రాసి మధ్యలో ఆపేసిన పోస్టు ఇది, ఏదో మారథాను కాదా అని బూజు దులిపి, కొంచెం బాగు చేసి, పది లైన్లు ఉన్నాయో లేదో చూసి పోస్టు చేస్తున్నాను.

Friday, July 06, 2007

Alt+Shift+s

ఏమిటో ఈ మధ్య Alt+Shift+s కీ కాంబినేషను చాలా విరివిగా ఉపయోగించేస్తున్నాను. అవే కాదండీ, Alt+Shift+p కూడా. ఎవరికయినా మెయిలు పంపాలని అనుకుంటే, మెయిలులో సందేశాన్ని మొత్తం టైపు చేసేసి వెంటనే దానిని పంపించటానికి Alt+Shift+s, అని ఓ నొక్కు నొక్కుతున్నాను. నొక్కిన తరువాత నేను నొక్కాల్సిన చోట కాకుండా ఇంకో చోట నొక్కుతున్నానని ప్రతీ సారీ నాలికర్చుకోవలసి వస్తుంది. అలాగే పంపించే ముందు ప్రీవ్యూ చూడాలని అనుకున్నప్పుడు పని చేయదని తెలిసి కూడా, Alt+Shift+p అని నొక్కేస్తున్నాను.

అరె ఇప్పుడు కూడా ఈ పోస్టుని పంపీయడానికి Alt+Shift+s అని నొక్కేస్తున్నాను, హతోస్మీ!!!...

Wednesday, July 04, 2007

రెండవ బెబ్లాసా సమావేశం

మొదటిగా, శుక్రవారం సాయంత్రం నవీన్ గార్ల గారి నుండి gtalk‌లో నాకు పిలుపు వచ్చింది. శనివారం కానీ, ఆదివారం కానీ కలుద్దామని చెప్పారు. సరేమరి ప్రవీణ్‌ను కూడా అడిగి నాకు ఎప్పుడు ఎక్కడికి రావాలో ఫోను చేసి చెప్పండని, చెప్పాను. అంతకు ముందు రోజు రవికుమార్ మండాలా నా దగ్గరకు వచ్చి ఈ వికీపీడియా కధా కమీషూ ఏమిటో కనుక్కుందామని, శనివారం నా రూముకు వస్తానన్నాడు.

ఎప్పటిలాగానే శనివారం ఆఫీసులేదని కొంచెం ముందే నిద్రలేచాను :) ఏంచేయాలో తోచక వికీపీడియాలో వ్యాసాలను కెలుకుతూ కూర్చున్నాను. రవీ వస్తాననడం గుర్తొచ్చి, రమ్మని ఫోను చేసాను. ఇంకో అరగంట తరువాత ఎప్పుడూ సైలెంటు మోడులో ఉండే నా సెల్లులోని మిస్సుడు కాల్సు చూస్తే నవీన్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చిందని ఉంది. ఫోన్‌చేస్తే నవీన్, ప్రవీణ్ ఇద్దరూ సమావేశమై అప్పుడే గంటయ్యిందని చెప్పాడు. రవీ వచ్చేవరకూ ఆగి అతనిని కూడా అటు పట్టుకెళ్ళాను.

వెళ్ళిన వెంటనే ఒక ప్లేటులో కాజూబర్ఫీ, ఇంకో ప్లేటులో హాటు వచ్చేసాయి మాదగ్గరకి. ఇంకొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నా తరువాత ప్రవీణ్, నవీన్ తయారు చేద్దామనుకుంటున్న తెలుగు సహాయక వీడియోలు ఎలా తయారు చేద్దామనుకుంటున్నదీ చెప్పి, వాళ్ళు అప్పటికే తయారు చేసిన, ఒక చిన్న వీడియోను చూపెట్టారు. చాలా బాగా వచ్చింది ఆ వీడియో. ఆ తరువాత గంటా, రెండు గంటలు ఏవేవో చర్చించాము, వాటిలో ముఖ్యమైనవి ఇవి:
  1. ఇంటర్నెట్టులో తెలుగును బాగా వ్యాప్తి చేయటానికి పనికి వస్తాయనుకునే ఆలోచనలను అన్నీ ఒకేచోట ఎప్పటికప్పుడు చేర్చడం. ఈ-తెలుగు సంఘాన్ని, ఏర్పాటు చేసిందే అందుకు కదా మరి. ఇదేకాదు తెలుగు ప్రచారానికి అవసరమైన వ్యాసాలను కూడా తయారు చేసి, వాటన్నిటినీ కూడా ఒకే చోట పదిలపరిస్తే బాగుంటుందని అనుకున్నాము.
  2. కంప్యూటరులో తెలుగును స్థాపించటానికి సహాయపడే వీడియోలను మరిన్ని తయారు చేయటం. ఒక పేజీడు సూచనలకన్నా 2 నిమిషాల వీడియో చూస్తే ఇంకా తొందరగా బాగా తెలుసుకోవచ్చు కదా మరి.
  3. తెవికీకి ఒక Recruitment Bulletinని మొదలు పెడితే ఎలా ఉంటుందో అనే కూడా ఒక ముఖ్యమైన విషయం. రాశిలో తెవికీ భారతీయ వికీలన్నిటికన్నా ముందుంది అనేది అందరికీ తెలిసిందే. వాశిలో మాత్రం మనం కన్నడ, తమిళ భాషలు మనకు చాలా పోటీని ఇస్తున్నాయి, అవి మనకంటే ముందు కూడా ఉండి ఉండవచ్చు. అయితే తెవికీని వాశిలో కూడా ముందుంచే చిన్న ఆలోచన ఇది. తెవికీలో ప్రస్తుతం బోలెడన్ని వ్యాసాలు మెరుగుపరచటానికి ఎదురుచూస్తున్నాయి. ఎవరెవరికి ఏ ఏ రంగాలలో ప్రవేశముందో లేదా ఇష్టముందో తెలుసుకుని వారిని తెవికీలో ఆయా వ్యాసాలను మెరుగుపరచటానికి ప్రోత్సహించటం ఈ Bulletin యొక్క ముఖ్యోద్దేశం.
  4. తెవికీలో అనువాదాలకు వ్యాసాలను ఆంగ్లవికీ నుండే కాకుండా ఇతర భారతీయ భాషలనుండి కూడా తేగలిగితే ఎలాఉంటుందో అని కొంచెం సేపు చర్చించాము. ఉదాహరణకు తెవికీలో ఉన్న ఈ పేజీని చూడండి, దీనిని కన్నడ వికీ నుండి అనువదిస్తున్నారు.
  5. తెవికీకో ఉన్న అన్ని సహాయ పేజీలకు WP:5MINలా ఉండే సంక్షిప్త పేర్లతో దారిమార్పు(redirect) పేజీలను సృష్టించాలి అనికూడా అనుకున్నాము. దీనివలన మన గుంపులలో ఎప్పుడయినా ఆ పేజీలకు లింకులను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సంక్షిప్త చిరునామాలయితే సులువుగా ఉంటుండి.
  6. మాటల మధ్యలో తెవికీలో RTS-తెలుగు Transliteratorని ఇంకోంచెం వేగంగా పనిచేయించటానికి ప్రయత్నించాలని అభిప్రాయపడ్డాము.
  7. పేరుకి బ్లాగరుల సమావేశం అనే మనం పిలుస్తున్నా కానీ, ప్రతీ సారీ బ్లాగరులు మరియు వికీపీడియనులు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అందుకని ఈ సమావేశాలకు "ఈ-తెలుగు సమావేశం" అనే పేరే సరయినదని కూడా కొంచెం సేపు చర్చించుకున్నాం.

అప్పటికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. మొదటి సమావేశంలో అనుకునట్లు MTRలో తినలేక పోయినా, అంతకంటే ఎన్నోరెట్లు రుచికరమైన విందు భాజనం చేసాము. అందునా ఆ విందులో వడ్డించిన వంకాయ కూర అదుర్స్. కాబట్టి ఇంక వారం వారం సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. భోజనం ముగించిన తరువాత కొంచెం సేపు లినక్సు గురించీ ఉబుంటూ ఉచిత CDల గురించి మాట్లాడుకున్నాము. ఆ తరువాత జరిగిన సన్నివేశాలన్నీ మీరు ప్రవీణు రాసిన పోస్టులో ఇప్పటికే చదివేసి ఉంటారు.

నలుగురమూ కలిసినందుకు గుర్తుగా(రుజువుగా) చివరిలో ఈ ఫొటో తీసుకున్నాము. ఫొటోలో ఎడమ నుండి కుడి వైపుకు, నేను, ప్రవీణ్, తెవికీ, నవీన్, రవీ నుంచున్నాము.

Saturday, June 23, 2007

టిన్ టిన్

ఇతను నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు నాకు పరిచయమయ్యాడు. తన పెంపుడు కుక్క స్నోయితో కలిసి, దేశ దేశాలు తిరుగుతూ, బోలెడన్ని సాహసాలు చేసేవాడు. ఎక్కడా కూడా వెన్నుచూపి పారిపోయేవాడు కాదు, అందరినీ తెలివిగా ఎదుర్కొనేవాడు. టిన్ టిన్ జనవరి 10 1929లో పుట్టాడు. టిన్ టిన్ మొదట Le Petit Vingtième అనే ఫ్రెంచి పత్రికలోని పిల్లల ప్రత్యేక విభాగంలో కనిపిస్తాడు.

Hergé అనే కలం పేరుతో Georges Prosper Remi అనే బెల్జియం రచయిత ఇతనిని సృస్టించాడు. టిన్ టిన్ మొట్ట మొదట రష్యాలోని అప్పటి కమ్యూనిష్టు పాలనా విశేషాలను తన తోటి ప్రజలయిన బెల్జియం దేశస్తులకు చేరవేయడానికి వెళ్తాడు. టిన్ టిన్ ద్వారా Hergé రష్యా పట్ల తనకు ఉన్న వ్యతిరేకతను వ్యక్త పరిచేవాడు. అందుకే గావచ్చు Tintin in the Land of the Soviets అనే పుస్తకం మనకు ఏ స్కూలు లైబ్రరీలోనూ కనిపించదు. Hergé రష్యా పట్ల ఉన్న వ్యతిరేకతకు ఉదాహరణగా ఈ క్రింది బొమ్మలను చూడొచ్చు.




కానీ ఈ ఒక్క పుస్తకాన్ని చూసి మొత్తం అన్ని టిన్ టిన్ పుస్తకాలపై ఒక అంచనాకు రాకూడదు మరి. ఈ పుస్తకాన్ని మొదలు పెట్టినప్పుడు Hergé వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాతి కొన్ని పుస్తకాలలో టిన్ టిన్ ఎన్నో అంతర్జాతీయ మాదకద్రవ్య ముటాలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు. ఇలా మాదకద్రవ్య వ్యాపారులను వేటాడే క్రమంలో భారతదేశానికి కూడా ఒక వస్తాడు.

అమెరికా వ్యోమగామి Neil Armstrong చంద్రుడి మీద కాలుపెట్టక ముందే టిన్ టిన్ చంద్రుడి మీద కాలు పెట్టేసి మనం బూమి నుండి చూడలేని చంద్రుడి ఇంకో వైపును కూడా చూసేసి వచ్చాడు. అది కూడా Neil Armstrong కంటే ఏకంగా 19 సంవత్సరాల ముందుగానే వెళ్ళి వచ్చాడు. Hergé ఈ పుస్తకం రాయడానికి ముందు చాలా పరిశోధన చేసాడంట. అప్పట్లో అమెరికాగానీ, రష్యాగానీ మానవ సహిత అంతరిక్ష యాత్రకు సన్నాహాలు కూడా మొదలు పెట్టలేదు. Hergé తనకు దొరికిన అతి తక్కువ సమాచారంతో వైజ్ఞానికంగా పెద్ద పెద్ద తప్పులు చేయకుండా కధను చాలా బాగా నడిపించాడు.


మొదటి రెండు మూడు పుస్తకాల కధంతా టిన్ టిన్ అతని పెంపుడు కుక్క స్నోయీల చుట్టూనే నడిచేది. తరువాత కధలలో అతనికి కొంతమంది స్నేహితులు కూడా తోడవుతారు. వాళ్ళలో ముఖ్యమయిన వారు, కాప్టన్ హాడ్డాక్, ఇతను ఒక మందు బాబు. మందు పుచ్చుకున్న తరువాత, అది దిగేదాకా ఏం చేస్తాడో అతనికే తెలియదు. కవలలు కాకపోయినా ఒకేలా కనిపించే థాంసన్ మరియు థాంప్సన్‌లు టిన్ టిన్‌కు పోలీసు మిత్రులు. వీళ్ళిద్దరూ కష్టాలను కొని తెచ్చుకోనిదే నిద్రపోరు, వీళ్ళు ఎప్పుడూ కలిసే కనిస్తుంటారు విడివిడిగా చూడటం చాలా అరుదు. వీరికి ఇంకో స్నేహితుడు సగం చెవుడు ఉన్న ఒక మతిమరుపు "ప్రొఫెసర్ కాల్కులస్". బియాంకా కాస్టాఫియోర్ అనే ఒక గాయిని కూడా వీరికి స్నేహితురాలు.

స్పిల్‌బర్గ్ తీసిన ఇండియానా జోన్స్ సినిమాలోని ముఖ్యపాత్ర కూడా టిన్ టిన్ పాత్రకు దగ్గరగా ఉంటుందని కూడా కొంత మంది భావిస్తారు. అంతేకాదు స్పిల్‌బర్గ్ కూడా నాలాగే టిన్ టిన్ అభిమాని.

Monday, May 07, 2007

హ్యారీ పోటరు బుక్కులు

ఎప్పుడొ పది సంవత్సరాల క్రితం రాయటం మొదలు పెట్టింది, J.K.Rowling, ఈ పుస్తాకాలను. అప్పటి నుండి తరువాతి పుస్తకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని, ప్రతీ పుస్తకం తరువాత అందరూ ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆఖరు పుస్తాకాన్ని విడుదల చేయటానికి ముహూర్తం కూడా నిర్ణయించేసారు. కవరు పేజీలలో ఉండే బొమ్మలను అప్పుడే విడుదల కూడా చేసేసారు. కధముగింపులో ఏ పదముంటుందో కూడా చెప్పేసారు. అంతేకాదు పుస్తకం వెనుక అట్టపై ఉండే కధ గురించి వాఖ్యాలు కూడా విడుదల చేసేశారు. ఆఖరుకి పుస్తకంలో ఎన్ని పేజీలుంటాయో కూడా చెప్పేసారు.

ఇవన్నీ చూసి/విన్న తరువాత పుస్తకం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టాను. ఈ టపా రాసే సమయానికి ఇంకా 74 రోజుల 5 గంటల 15 నిమిషాలు దూరంలో ఉంది పుస్తకం విడుదల చేసే సమయం.

అయితే ఈ లోగా ఇలా వేచి చూడలేని కొంతమంది, వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఏడవ పుస్తకాన్ని రాసేసుకున్నారు. ఇంకొంతమందేమో ఏడవ పుస్తకంలో ఏముంటుందో అని ఊహించేసి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాసేసి అమ్మేసుకుంటున్నారు మరి. ఏదయితేనేం ఈ కొసరు కధలను కూడా అసలు కధకు మల్లేనే ఉత్కంటతతో నడుపుతున్నారు, మెయిన్ కోర్సుకు ముందు స్టార్టర్ల లాగా.

ఇవన్నీ కాక ఈమధ్య ఏడవ పుస్తకంలో కొంతబాగం అప్పుడే లీకయినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇదెంతవరకూ నిజమో మరి. ఏదేమయినా ఆ ఏడవ పుస్తకం కోసం ఇంకా రెండునర్ర నెలలు వేచి చూడాల్సిందే...

Thursday, April 12, 2007

పని లేని మంగలోడు పిల్లి తల గొరిగాడంట!

mspaintని మనం అసలు వాడతామో లేదా తెలియదు కానీ, ఈ క్రింది వీడియో చూస్తే దానిలో కూడా మంచి మంచి బొమ్మలు గీయొచ్చేమో అని అనిపించక మానదు.

వీడియో చూడటానికి బొమ్మ మీద నొక్కండి. ఇక్కడ కూడా చూడొచ్చు.

స్నేహితులు పంపిన ఈ వీడియోని చూసి ఊరుకుంటే సరిపోయేది. ఏ క్షణాన చూసానో నాకు కూడా ఉత్సాహం వచ్చేసింది. ఇంకే ఆరు గంటల పాటు పాటుపడి ఈ బొమ్మ క్రింది గీసాను.

అలా ఆరు గంటల పాటు గీసిన తరువాత అర్థమయింది, నేను ఆ సమయాన్నంతా వృధాచేసానని. కాకపోతే ఒక విషయం తెలిసింది, mspaintలో బొమ్మలు గీయటం పెన్సిలు చెక్కటానికి గొడ్డలి వాడటంలాంటిదే అని. ఇంకో వీడియోని చూసిన తరువాత అర్ధమయ్యింది, ప్రోగ్రాములను రాయటానికి assembly, C, javaలు ఉన్నట్లు బొమ్మలను గీయటానికి కూడా mspaint, photoshop లాంటి సాఫ్టువేర్లు ఉంటాయని.

Wednesday, March 28, 2007

ఇది మీరు నమ్మాలి

దాదాపు 7,50,00,000 సంవత్సరాలకు పూర్వం జరిగిన కధ ఇది. 26 నక్షత్రాలు వాటిలో ఉన్న 76 గ్రహాలను, తీగీయాక్ అనే రాజ్యాన్ని, జిను అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అందులో మన భూగ్రహం కూడా ఉంది. కొంత కాలానికి అన్ని గ్రహాలలో జనాభా బాగా పెరిగి పోయింది. ఒక్కొక్క గ్రహంలో సుమారు 17800 కోట్ల జనాభాతో గ్రహాలు మరీ భారీగా తయారయ్యాయి. అప్పట్లో ప్రజల నాగరీకత అచ్చం మన నాగరికత లాగానే వర్ధిల్లుతుంది. మనమేసుకునే బట్టలనే వేసుకునే వాళ్ళు. మనం ఉపయోగించినట్లే రైళ్ళు, కార్లు, బస్సులు లాంటి వాహనాలను కూడా ఉపయోగించేవాళ్ళు.

మరి కొన్నాళ్ళకు జెను అధికారం కోల్పోయే సమయం ఆసన్నమయ్యింది, అప్పుడు తను అధికారం చలాయిస్తున్న అన్ని గ్రహాలలో ఉన్న అధిక జనాభాను నిర్మూలించాలని అనుకున్నాడు. సైకియాట్రిస్టుల సాయంతో కోత్ల మంది ప్రజలను మత్తు మందు ఇచ్చి నిర్వీర్యులను చేసాడు, వీరందరినీ ఆదాయపు పన్ను పరిశీలన అనే ముసుగులో పిలిచి, వారిని అక్కడ నుండి అపహరించి వారందరినీ చంపేయటానికి భూగ్రహానికి తరలించాడు. అలా భూగ్రహానికి తరలించిన జనాలందరినీ ఇక్కడ ఉన్న అగ్ని పర్వతాల చుట్టూ పేర్చాడు. ఈ అగ్ని పర్వతాలను హైడ్రోజను బాంబులతో నింపి, వాటన్నిటినీ ఒకే సారి పేలుస్తాడు. దాంతో ఇక్కడకు తరలించిన ప్రజలందరూ చనిపోతారు. ఏవో కొందరివి శరీరాలు వాత్రం మిగులుతాయి.

శరీరాలు లేని ఈ ఆత్మలన్నీ ఆ వ్స్పోటనానికి చల్లాచదురై గాలిలో అలా తేలుతూ ఉంటాయి. జెను సైనికులు వాటన్నిటినీ ఒక ఎలక్ట్రానిక్ రిబ్బను ఉపయోగించి బంధిస్తారు. అలా బంధించిన ఆత్మలను భూమి చుట్టూ ఉన్న సూన్యంలోకి పీల్చేస్తారు. వేల కోట్ల సంఖ్యలో బంధించిన ఈ ఆత్మలకు ఒక 3-D సినిమాను 36 రోజులపాటు చూపిస్తారు. అలా 36 రోజుల పాటు సినిమాను చూసిన ఆత్మలు తమ అస్తిత్వాన్ని మరిచి పోతాయి, లేనివాటిని ఉన్నవాటిగా భ్రమిస్తాయి, సినిమాలో చూసినదే నిజమయిన ప్రపంచంగా భావించటం మొదలుపెడతాయి. ఇలా కొత్త కొత్త నమ్మకాలతో ఉన్న ఈ ఆత్మలను విడిచి పెట్టేసిన తరువాత అవి గుంపులు పుంపులుగా ఏర్పడతాయి. సినిమా ప్రభావం వలన అవి తమ మధ్యన ఉన్న తేడాను కూడా గుర్తించలేవు. అలా ప్రతీ గుంపూ, పేలుడు తరువాత మిగిలిపోయిన శరీరాలలోకి వెల్లిపోతాయి. ఒక్కొక్క గుంపుకు ఒక్కో శరీరం ల్కభిస్తుంది. ప్రతీ గుంపులో వేలకొద్దీ ఆత్మలు ఉంటాయి.


ఇది జరిగిన కధ, ఈ ఆత్మలు ఇప్పుడు కూడా చాలా మంది శరీరాలను అంటిపెట్టుకుని ఉన్నాయంట. అలా అంతిపెట్టుకుని అందరినీ బాధిస్తున్నాయంట, అంతే కాదు మీకు కలిగే చాలా సందిగ్ధాలకు కారణం కూడా ఈ పిచ్చి పట్టిన ఆత్మలేనంట. అయితే ఈ ఆత్మలు Scientologists అనే వారిని ఏమీ చేయలేవంట, ఎందుకంటే వాళ్ళందరూ తమతమ శరీరాలనుండి ఈ ఆత్మలను తొలగించేసుకున్నారంట. అంటే మనం రామాయణ మహాభారతాలను నిజంగానే జరిగాయని ఎలా నమ్ముతామో, ఈ Scientologistలు కూడా పైన చెప్పిన ఆ కధను కూడా నిజంగా జరిగిన కధే అని నమ్ముతారు. అంతే కాదండోయ్ అమెరికాలో Scientologyని 1993లోనే ఒక మతంగా గుర్తించేసారు కూడా.

Tuesday, March 20, 2007

300

వాళ్ళు 300 మందే, కానీ 1000000 మంది శత్రు సైనికులను ఎదుర్కుంటారు. "Lord of the Rings" తరువాత సాంకేతిక పరంగా అంత అత్భుతమైన సినిమా అంటే ఇదే. ట్రెయిలర్స్ చూసిన తరువాత సినిమాలో నిరాశ పరుస్తాడేమో ఉనుకున్నాను. కానీ సినిమా ట్రెయిలర్స్ కంటే కూడా చాలా బాగుంది. "Sin City" సినిమాని నచ్చిందంటే మీకు ఈ సినిమా కూడా నచ్చి తీరాలి. ఈ సినిమాని నిజంగా ఒక కళా కండం అని చెప్పొచ్చు.


ఒకప్పటి గ్రీకులో జరిగిన సంఘటనకు కొంత కల్పన జోడించి ఈ సినిమాను రూపొందించారు. స్పార్టా అనేది ఒక చిన్న గ్రీకు పట్టణం. ఆ పట్టణంలో యువకులు యుద్దంలో మరణం ఒక అందమయిన మరణంగా భావిస్తారు. పుట్టినప్పటి నుండి వారిని యుద్దానికి పనికి వస్తారా-రారా అనే పరీక్షిస్తూ ఉంటారు. అప్పట్లో పెర్శియా ఒక బలమయిన రాజ్యం. అప్పటికే 1000 రాజ్యాలను జయించి గ్రీకు దేశాన్ని కూడా తనలో కలుపుకుందామని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే స్పార్టాను లొంగిపొమ్మని దూతలను పంపుస్తాడు. కానీ స్పార్టా రాజు అయిన లియోనిదాస్ దానికి ఒప్పుకోడు, ఫలితంగా ఈ యుద్దం.

ఈ సినిమాలో చూపించినంత ఎర్రగా, రక్తాన్ని ఇంకో సినిమాలో చూపించలేరేమో. అందుకనే నేను కూడా ఈ జాబును ఎర్రగా రాస్తున్నాను. నిజమయిన యుద్ద వాతావరనాని చూపిస్తారు సినిమాలో. శత్రు సైనికుల శవాలతో కొండనే తయారు చేస్తారు ఆ 300ల మంది. బాణాల వర్షం వళ్ళ ఏర్పడే నీడలో యుద్దం చేస్తారు. తలలు చేతులు కాళ్ళు అన్నీ అలా తెగి పడుతూనే ఉంటాయి. వయలెన్సుకి తాతలాంటిది ఈ సినిమా. ఈ సినిమాలో చూపించినంత హింసను నేను ఇంకో సినిమాలో చూడలేదు. మాంసాన్ని కోస్తున్న శబ్దమే వినపడుతుంది. అంత హింస ఉన్నాకూడా ఈ సినిమా మీద నాకు వ్యతిరేకత రాలేదు, పైగా ఇంకోసారి చూడాలని అనిపిస్తుంది.


ఈ సినిమాలో చాలా బాగాన్ని స్టూడియో లోపలే నీలిరంగు బెక్గ్రవుండ్‌లో తీసి, ఆ తరువాత దానిమీద బోలెడంత గ్రాఫిక్‌వర్క్ చేసారు. అందుకనే మనకు సినిమా చూస్తున్నంత సేపు వేరే లోకాన్ని చూస్తున్న ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ సినిమాను తియేటరులోనే చూడండి, DVDల కోసం వేచి చూడొద్దు. చూసినా మీరు హాలులో చూసినప్పుడు పొందే అనుభూతి పొందలేరు. ఈ చిత్రం ఈ యేటి మేటి చిత్రంగా ఆస్కారు అవార్డు పొందినా ఆశ్చర్యం లేదు.

యుట్యూబులో ఈ సినిమా ట్రెయిలరు చూడొచ్చు. ఈ ట్రెయిలరులో పిల్లలకు ఆమోదయూగ్యం కాని సన్నివేశాలు ఉండొచ్చు.

అంతే కాదు ఈ సినిమాకు ఇరానులో అప్పుడే వ్యతిరేకత కూడా మొదలయ్యింది. http://www.youtube.com/watch?v=H41h994hF6I

Thursday, January 04, 2007

ఉదకమండలం అందాలు

కొత్త సంవత్సరాన్ని నేను ఉదకమండలంలో జరుపుకున్నాను. ఆలా వెళ్ళినప్పుడు తీసిన ఫొటోలలో ఇవి కొన్ని. మరిన్ని ఫొటోల కోసం ఈ లింకును సందర్శించండి.

నా ఈ బ్లాగును కూడా చదివే వారు ఉన్నారు అని, ఇవా ఒక్క రోజులోనే వచ్చిన నాలుగు వ్యాఖానాలను చూస్తే తెలిసిపోయింది. అందుకనే ఒక బ్లాగు పాఠకుడు వ్యాఖానించినట్లుగా ప్రతీ చిత్రానికి కొంత సమాచారాన్ని చేర్చాను.


ఊటీ దగ్గరలోనే కూనూరు అనే ఇంకో అందమయిన ప్రదేశం ఉంటుంది. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక టీ ఫ్యాక్టరీ చూడటానికి వెళ్తున్నప్పుడు మార్గమంతా మనం ఇలాంటి అందమయిన టీ తోటలు చూడవచ్చు.
Scene - 09
అసలు పరిమాణం

ఈ సూర్యోదయం ఫొటో కాదు, సూర్యాస్తమయం ఫొటో. మధ్యానం 4 గంటలకు తీసాను. టీ తోటల మొక్కలతో పాటుగా మధ్యలో ఇలా కొన్ని ప్రత్యేకమయిన చెట్లు కూడా పెంచుతారు. అవి వర్షపునీటిని తమ వేర్లలో దాచుకుని టీ మొక్కలకు అందిస్తూ ఉంటాయంట. కాబట్టే టీ మొక్కలకు ప్రత్యేకంగా నీటి సరఫరాలంటిదేమీ ఉండదు.
Scene - 10
అసలు పరిమాణం

ఏనుగు కాలు చెట్టు (Elephant Leg Tree)... ఈ చెట్టు పేరుకు తగ్గట్లుగానే అచ్చం ఏనుగు కాలులాగానే ఉంటుంది. కూనూరు లోనే సింస్(sims) పార్కులో ఈ చెట్టును మనం చూడవచ్చు. ఫొటోలో కనపడటంలేదుకానీ ఈ చెట్టు చాలా ఎత్తు ఉంటుంది. ఇద్దరు ముగ్గురు పక్క పక్కనే నుంచుంటే ఉండేటంత లావు ఉంటుంది ఈ చెట్టు.
Elephant Leg Tree
అసలు పరిమాణం

మైసూరు నుంది ఊటీ వెల్తున్నప్పుడు కొంతదూరం తరువాత ఘాట్ రోడ్డు ప్రారంభమవుతుంది. మొంత్తం 36 మలుపులు(hairpin curves) ఉంటాయి. వాటిని ఎక్కేసరికి బండి ఇంజిను బాగా వేడెక్కిపోతుంది. అందుకనే బండికి నీళ్ళు తాగించటానికి మధ్యలో ఆపుతూ ఉంటారు. ఆలా ఆగినప్పుడు ఈ చెట్టు కనిపించింది. ఎందుకో తెలీదు కానీ ఈ చెట్టు, దాని వెనుక నీలి ఆకాశం నాకు చాలా బాగా నచ్చింది.
Lonely Tree
అసలు పరిమాణం

ఇది ఊటీ సరస్సు. ఈ సరస్సులో మనం బోటులో షికారు చేయవచ్చు. ఊటీలో ఇది ఒకానొక ప్రధాణాకర్షణ.
Ooty Lake
అసలు పరిమాణం

కూనూరు దగ్గరి టీ తోటల చిత్రాలు ఇంకొన్ని.
Scene - 07
అసలు పరిమాణం

వీటన్నిటినీ నేను మధ్యానం తీసాను. అయినా కూడా మంచు పోలేదు. అసలు అవి మేఘాలేమో... కూనూరు ఊటీ రెండూ ఎత్తయిన కొండల మీద ఉంటాయి కదా...
Scene - 08
అసలు పరిమాణం

సాయంత్రం 4 తరువాత ఇలా కొంచెం ఎండ కాసింది. అప్పటిదాకా ఉన్న చలివల్ల కావచ్చు ఎండ పడేసరికి చాలా హాయిగా అనిపించింది.
Scene - 11
అసలు పరిమాణం

ఫొటోలో సరిగ్గా రాలేదు కానీ, ఇది చాలా పెద్ద లోయ.
Scene - 12
అసలు పరిమాణం

ఇది టీ మొక్క కాదు, అసలు ఈ మొక్కకూ, ఊటీకి సంబందమే లేదు. మైసూరు నుండి ఊటీ వెల్తున్నప్పుడు మధ్యలో బోజనానికి ఆగాము. అక్కడ ఈ గడ్డి మొక్క కనిపిస్తే ఒక ఫొటో తీసాను. ఈ మొక్క పేరు కూడా నాకు తెలియదు.
Some Plants
అసలు పరిమాణం

హోటలు దగ్గర కనిపించిన ఈ పూలను బాగున్నాయని తీసాను కానీ నాకు ఈ పూల పేర్లు తెలీదు. ఊటీ ఉధ్యానవనంలో కూడా ఇవే పూలను ఒక చోట చూసాను.
Flowers
అసలు పరిమాణం

ఊటీ ఎత్తయిన కొండలలో ఉన్న ఒక చిన్న లోయ. ఈ ప్రాంతమంతా కొండలలో చుట్టుముట్టి ఉంటుంది. అలాంటి ఒక కొండపైకెక్కి తీసిన చిత్రమిది. మొత్తం ఊటీ కాకపోయినా, ఏదో కొంత ప్రాంతం వచ్చింది, ఈ ఫొటోలో...
Ooty Hill Top View - 1
అసలు పరిమాణం

ఊటీ వెళ్ళినప్పుడు తప్పకుండా చేయవలసిన పని ఇది. ఊటీ నుండి కూనూరుకు వెళ్ళటానికి ఒక ఒక రైలు బండి ఉంటుంది. ఎప్పుడో బ్రిటీషువాళ్ళ కాలంలో వేసిన పట్టాల మీద, దాదాపు అంతే పాతదయిన రైలు తిరుగుతూ ఉంటుంది. ఇది కేవలం పర్యాటకుల కోసమే తిరిగే రైలు. మెల్లగా ఒక మనిషి పరిగెత్తేటంత వేగంతో వెళ్తూ 20 కిమీల దూరాన్ని 2 గంటలలో తీసుకుని వెళ్తుంది. అలా మెల్లగా తీసుకుని వెళ్ళటం వలన దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాలను మనం చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఈ రౌలు ప్రయాణంలోనే మేము దాదాపు 100 ఫొటోలు దాకా తీసుకున్నాము. మద్య్హలో రెండు మూడు సొరంగమార్గాలు, ఇరువైపులా అందమయిన లోయలతో ప్రయానిస్తున్నంత సేపు, చాలా మంచి అనుభూతిని పొందవచ్చు.
Ooty-Koonoor Train
అసలు పరిమాణం

అర్ధరాత్రి 3 గంటలకు మైసూరులో ఒక నిర్మానుష్యపు రోడ్డులో తీసిన ఫొటోఇది...
Road Center
అసలు పరిమాణం

మైసూరు నుండి ఊటీకి వెళ్తున్నప్పుడు వచ్చే ఒక మలుపు ఇది.
Scene - 02
అసలు పరిమాణం

నగరాలలో యాంత్రిక జీవితానికి, రణగొణ ద్వనులకు అలవాటు పడిపోయిన వాళ్ళకు ఇలాంటి అందమయిన ప్రదేశంలో ఇలా ఒక ఒంటరి ఇల్లు కనిపిస్తే ...
Scene - 03
అసలు పరిమాణం

టీ కాకుండా ఇక్కడ ఇలా వేరే పంటలు కూడా పండిస్తారు మరి.
Scene - 06
అసలు పరిమాణం

ఈ ఫొటో చూసినప్పుడు గుర్తుకు వచ్చింది, ఊటీలో నీటికొరత. అందుకనే అక్కడ నీటిని చాలా జాగ్రత్తగా వాడు కుంటారు.
Stream of Water - 1
అసలు పరిమాణం

Wednesday, January 03, 2007

చాలా రోజులు ఆగాను

నా బ్లాగును కూడా బేటాలోకి మారుద్దేమోనని నేను చాలా రోజులు ఆగాను. కానీ అది మారే సూచనలు కనిపించటంలేదు. అందుకనే నా పాత బ్లాగు పేరు మార్చేసి, ఆదే పేరుతో ఈ కొత్త బ్లాగు సృస్టించేసాను. కొత్త సంవత్సరానికి నా పాత బ్లాగుకి ఇలా కొన్ని కొత్త మెరుగులు దిద్దాను.