Wednesday, July 23, 2008

ఈ సినిమా ఒక పజిల్


పోయినాదివారం, హరేరాం సినిమా చూసా. మొదటగా ఆ సినిమా దర్శకుడు హర్షవర్దన్ గారికి కొత్తదనంతో నిండున్న ఇలాంటి సినిమాను అందించినందుకు నేనర్లు. అప్పుడెప్పుడో కల్యాణరాందే అతనొక్కడే సినిమా చూసా, అందులో సినిమా మొదట్లోనే, మిగతా సినిమా మొత్తం ఉత్సాహంగా చూడాలనిపించేటట్లు చేసే సన్నివేశం ఒకటి చూపిస్తాడు. ఆ తరువాత మిగతా సినిమా కొంతవరకూ బలమైన కధతో, ఊహించలేనన్ని మలుపులతో బాగానే నడుస్తుంది. ఆ సినిమా బాగుంది కాబట్టి, రెండు సినిమాలలో కల్యాణ్‌రాం ఉన్నాడు కాబట్టి, ఈ సినిమా కూడా బానే ఉంటుందేమోననే ఒక Transitive Relation ఏర్పరచేసుకుని, స్నేహితులతో పాటుగా చెన్నై నగరానికి 30కీమీల అవతల ఉండే మాయాజాల్ అనే మల్టీప్లెక్సులో చూడటానికి వెళ్లా.

నా అంచనాలను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా, సినిమా మొదట్లోనే కొన్ని సంకేతాలొచ్చాయి. సినిమా మొదటి గంటలోనే అనేకానేక మలుపులు తిరిగి, చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ వచ్చేంతవరకూ నా స్నేహితుడు, ఈనాడువాడి మీద కేసేద్దామని అనుకున్నాడంట (ఈనాడులో ప్రియమణి CBI అని రాసాడు, కానీ అప్పటి వరకు, ఆమె పాత్రకూ CBIకి ఎటువంటి సంభందం కనిపించదు మరి!!). అప్పటికే సినిమాలో వచ్చిన బోలెడన్ని మలుపులను చూడటంవలన మేమందరం ఇంటర్వెల్ తరువాత మిగతా కథ ఎలా ఉంటుందోనని తలా ఒక థియరీని ఏర్పరిచేసుకున్నాం.

ఇంటర్వెల్ తరువాత సినిమాలో ఇంకొన్ని మలుపులతోనూ, ఆశ్చర్యకర సన్నివేశాలనూ కలుపుకుని సినిమా ముగుస్తుంది. అయితే మేము ఇంటర్వెల్ అప్పుడు ఏర్పరచుకున్న థియరీలన్నిటినీ కాకుండా దర్శకుడు తనదైన కొత్త థియరీతో సినిమాను నడిపిస్తాడు. అలా నేను తరువాత సన్నివేశంలో ఈ విధంగా జరుగుతుంది, అని అనుకుంటూ ఉంటే, సినిమా ఇంకో కొత్త మలుపు తిరిగి నేను అనుకున్నది జరగకుండా పోతుంది. అలా కొంతసేపటికి నేను ఏంజరుగుతుందో ఆలోచించటం మానేసి, మిగతా సినిమానంతా అక్కడ ఏంచూపిస్తే అది చూసా. మొత్తానికి సినిమా అయిపోయే సరికి నా మెదడు పాదరసంలా పనిచేయటం మొదలు పెట్టింది!

ఈ సినిమాలో నాకు నచ్చినవి:
  1. పాటలు, ముఖ్యంగా యాఖుదా జర ధేఖోనా అనే పాట. ఈ పాటను ఇప్పటికే వరకూ కొన్ని వందల సార్లయినా వినుంటాను.
  2. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో ఒక కథ ఉంది. చాలా రోజుల తరువాత కధ ఉన్న ఒక తెలుగు సినిమాను చూసాననిపించింది.
  3. క్లైమాక్సులో హీరోని పోలీసులూ, విలన్లూ కలిపి చేసింగు చేసే సన్నివేశం. ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు నాకు NFS most wantedలో hot pursuit, వేరేవాళ్లు ఎవరో ఆడుతుంటే, ఆ ఆటను నేను చూస్తున్నట్లు అనిపించింది (ఆటలో ఉన్నట్లే హెలీకాప్టర్ కూడా ఉంటుంది)
  4. మామూలుగా అన్ని తెలుగు సినిమాలలో కార్లూ సుమోలూ దేన్నయినా(ముఖ్యంగా హీరో ప్రయాణించే కారుని) గుద్దుకుని గాలిలోకి ఎగరాల్సొస్తే నిట్టనిలువుగా పైకి ఎగురుతూ ఉంటాయి, ఈ సినిమాలో మట్టుకూ కొత్తగా పక్కకు ఎగురుతుంది.

సినిమాలో నేను గమనించిన కొన్ని లోపాలు:
  1. కల్యాణ్‌రాం ఇందులో ఒక ACP పాత్ర పోషిస్తాడు. ఆ పాత్ర పేరు హరికృష్ణ, అయితే అతని యూనిఫాం మీద N.Krshna అనే పేరు ఉన్నట్లు అనిపించింది. ఇంకెవరైనా చూసి నేను చూసింది కరెక్టోకాదో చెప్పాలని మనవి.
  2. ఇంకో సన్ని వేశంలో సింధూ తులానీ పోషించిన పాత్ర ఆపదలో ఉంటుంది అలా ఆమె పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పుడే మూసేయబోతున్న ఒక ఇంటర్నెట్టు కఫేలోకి వెల్తుంది. వెళ్లి తన పరిస్తితిని వివరిస్తూ, ఈమెయిలును టైపు చేసేస్తుంది. అంత టెన్షన్లోనూ ఆమె పారాగ్రాఫు మొదట్లో ఖాళీలను వదిలి, మిగతా పారాగ్రాఫునంతటినీ చాలా అందంగా అమరుస్తుంది, కింద తన సిగ్నేచరు కూడా టైపుచేసేస్తుంది. ఇదంతా కూడా outlook లాంటి సాఫ్టువేరు నుండి చేసేస్తుంది. అంత టెన్షనులో ఆమె తన ఈమెయిలుని outlookలో కాన్‌ఫిగరు చేసుకుని మరీ, ఈమెయులుని పంపిందంటారా.
  3. హై సెక్యూరిటీ CBI జైళ్లలో హీరో గారు తప్పించు కోవడానికి వెంటిలేటర్లు ఎల్లవేలలా ఉంటాయి. పైగావారికి తాగటానికి coke tinలను కూడా ఇస్తుంటారు. (ఇది సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది).

మొత్తానికి సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటే గనక, నాకు ఒక పజిల్‌ని పరిష్కరించినట్లు అనిపించింది. అందుకనే కథ గురించి ఎక్కువగా చెప్పలేదు.

Saturday, July 05, 2008

ఇప్పుడు నేను చెన్నైవాసిని

నేటితో చెన్నై వచ్చి సరిగ్గా రెండు నెలలయ్యింది. ఇక్కడికి వచ్చె ముందు ఇక్కడి వాతావరణం గురించి అందరూ చాలా చాలా బయపెట్టారు, కానీ కొత్త ఉద్యోగం బాగా నచ్చి వచ్చేసాను. వచ్చిన తరువాత ఇక్కడి వాతావరనం విజయవాడ ఎండలు కంటే బానే ఉన్నట్లు అనిపించింది!!!

వచ్చిన తరువాత మొదటి శనివారం మెరీనా బీచ్‌కి వెళ్లి సముద్రాన్ని చూద్దామని అనుకున్నాం. అయితే మొదటిసారిగా సముద్రమంటే నీళ్లతోనే కాకుండా జనాలతో కూడా తయారవుతుందని ప్రత్యక్షంగా చూసాం. శనివారం, ఆదివారాలు మాలానే ఇంకా చాలా మంది అనుకుంటూ ఉంటారని అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది. అప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లాగా సముద్రాన్ని చూద్దామని సముద్రపు ఒడ్డున ఉండే ఇసకమీద అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ చివరికి నీళ్ల దగ్గరకు చేరుకునే సరికి చీకటి పడిపోయింది. మొత్తానికి, ఇలాంటి ఇంకో సాయంత్రం అవుతుందని వెళ్లిన మాకు చాలా పెద్దనిరాశ.

అలా కొన్ని రోజులపాటు ఎటూ వెళ్లకుండా, కొన్ని రోజుల తరువాత మళ్లీ ఏదో ఒక సముద్రపు బీచ్‌కి, అదీ జనాలు లేని బీచ్‌కి వెల్లాలని బాగా ప్లానేసి, స్కెచ్చుగీసి, చెన్నై నుండి 30కీమీల దూరంలో ఉండే మహాబలిపురం వెళ్లాలని నిర్ణయించాం. సాయంత్రమైతే చాలా మంది ఉంటారని, మధ్యాహ్నం అయితే ఎవరూ ఉండరని 10:30 కి బయలుదేరి 12 కల్లా అక్కడికి చేరుకున్నాం. ఒక గంట పాటు అక్కడ ఉన్న గుడిని, దాన్ని చూడటానికి వచ్చిన టూరిస్టులను చూసి, కొన్ని ఫొటోలు కూడా దిగేసాం.


తరువాత ఆ గుడికే ఆనుకుని ఉండే సముద్రం దగ్గరకు వెళ్లాం. మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా అక్కడ ఇంత మంది ఉంటారని ఏమాత్రం ఊహించలేదు. కాకపోతే మెరీనా బీచ్‌కంటే ఇది చాలానయం.


మొన్నామధ్య సునామీ వచ్చినప్పుడు ఈ గుడి కూడా మునిగి పోయినట్టుంది, ఈ సారి గుడికేమీ జరగ కూడాదని, ఆ గుడికీ, దాని వెనుక ఉండే సముద్రానికీ మధ్యన పెద్ద పెద్ద బండరాళ్లతో నింపేసారు.


తరువాత అక్కడున్న బండరాళ్ల మీద చాలా సేపు కూర్చుని, సముద్రపు అలలు వచ్చి ఈ బండరాళ్లను ఢీకొట్టటం చూస్తూ కూర్చున్నాం.


---
ప్రస్తుతానికి "తమిళ్ తెరియాదు" అనే వాక్యాన్ని నేర్చుకున్నా. అదేంటో గానీ ఆ వ్యాక్యాన్ని ప్రయోగించిన ప్రతీసారీ ఎదుటోళ్లు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో అరిచేస్తూ ఉంటారు... నేను తరువాత ఇంగ్లీషులో ఏదో మాట్లాడతాను, తరువాత వాళ్లు తమిళంలో ఇంకేదో మాట్లాడతారు. ఇదంతా కాదని చివరికు సైగలతోనూ, ఏకపద వాక్యాలతోనూ నెట్టుకురావడం మొదలుపెట్టా.

ఇదే క్రమంలో మొన్నమధ్య దశావతారం సినిమాని తమిళంలో చూసా. సినిమా నాకు బానే అనిపించింది, కాకపోతే ఇంటర్వెల్ తరువాత వచ్చే అసిన్ పాత్రను కట్ చేసేసి అవతల పారేస్తే బాగుండేదనిపించింది; ఏంటో మరి ఆ పాత్రను మొదటిసారిగా చూపించే పాటలో తప్ప తరువాతంతా ఏదేదో అరుస్తూనే ఉంటుంది, చిరాగ్గా...