
మొదటగా నా వల్ల జరిగిన ఒక సంఘటనను వివరిస్తా. ఒకసారి హైదరాబాదు కోఠీలో ఒక హాస్టలులో ఉంటున్న స్నేహితుడిని కలవటానికి వెల్లాను. మధ్యాహ్నం బాగా లేటు అవ్వటంతో ఆ హాస్టలులో ఉన్న మెస్సులోనే భోజనం కూడా చేసేద్దాం అని అనుకున్నా. మెస్సతను కూడా చాలా చాలా ఆనందంగా 15/- ఇచ్చి భోజనం చేసేయండని చెప్పాడు. భోజనం దగ్గర అన్ని పధార్ధాలూ అక్కడ ఒక దగ్గర ఉంటే ఎవరికి వాళ్లు వెళ్లి వడ్డించేసుకుని తినేసేయాలి (buffet type అన్నమాట). చూడటానికి ఒక TV కూడా పెట్టాడు. నేను ఏమేం కూరలో వెతికితే పప్పు కనపడింది (టమాటో పప్పు అనుకుంటా). రుచి చూసా, అమృతంలా అనిపించింది, పప్పుకి అంత మంచి రుచి తీసుకువచ్చిన ఆ మెస్సతనికి వెంటనే సన్మానం చేసేయాలని అనిపించింది. ఓ పక్క TV చూస్తూ ఇంకో పక్క పప్పులో అన్నం నంచుకుంటూ నా మానాన నేను తింటూ ఉన్నా. కొంత సేపటికి (ఓ గంట తరువాత అనుకుంటా) ఆ హాస్టలులో ఉండే వాళ్లు వచ్చారు తింటానికి, వాళ్లకు పప్పు తప్ప అన్ని కూరలూ నిండుగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత వాళ్లు వెళ్లి మెస్సతనితో గొడవపెట్టుకోవడం, నేను తింటం ఆపేసి (పప్పు అయిపోయింది కాబట్టి ఆపేయాల్సి వచ్చింది), డబ్బులిచేసి అక్కడి నుండీ చల్లగా జారుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. తరువాత తెలిసింది అక్కడ అరగంటలోనే మళ్లీ పప్పుని వండేశారంట.
అయితే అందరూ తయారు చేసే పప్పు కూరలు ఒకే రకంగా ఉండవు. కొందరు పప్పుని మెత్తగా ముద్దలా అయ్యేదాకా ఉడకబెడితే, ఇంకొందరు పప్పుని ఉడికీఉడకకుండా ఇంకా పప్పులుగానే కనిపించేటట్లు తయారు చేస్తారు. పెసర పప్పూ, కందిపప్పులకు నాకు మొదటి రకం బాగా ఇష్టం, శనగ పప్పుకయితే రెండో రకం బాగా ఇష్టం. అంతే కాదు, ఈ పప్పుని రకరకాలుగా వండుకోవచ్చని మీ అందరికీ తెలిసే ఉంటుంది: ముద్దపప్పు, టమాటో పప్పు, దోసకాయ పప్పు, బీరకాయా శనగ పప్పు, ఇలాంటివన్నీ కాక ఎన్నిరకాల ఆకుకూరలు ఉంటాయో అన్ని రకాల ఆకుకూరపప్పులు ఉంటాయి.

కుక్కరు తెరిచిన తరువాత అందులోని పప్పుని ఒక సారి కలిపి కొంచెం పలచగా చేయడానికి తగినంత(ఒక కప్పు సరిపోతాయి) నీళ్లు పోయాలి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి, నీళ్లు, ఉప్పు, పప్పు కలిసే వరకూ తిప్పండి. తరువాత అందులో తాలిపు వేసేసి కొత్తిమీర జల్లితే ఘుమఘుమలాడే పప్పు తయారు.