Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts

Wednesday, July 23, 2008

ఈ సినిమా ఒక పజిల్


పోయినాదివారం, హరేరాం సినిమా చూసా. మొదటగా ఆ సినిమా దర్శకుడు హర్షవర్దన్ గారికి కొత్తదనంతో నిండున్న ఇలాంటి సినిమాను అందించినందుకు నేనర్లు. అప్పుడెప్పుడో కల్యాణరాందే అతనొక్కడే సినిమా చూసా, అందులో సినిమా మొదట్లోనే, మిగతా సినిమా మొత్తం ఉత్సాహంగా చూడాలనిపించేటట్లు చేసే సన్నివేశం ఒకటి చూపిస్తాడు. ఆ తరువాత మిగతా సినిమా కొంతవరకూ బలమైన కధతో, ఊహించలేనన్ని మలుపులతో బాగానే నడుస్తుంది. ఆ సినిమా బాగుంది కాబట్టి, రెండు సినిమాలలో కల్యాణ్‌రాం ఉన్నాడు కాబట్టి, ఈ సినిమా కూడా బానే ఉంటుందేమోననే ఒక Transitive Relation ఏర్పరచేసుకుని, స్నేహితులతో పాటుగా చెన్నై నగరానికి 30కీమీల అవతల ఉండే మాయాజాల్ అనే మల్టీప్లెక్సులో చూడటానికి వెళ్లా.

నా అంచనాలను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా, సినిమా మొదట్లోనే కొన్ని సంకేతాలొచ్చాయి. సినిమా మొదటి గంటలోనే అనేకానేక మలుపులు తిరిగి, చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ వచ్చేంతవరకూ నా స్నేహితుడు, ఈనాడువాడి మీద కేసేద్దామని అనుకున్నాడంట (ఈనాడులో ప్రియమణి CBI అని రాసాడు, కానీ అప్పటి వరకు, ఆమె పాత్రకూ CBIకి ఎటువంటి సంభందం కనిపించదు మరి!!). అప్పటికే సినిమాలో వచ్చిన బోలెడన్ని మలుపులను చూడటంవలన మేమందరం ఇంటర్వెల్ తరువాత మిగతా కథ ఎలా ఉంటుందోనని తలా ఒక థియరీని ఏర్పరిచేసుకున్నాం.

ఇంటర్వెల్ తరువాత సినిమాలో ఇంకొన్ని మలుపులతోనూ, ఆశ్చర్యకర సన్నివేశాలనూ కలుపుకుని సినిమా ముగుస్తుంది. అయితే మేము ఇంటర్వెల్ అప్పుడు ఏర్పరచుకున్న థియరీలన్నిటినీ కాకుండా దర్శకుడు తనదైన కొత్త థియరీతో సినిమాను నడిపిస్తాడు. అలా నేను తరువాత సన్నివేశంలో ఈ విధంగా జరుగుతుంది, అని అనుకుంటూ ఉంటే, సినిమా ఇంకో కొత్త మలుపు తిరిగి నేను అనుకున్నది జరగకుండా పోతుంది. అలా కొంతసేపటికి నేను ఏంజరుగుతుందో ఆలోచించటం మానేసి, మిగతా సినిమానంతా అక్కడ ఏంచూపిస్తే అది చూసా. మొత్తానికి సినిమా అయిపోయే సరికి నా మెదడు పాదరసంలా పనిచేయటం మొదలు పెట్టింది!

ఈ సినిమాలో నాకు నచ్చినవి:
  1. పాటలు, ముఖ్యంగా యాఖుదా జర ధేఖోనా అనే పాట. ఈ పాటను ఇప్పటికే వరకూ కొన్ని వందల సార్లయినా వినుంటాను.
  2. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో ఒక కథ ఉంది. చాలా రోజుల తరువాత కధ ఉన్న ఒక తెలుగు సినిమాను చూసాననిపించింది.
  3. క్లైమాక్సులో హీరోని పోలీసులూ, విలన్లూ కలిపి చేసింగు చేసే సన్నివేశం. ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు నాకు NFS most wantedలో hot pursuit, వేరేవాళ్లు ఎవరో ఆడుతుంటే, ఆ ఆటను నేను చూస్తున్నట్లు అనిపించింది (ఆటలో ఉన్నట్లే హెలీకాప్టర్ కూడా ఉంటుంది)
  4. మామూలుగా అన్ని తెలుగు సినిమాలలో కార్లూ సుమోలూ దేన్నయినా(ముఖ్యంగా హీరో ప్రయాణించే కారుని) గుద్దుకుని గాలిలోకి ఎగరాల్సొస్తే నిట్టనిలువుగా పైకి ఎగురుతూ ఉంటాయి, ఈ సినిమాలో మట్టుకూ కొత్తగా పక్కకు ఎగురుతుంది.

సినిమాలో నేను గమనించిన కొన్ని లోపాలు:
  1. కల్యాణ్‌రాం ఇందులో ఒక ACP పాత్ర పోషిస్తాడు. ఆ పాత్ర పేరు హరికృష్ణ, అయితే అతని యూనిఫాం మీద N.Krshna అనే పేరు ఉన్నట్లు అనిపించింది. ఇంకెవరైనా చూసి నేను చూసింది కరెక్టోకాదో చెప్పాలని మనవి.
  2. ఇంకో సన్ని వేశంలో సింధూ తులానీ పోషించిన పాత్ర ఆపదలో ఉంటుంది అలా ఆమె పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పుడే మూసేయబోతున్న ఒక ఇంటర్నెట్టు కఫేలోకి వెల్తుంది. వెళ్లి తన పరిస్తితిని వివరిస్తూ, ఈమెయిలును టైపు చేసేస్తుంది. అంత టెన్షన్లోనూ ఆమె పారాగ్రాఫు మొదట్లో ఖాళీలను వదిలి, మిగతా పారాగ్రాఫునంతటినీ చాలా అందంగా అమరుస్తుంది, కింద తన సిగ్నేచరు కూడా టైపుచేసేస్తుంది. ఇదంతా కూడా outlook లాంటి సాఫ్టువేరు నుండి చేసేస్తుంది. అంత టెన్షనులో ఆమె తన ఈమెయిలుని outlookలో కాన్‌ఫిగరు చేసుకుని మరీ, ఈమెయులుని పంపిందంటారా.
  3. హై సెక్యూరిటీ CBI జైళ్లలో హీరో గారు తప్పించు కోవడానికి వెంటిలేటర్లు ఎల్లవేలలా ఉంటాయి. పైగావారికి తాగటానికి coke tinలను కూడా ఇస్తుంటారు. (ఇది సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది).

మొత్తానికి సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటే గనక, నాకు ఒక పజిల్‌ని పరిష్కరించినట్లు అనిపించింది. అందుకనే కథ గురించి ఎక్కువగా చెప్పలేదు.

Monday, February 04, 2008

ఆణిముత్యాల్లాంటి రెండు సినిమాలు చూసాను

మొన్నా మధ్యన షేరు మార్కెట్టులో అన్ని కంపెనీల షేర్లు ఒక్కసారిగా ఠపీ ఠపీమని పడిపోవటంతో, చేతులు కాల్చుకుంది చాలని దాని జోలి వెళ్లటం మానేసాను. అయితే అలా షేరు మార్కెట్లో జరుగుతున్న మార్పులను చూడక పోవటం వలన చాలా ఖాళీ సమయం దొరికి ఇదిగో ఇలా కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు చూసాను.

అలా చూసిన మొదటి సినిమా ప్రేమికులు. ఈ సినిమా ఎప్పుడో 2005లోనే విడుదలైయింది. మామూలుగా అయితే ఈ సినిమాను చూసే వాడిని కాదు, కానీ నా రూంమేటు ఈ మధ్య తెలుగు సినిమాల సీడీలు తెగకోనేస్తూ ఉండటం వలన ఈ సినిమాను నేను కూడా చూడాల్సొచ్చింది. ఒకే కథతో రెండు సినిమాలను తీసి, ఆ రెండు సినిమాలనూ పక్కపక్కనే అతికించేస్తే తయారయ్యిందే ఈ సినిమా. మొదటి భాగంలో (అదే మొదటి సినిమాలో) ప్రేమికుల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవటంతో, మేడమీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయి, ఇసకలారీలో పడి గతం మర్చిపోతారు. రెండో సినిమాలో "అనుకోకుండా" కలుసుకుని మళ్లీ స్నేహితులయిపోతారు, కానీ వాళ్లకు వారి ప్రేమ గుర్తుకురాదు. వాళ్లకు గుర్తొస్తుందా, రాదా, అని మనం ఎంతో ఆతృతగా సినిమా చూస్తూ ఉంటే చివరాఖరున హీరోయిన్ పెళ్లయిపోయి అరుంధతీ నక్షత్రం చూస్తున్నప్పుడు, ఈ ప్రేమికుల కాలు జారి ఈతకొలనులో పడిన తరువాత వాళ్లకు, అప్పటికే తామిద్దరూ ప్రేమికులని గుర్తొస్తుంది. అప్పటికి మూడో సినిమాకోసం ఎదురు చూస్తున్న మాకు సినిమా అయిపోయినట్లు తెలిసి కొంచెం నిరాశ కలిగింది :(

సినిమాలో నాకు బాగా నచ్చిన సన్నివేశాలు రెండున్నాయి. ఈ రెండు చూట్లా మొత్తం సినిమా యునిట్టంతా చాలా బాగా కష్టపడ్డారు. అదేంటంటే హీరో-హీరోయిన్లు మేడమీద నుండి దూకు ఆత్మహత్య చేసుకోవాలను కునే సన్నివేశం ఒకటి, ఆ తరువాత చినిమా చివరణ కాలు జారి ఈతకొలనులో పడిపోయే సన్నివేశం ఇంకోటి. సాధారనంగా ఎవరయినా మేడమీదనుండి దూకి కొంద పడిపోవడానికి 5 సెకండ్లు పడిపోతుందేమో. కానీ అలా చూపిస్తే మన కెమెరామ్యాను పనితనం, స్టంటు మాస్టారు పనితనం సరిగ్గా చూపించలేమని, ఈ సన్నివేశాలను స్లో మోషన్లో చూపిస్తారు. అలా తీయడం వలన మేడమీదనుండి కింద పడిపోయే వాళ్లమొఖాలలో ఎటువంటి హావభావాలు పెడతారు, వాళ్లు కాళ్లెలా ఆడిస్తారు, చేతులేలా ఆడిస్తారన్నే విషయాలన్నీ డైరెక్టరుగారు మనకు చాలా బాగా వివరిస్తారు. ఈ వివరణంతా మనం ఎక్కడ మర్చి పోతామేమోనని క్లైమాక్సులో ఇంకోసారి హీరో-హీరోయిన్లను మేడమీదనుండి తోసేసి మనతో రివిజను చేపిస్తారు. సరిగ్గా గుర్తులేదు కానీ హీరో-హీరోయిన్లు మేడమీదనుండి పడిపోయేలోపట నేను వెళ్లి ఒక మాగీ ప్యాకెట్టు కొని తెచ్చుకుని వండుకుని తినేశాను, అంత వివరంగా చూపిస్తారు.

ఇప్పటికే ఈ సినిమాను చూడకపోతే గనక మీరీ సినిమాను తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. పైగా ఈ సినిమా Eternal Sunshine of the Spotless Mind అనే ఇంగ్లీషు సినిమాలానే ఉందంత, ఇందుకోసమైనా మీరీ సినిమాను తప్పక చూడాలి. చూసిన తరువాత సినిమాపై మీ అభిప్రాయాన్ని చెప్పటం మర్చిపోవద్దే.


నేను చూసిన రెండో సినిమా ఒక ఇంగ్లీషు సినిమా National Treassure: Book of Secrets ఈ సినిమా కూడా పై సినిమా లాగానే, ఒకే కథతో రెండు సినిమాలు తీసేసారు, అయితే ఇంగ్లీషోడు కొంచెం తెలివిగా దానిని రెండు సినిమాలుగా విడుదలచేశాడు. అయితే ఈ సినిమాలో కొత్తదనం లేదా అంటే ఉంది. మొదటిదాంట్లో ఎదో ఒక మ్యూజియంలోకి చొరబడి బయటకు వచ్చేస్తారు. ఈ సారి ఏకంగా బక్కింహాం ప్యాలెసులోకీ, స్వేతసౌధంలోకి మంచినీళ్లు తాగినంత సులువుగా చొరబడి మళ్లీ బయటకు వచ్చేస్తారు. అంతెందుకు అనుకున్నదే తడవుగా అమెరికా ప్రెసిడెంటునే కిడ్నాపు చేసిపడేస్తాడు మన హీరో.

cost cutting సూచనలు ఈ సినిమాలో బాగా కనిపించాయి, ఉదాహరణకు మొదటి సినిమాలో నిధి ఉన్న ప్రదేశంలోకి చేరిన తరువాత హీరో ఒక లైటు వెలిగిస్తాడు, వెలిగించిన ఆ మంట కాస్తా ఎంతో పెద్దగా ఉన్నా భావనంమొత్తం పరుచుకుని బోలెడంత వెలుగునిస్తుంది, ఈ సినిమాలో కూడా మళ్లీ హీరోనే నిధిని కనుక్కుని అక్కడ పక్కనే కనిపించే పాత్రలో మంటను వెలిగిస్తాడు, కానీ ఈసారి ఎదో కొంచెం ప్రదేశం మాత్రమే వెలుగుతుంది. నిధిలో బంగారం కూడా మొదటి సినిమా అంత పెట్టలేదు. అయితే డైరెక్టరు డబ్బునంతా సినిమా తారాగణాన్ని ఎన్నుకోవటంలో చూపెట్టాడు. ఈ సినిమాలో నికోలస్ కేజ్, హెలెన్ మిరెన్, జాన్ వోయిట్లు ఆస్కారు అవార్డు గెలుచుకోగా, ఎడ్ హారీస్, హార్వే కేయిటెల్లు ఆస్కార్ నామినేషను వరకూ వెళ్లారు. వీళ్లందరినీ తీసుకుని కొత్త కథను తీసుకోవడంలో cost cutting చేసేసినట్లున్నాడు మన డైరెక్టరు జాన్ టార్టెల్టాబుగారు. మొదటి సినిమాలో ఉన్నట్లే ఇందులో కూడా ఒక చేసింగు సీను ఉంటుంది, మొదటి సినిమాలో లాగానే పాతాళలోకంలోకి పోయే ఒక పేద్ద నిలువు సొరంగం ఉంటుంది. అయితే ఈ సారి విలనెనకమాల మొదటి సినిమాలో ఉన్నంత అనుచరగణం ఉండదు (cost cutting), కాబట్టి మన దృష్టినంతా ముఖ్య పాత్రలపైనే పెట్టి సినిమాను ఇంకా బాగా అస్వాదించవచ్చు. ఇందు మూలంగా నేను చేప్పేదేమిటంటే మీకు మొదటి సినిమా నచ్చితే, ఈ సినిమా కూడా మీకు బాగా నచ్చుతుంది, అది నచ్చక పోయినా సరే ఈ సినిమా మీకు నచ్చేస్తుందని నా ప్రగాడ విశ్వాసం. కాబట్టి ఈ సినిమాను కూడా మీరు తప్పక చూసేయాలి.

కొసమెరుపు: ఈ ఆణిముత్యాల్లాంటి సినిమాలను చూసిన తరువాత ఒక్క సారిగా, షేరు మార్కెట్టు మరీ అంత చెడ్డదేమీ కాదని అనిపిస్తుంది.

Monday, August 06, 2007

కుక్క మరియు దాని తోక

ప్రశ్న: కుక్క దాని తోకను ఎందుకు ఆడిస్తూ ఉంటుంది?
జవాబు: కుక్క తన తోకకంటే తెలివైనది కాబట్టి.

మరి తోకే కుక్క కంటే తెలివిగలదైతే...,
అప్పుడు తోకే కుక్కను ఆడిస్తూ ఉంటుంది!!!

"Wag the Dog" సినిమా ఈ పై ఆలోచనను నిజంగా జరిగితే ఎలా ఉంటుందో మనకు చూపిస్తుంది. రాజకీయ నాయకులు తాము చేసే కొన్ని తప్పులను, ఆకర్షనీయంగా ఉండే వార్తలను సృష్టించి ఏ విధంగా తప్పించుకుంటారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. 1997లో విడుదలైన ఈ సినిమా అమెరికా రాజకీయాలకు అనుగుణంగా తీసారు. ఇంకా పెద్ద వింతేమిటంటే ఈ సినిమా విడుదలైన నెల రోజుల తరువాత, ఈ సినిమాలో చూపించిన సంఘటనలు అమెరికా రాజకీయాలలో నిజంగానే జరిగాయి.

అమెరికాలో ఎన్నికలకు ఇంకా 2 వారాల సమయం ఉంటుంది. ప్రస్తుత అమెరికా అధ్యక్ష్యుడికి ప్రజలలో ఇంకా మంచి ఆధరాభిమానాలు ఉంటాయి. అయితే ఇంతలో ఒక సెక్స్ స్కాండలు బయటపడుతుంది, దానివలన అతని పాపులారిటీ దెబ్బతినే పరిస్తితి ఏర్పడుతుంది. దాని నుండి ప్రజల ఆలోచనలను మళ్లించటానికి, అధ్యక్ష్యుడికి ప్రచార సిబ్బంది ఒక నకిలీ యుద్దాన్ని సృష్టించాలని అనుకుంటారు. అలా సృష్టించాలంటే పత్రికలకూ, టీవీ చానల్లకూ ఆధారాలు చూపించాలి కాబట్టి, అలా ఆధారాలు తయారు చేయటానికి వారు ఒక హాలీవుడ్డు నిర్మాతను సంప్రదిస్తారు. ఆ తరువాత సినిమా అంతా ఈ నిర్మాత నకిలీ యుద్దాన్ని నిజమైన యుద్దమే నమ్మించటానికి తెయారు చేసే స్క్రిప్టులు, స్టంటులతో సినిమా చాలా రసవత్తరంగా సాగుతుంది.

చివరికి మచ్చపడ్డా కూడా నిర్మాతగారి మరియు అధ్యక్ష్యుడికి ప్రచార సిబ్బంది అత్భుత ప్రతిభా పాటవాల వలన, మచ్చపడ్డా కూడా ఇంకోసారి సారి అధ్యక్ష పదవిని అలకరించటంతో సినిమా ముగుస్తుంది...

మనరాష్ట్రంలో కూడా పార్టీలకు సొంత పత్రికలు, టీవీలు వచ్చేస్తుండటం వల్ల, మన పరిస్థితి కూడా తోకచే ఆడింపబడే కుక్కలాగా అయిపోతుందేమో.

Tuesday, March 20, 2007

300

వాళ్ళు 300 మందే, కానీ 1000000 మంది శత్రు సైనికులను ఎదుర్కుంటారు. "Lord of the Rings" తరువాత సాంకేతిక పరంగా అంత అత్భుతమైన సినిమా అంటే ఇదే. ట్రెయిలర్స్ చూసిన తరువాత సినిమాలో నిరాశ పరుస్తాడేమో ఉనుకున్నాను. కానీ సినిమా ట్రెయిలర్స్ కంటే కూడా చాలా బాగుంది. "Sin City" సినిమాని నచ్చిందంటే మీకు ఈ సినిమా కూడా నచ్చి తీరాలి. ఈ సినిమాని నిజంగా ఒక కళా కండం అని చెప్పొచ్చు.


ఒకప్పటి గ్రీకులో జరిగిన సంఘటనకు కొంత కల్పన జోడించి ఈ సినిమాను రూపొందించారు. స్పార్టా అనేది ఒక చిన్న గ్రీకు పట్టణం. ఆ పట్టణంలో యువకులు యుద్దంలో మరణం ఒక అందమయిన మరణంగా భావిస్తారు. పుట్టినప్పటి నుండి వారిని యుద్దానికి పనికి వస్తారా-రారా అనే పరీక్షిస్తూ ఉంటారు. అప్పట్లో పెర్శియా ఒక బలమయిన రాజ్యం. అప్పటికే 1000 రాజ్యాలను జయించి గ్రీకు దేశాన్ని కూడా తనలో కలుపుకుందామని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే స్పార్టాను లొంగిపొమ్మని దూతలను పంపుస్తాడు. కానీ స్పార్టా రాజు అయిన లియోనిదాస్ దానికి ఒప్పుకోడు, ఫలితంగా ఈ యుద్దం.

ఈ సినిమాలో చూపించినంత ఎర్రగా, రక్తాన్ని ఇంకో సినిమాలో చూపించలేరేమో. అందుకనే నేను కూడా ఈ జాబును ఎర్రగా రాస్తున్నాను. నిజమయిన యుద్ద వాతావరనాని చూపిస్తారు సినిమాలో. శత్రు సైనికుల శవాలతో కొండనే తయారు చేస్తారు ఆ 300ల మంది. బాణాల వర్షం వళ్ళ ఏర్పడే నీడలో యుద్దం చేస్తారు. తలలు చేతులు కాళ్ళు అన్నీ అలా తెగి పడుతూనే ఉంటాయి. వయలెన్సుకి తాతలాంటిది ఈ సినిమా. ఈ సినిమాలో చూపించినంత హింసను నేను ఇంకో సినిమాలో చూడలేదు. మాంసాన్ని కోస్తున్న శబ్దమే వినపడుతుంది. అంత హింస ఉన్నాకూడా ఈ సినిమా మీద నాకు వ్యతిరేకత రాలేదు, పైగా ఇంకోసారి చూడాలని అనిపిస్తుంది.


ఈ సినిమాలో చాలా బాగాన్ని స్టూడియో లోపలే నీలిరంగు బెక్గ్రవుండ్‌లో తీసి, ఆ తరువాత దానిమీద బోలెడంత గ్రాఫిక్‌వర్క్ చేసారు. అందుకనే మనకు సినిమా చూస్తున్నంత సేపు వేరే లోకాన్ని చూస్తున్న ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ సినిమాను తియేటరులోనే చూడండి, DVDల కోసం వేచి చూడొద్దు. చూసినా మీరు హాలులో చూసినప్పుడు పొందే అనుభూతి పొందలేరు. ఈ చిత్రం ఈ యేటి మేటి చిత్రంగా ఆస్కారు అవార్డు పొందినా ఆశ్చర్యం లేదు.

యుట్యూబులో ఈ సినిమా ట్రెయిలరు చూడొచ్చు. ఈ ట్రెయిలరులో పిల్లలకు ఆమోదయూగ్యం కాని సన్నివేశాలు ఉండొచ్చు.

అంతే కాదు ఈ సినిమాకు ఇరానులో అప్పుడే వ్యతిరేకత కూడా మొదలయ్యింది. http://www.youtube.com/watch?v=H41h994hF6I

Friday, June 03, 2005

"చిరునవ్వుతో" సినిమా గురించి

మొన్న సెలవలలో హైదరాబాదు కోఠీకి వెళ్ళాను. అక్కడ ఉన్న "Supreme House"లో original vcdలు 60/- రూపాయలకే అమ్మి నాతోటి కూడా మూడు vcdలను కొనిపించేసారు. అలా నేను కొన్నవాటిలో "చిరునవ్వుతో" ఒకటి. మొదటిసారి హాళ్ళో చూసినప్పుడు సినిమా బాగానే అనిపించింది కానీ, మరీ నిన్న చూసినంత లోతుగా చూడలేదు. సినిమాలో సంభాషనల మధ్యలో చాలా జీవితసత్యాలు దొర్లుతూవుంటాయి. మచ్చుకు కొన్ని ఇవిగోండి:

1. బాయ్ ఫ్రెండ్సు ఆడపిల్లల అందానికి కాంప్లిమెంట్సు - కధానాయిక షహీన్ తన కాబోయే భర్త ప్రకాష్ రాజుతో తన మగ స్నేహితులను పరిచయం చేస్తునప్పుడు చెబుతుంది. అప్పుడు వెంటనే నాకు ఒక సందేహం వచ్చింది. మరి గార్ల్ ఫ్రెండ్సు మగపిల్లలకు ఏమిటబ్బా ...

2. ఒక అమ్మాయి-అబ్బాయి ప్రేమించుకోడానికి ఎంత టయిం కావాలి, గంట కావాలా, వారం, నెల, సంవత్సరం చాలా. - ఈ విషయంలో మటుకు ప్రేమకు మాత్రమే సంబందించినది కాదు అనుకుంటా, ఒక వ్యక్తి మీద అభిప్రాయం ఏర్పరుచు కోవటం, అనే conceptకి generalize చేయొచ్చేమో. అందుకనేనేమో ఆంగ్లములో "first impression is the best impression" అనే నానుడి పుట్టుకొచ్చిందనుకొంటా.

3. చూడు పరిచయం అయిన వాళ్ళంతా స్నేహితులు కాలేరు, స్నేహితులందరూ ప్రేమికులు కాలేరు. నా స్నేహం నీకు ప్రేమగా అనిపించి ఉండొచ్చు, కానీ నీ పరిచయం మాత్రం నా వరకు స్నేహం దగ్గరే ఆగిపోయింది.

Friday, November 19, 2004

నాకు నచ్చిన పాట

ఏ రొజైతే చూసానొ నిన్ను
ఆ రోజే నువైపోయా నేను...

ఏ రోజైతే చూసానొ నిన్ను
ఆ రోజే నువైపోయా నేను...
కాలం కాదన్నా ఏ దూరం వద్దన్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నానూ...

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో ...
నీ రూపే నా వేచె గుండెల్లొ...
నెన్నటి నీ స్వప్నం, నన్ను నడిపిస్తూ ఉంటె
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా...

నీ కష్టంలొ నేను ఉన్నానూ...
కరిగే నీ కన్నీరవుతా నేనూ...
చంపల్లో జారి, నీ గుండెల్లొ చేరి
నీ ఏకాంతంల్లో ఓదార్పౌతానూ...

...

కాలం ఏదో గాయం చేసిందీ...
నిన్నే మాయం చేసానంటోందీ...
లోకం నమ్మి అయ్యో అంటుంది
శొకం కమ్మి జోకొడతానందీ...

గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్ష్యం ఇస్తున్నా...

నీతో గడిపే ఆగని క్షణాల్నీ...
నాలొ నాకే గుండెల సవ్వడులే...
అవి చెరిగాయంటె నే నమ్మేదెట్లాగ
నువ్వులేకుంటే నేనంటు ఉండనుగా...

నీ కష్టంలొ నేను ఉన్నానూ...
కరిగే నీ కన్నీరవుతా నేనూ...
చంపల్లో జారి, నీ గుండెల్లొ చేరి
నీ ఏకాంతంల్లో ఓదార్పౌతానూ...

ఏ రోజైతే చూసానొ నిన్ను
ఆ రోజే నువైపోయా నేను...
కాలం కాదన్నా ఏ దూరం వద్దన్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నానూ...