Sunday, July 29, 2007

రూపాయి విలువ

నేను ఇన్ని రోజు డాలరుతో రూపాయి విలువ పెరగటం వలన మనకు ఇక్కడ అన్నీ లాభాలే అని భావిస్తూ ఉండేవాడిని. అంటే డాలరు విలువతో మన రూపాయి విలువ సమానంగా అవుతున్న కొద్దీ ఇక్కడ మన జీవన ప్రమాణాలు కూడా అమెరికా జీవన ప్రమాణాలకు దగ్గరగా అవుతాయి అని అనుకుంటూ ఉండే వాడిని. 1000 డాలర్లు ఉండే ల్యాప్‌టాపుని ఇప్పుడు 40000 రూపాయలకే కొనుక్కోవచ్చు, అంటే ఇక్కడ మనం సుమారు 10000 మిగుల్చుకున్నాము. ఇంకో రకంగా చెప్పాలంటే రూపాయి విలువ పెరుగుతున్నంత కాలం, మన కొనుగోలు శక్తి పెరుతుంది. అంటే దిగుమతుల వ్యాపారం కనీ వీనీ ఎరుగనంత లాభాలు ఆర్జిస్తున్నాయన్నమాట.

కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, రెండో వైపు ఎగుమతులు ఉన్నాయి. భారత దేశంలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న రంగమైన సాఫ్టువేరు రంగం, పూర్తిగా ఎగుమతుల మీదనే ఆధారపడుతున్న రంగం. ఈ రంగం అతిపెద్ద వినియోగదారుడు నిస్సంకోచంగా అమెరికానే. అయితే డాలరు విలువ 49 రూపాయల నుండి 40 రూపాయలకు పడిపోయిందంటే ఇది సాఫ్టువేరు కంపెనీలకు చాలా పెద్ద దెబ్బ. కంపెనీలకే కాదు వాటిలో పనిచేసే కూలీలకు కూడా ఈ దెబ్బ తగులుతుంది. అది ఎలా గంటే డాలరు విలువ పడిపోవటం వలన, ఇక్కడ రూపాయలలో జీతం తీసుకునే సాఫ్టువేరు కూలీలకు, జీతాలు పెంచక పోయినా కూడా
ఎక్కువ డాలర్లు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు సాఫ్టువేరు కంపెనీలు తమ మీదున్న భారాన్ని ఈ కూలీల పైకి కూడా తోసేయటానికి ప్రయత్నించవచ్చు.

ఒక సాఫ్టువేరు కూలీగా రూపాయి విలువ మళ్లీ పడిపోతే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఒక భారతీయుడిగా చూస్తే ఇది
మనందరికీ చాలా శుభసూచకం అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా మనదేశంలో మట్టుకు పెరగలేదు. ఇది పెరిగిన రూపాయి మహత్యమే. ఇలాంటి లాభాలు ఇంకా చాలా ఉంటాయి. వాటిలో ఒకటి మన మీద వేసే పరోక్ష పన్నులను తగ్గించటం, కూడా ఉండొచ్చు.

పెరిగిన రూపాయి విలువ తీసుకొచ్చిన సమస్యలపై ఇవాల్టి ఈనాడులో ఆదివారం అనుభందంలో వచ్చిన శ్రీధర్ కార్టూను చూడండి.

Monday, July 16, 2007

జింప్ మరియు ఇంక్‌స్కేప్

జింప్ మరియు ఇంక్‌స్కేప్ ఈ రెండూ వేర్వేరు అవసరాలకు ఉపయోగించగలిగే సాఫ్టువేర్లు. రెండిటినీ ఉపయోగించి బొమ్మలపై చిన్న చిన్న మార్పులు-చేర్పులు చేసుకోవచ్చు. రెండు సాఫ్టువేర్లు అంతర్గతంగా rendering కొరకు GTKను ఉపయోగిస్తాయి. కాబట్టి GTKలో యూనీకోడ్ తెలుగు rendering ఉంటే రెండిటిలోనూ, మనకు తెలుగు కనిపిస్తుంది.

ఇంక్‌స్కేప్ ఒక వెక్టారు గ్రాపిక్సు పరికరం. అంటే గీతలతో తయారు చేయగలిగే బొమ్మలకు ఎక్కువగా ఉపయోగపడుతుందన మాట. గీతలతో తయారు చేయగలిగే బొమ్మలంటే మ్యాపులను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. 3డ్ బొమ్మల తయారీలో తయారు చేసే వైర్‌ఫ్రేములు(wireframes) కూడా ఇంక్‌స్కేప్‌లోతయారు చేయవచ్చు. వెక్టారు గ్రాపిక్సుకు XML ప్రామాణికమయిన SVGని చాలా వరకు support చేస్తుంది. ఇంక్‌స్కేప్‌లో మామూలు పొటోలపై కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కానీ అలాంటి పనులకు జింప్‌ను వాడటం ఉత్తమం. ఇంక్‌స్కేప్‌లో మీరు వెక్టారు బొమ్మలను తయారు చేసి వాటిని SVGలో బద్రపరచుకూవచ్చు కూడా.

జింప్‌తో మనం ఫొటోలపై మార్పులు చేర్పులు చేయవచ్చు. ఉదాహరణకు, నలుపు-తెలుపు ఫొటోలను రంగుల ఫొటోలుగా మార్చుకోవడం, మరకలుపడి పాడయిన ఫొటోలపై మరకలను తొలగించి బాగుచేయటం లాంతివి చేయొచ్చు. అవే కాకుండా నేను చిరంజీవితో కరచాలనం చేస్తూ ఫొటో దిగినట్లు లేకపోతే ఇల్లియానా నేను కలిసి గోవా బీచిలలో డ్యాన్సు వేస్తునట్లు ఫొటోలను తయారుచేసుకోవచ్చనమాట (ఇలాంటివి నిజజీవితంలో జరగవు కాబట్టి ఇలాంటి శునకానందాలు వస్తుంటాయి అప్పుడప్పుడు).

జింప్ మరియు ఇంక్‌స్కేప్ రెండూ ఉచితంగా లభించే సాఫ్టువేర్లు. Adobe వారి Photoshop(ఫొటోల కోసం) మరియు Illustrator(గీతల కోసం)లు కూడ ఇలాంటి అవసరాల కోసమే ఉపయోగిస్తారు. కానీ వాటిని కొనుక్కుని వాడాలి కాబట్టి జింప్ మరియు ఇంక్‌స్కేప్‌ల కంటే బాగాపనిచేస్తాయని అనిపించవచ్చు.


ఎప్పుడో నెల రోజుల క్రితం రాసి మధ్యలో ఆపేసిన పోస్టు ఇది, ఏదో మారథాను కాదా అని బూజు దులిపి, కొంచెం బాగు చేసి, పది లైన్లు ఉన్నాయో లేదో చూసి పోస్టు చేస్తున్నాను.

Friday, July 06, 2007

Alt+Shift+s

ఏమిటో ఈ మధ్య Alt+Shift+s కీ కాంబినేషను చాలా విరివిగా ఉపయోగించేస్తున్నాను. అవే కాదండీ, Alt+Shift+p కూడా. ఎవరికయినా మెయిలు పంపాలని అనుకుంటే, మెయిలులో సందేశాన్ని మొత్తం టైపు చేసేసి వెంటనే దానిని పంపించటానికి Alt+Shift+s, అని ఓ నొక్కు నొక్కుతున్నాను. నొక్కిన తరువాత నేను నొక్కాల్సిన చోట కాకుండా ఇంకో చోట నొక్కుతున్నానని ప్రతీ సారీ నాలికర్చుకోవలసి వస్తుంది. అలాగే పంపించే ముందు ప్రీవ్యూ చూడాలని అనుకున్నప్పుడు పని చేయదని తెలిసి కూడా, Alt+Shift+p అని నొక్కేస్తున్నాను.

అరె ఇప్పుడు కూడా ఈ పోస్టుని పంపీయడానికి Alt+Shift+s అని నొక్కేస్తున్నాను, హతోస్మీ!!!...

Wednesday, July 04, 2007

రెండవ బెబ్లాసా సమావేశం

మొదటిగా, శుక్రవారం సాయంత్రం నవీన్ గార్ల గారి నుండి gtalk‌లో నాకు పిలుపు వచ్చింది. శనివారం కానీ, ఆదివారం కానీ కలుద్దామని చెప్పారు. సరేమరి ప్రవీణ్‌ను కూడా అడిగి నాకు ఎప్పుడు ఎక్కడికి రావాలో ఫోను చేసి చెప్పండని, చెప్పాను. అంతకు ముందు రోజు రవికుమార్ మండాలా నా దగ్గరకు వచ్చి ఈ వికీపీడియా కధా కమీషూ ఏమిటో కనుక్కుందామని, శనివారం నా రూముకు వస్తానన్నాడు.

ఎప్పటిలాగానే శనివారం ఆఫీసులేదని కొంచెం ముందే నిద్రలేచాను :) ఏంచేయాలో తోచక వికీపీడియాలో వ్యాసాలను కెలుకుతూ కూర్చున్నాను. రవీ వస్తాననడం గుర్తొచ్చి, రమ్మని ఫోను చేసాను. ఇంకో అరగంట తరువాత ఎప్పుడూ సైలెంటు మోడులో ఉండే నా సెల్లులోని మిస్సుడు కాల్సు చూస్తే నవీన్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చిందని ఉంది. ఫోన్‌చేస్తే నవీన్, ప్రవీణ్ ఇద్దరూ సమావేశమై అప్పుడే గంటయ్యిందని చెప్పాడు. రవీ వచ్చేవరకూ ఆగి అతనిని కూడా అటు పట్టుకెళ్ళాను.

వెళ్ళిన వెంటనే ఒక ప్లేటులో కాజూబర్ఫీ, ఇంకో ప్లేటులో హాటు వచ్చేసాయి మాదగ్గరకి. ఇంకొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నా తరువాత ప్రవీణ్, నవీన్ తయారు చేద్దామనుకుంటున్న తెలుగు సహాయక వీడియోలు ఎలా తయారు చేద్దామనుకుంటున్నదీ చెప్పి, వాళ్ళు అప్పటికే తయారు చేసిన, ఒక చిన్న వీడియోను చూపెట్టారు. చాలా బాగా వచ్చింది ఆ వీడియో. ఆ తరువాత గంటా, రెండు గంటలు ఏవేవో చర్చించాము, వాటిలో ముఖ్యమైనవి ఇవి:
  1. ఇంటర్నెట్టులో తెలుగును బాగా వ్యాప్తి చేయటానికి పనికి వస్తాయనుకునే ఆలోచనలను అన్నీ ఒకేచోట ఎప్పటికప్పుడు చేర్చడం. ఈ-తెలుగు సంఘాన్ని, ఏర్పాటు చేసిందే అందుకు కదా మరి. ఇదేకాదు తెలుగు ప్రచారానికి అవసరమైన వ్యాసాలను కూడా తయారు చేసి, వాటన్నిటినీ కూడా ఒకే చోట పదిలపరిస్తే బాగుంటుందని అనుకున్నాము.
  2. కంప్యూటరులో తెలుగును స్థాపించటానికి సహాయపడే వీడియోలను మరిన్ని తయారు చేయటం. ఒక పేజీడు సూచనలకన్నా 2 నిమిషాల వీడియో చూస్తే ఇంకా తొందరగా బాగా తెలుసుకోవచ్చు కదా మరి.
  3. తెవికీకి ఒక Recruitment Bulletinని మొదలు పెడితే ఎలా ఉంటుందో అనే కూడా ఒక ముఖ్యమైన విషయం. రాశిలో తెవికీ భారతీయ వికీలన్నిటికన్నా ముందుంది అనేది అందరికీ తెలిసిందే. వాశిలో మాత్రం మనం కన్నడ, తమిళ భాషలు మనకు చాలా పోటీని ఇస్తున్నాయి, అవి మనకంటే ముందు కూడా ఉండి ఉండవచ్చు. అయితే తెవికీని వాశిలో కూడా ముందుంచే చిన్న ఆలోచన ఇది. తెవికీలో ప్రస్తుతం బోలెడన్ని వ్యాసాలు మెరుగుపరచటానికి ఎదురుచూస్తున్నాయి. ఎవరెవరికి ఏ ఏ రంగాలలో ప్రవేశముందో లేదా ఇష్టముందో తెలుసుకుని వారిని తెవికీలో ఆయా వ్యాసాలను మెరుగుపరచటానికి ప్రోత్సహించటం ఈ Bulletin యొక్క ముఖ్యోద్దేశం.
  4. తెవికీలో అనువాదాలకు వ్యాసాలను ఆంగ్లవికీ నుండే కాకుండా ఇతర భారతీయ భాషలనుండి కూడా తేగలిగితే ఎలాఉంటుందో అని కొంచెం సేపు చర్చించాము. ఉదాహరణకు తెవికీలో ఉన్న ఈ పేజీని చూడండి, దీనిని కన్నడ వికీ నుండి అనువదిస్తున్నారు.
  5. తెవికీకో ఉన్న అన్ని సహాయ పేజీలకు WP:5MINలా ఉండే సంక్షిప్త పేర్లతో దారిమార్పు(redirect) పేజీలను సృష్టించాలి అనికూడా అనుకున్నాము. దీనివలన మన గుంపులలో ఎప్పుడయినా ఆ పేజీలకు లింకులను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సంక్షిప్త చిరునామాలయితే సులువుగా ఉంటుండి.
  6. మాటల మధ్యలో తెవికీలో RTS-తెలుగు Transliteratorని ఇంకోంచెం వేగంగా పనిచేయించటానికి ప్రయత్నించాలని అభిప్రాయపడ్డాము.
  7. పేరుకి బ్లాగరుల సమావేశం అనే మనం పిలుస్తున్నా కానీ, ప్రతీ సారీ బ్లాగరులు మరియు వికీపీడియనులు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అందుకని ఈ సమావేశాలకు "ఈ-తెలుగు సమావేశం" అనే పేరే సరయినదని కూడా కొంచెం సేపు చర్చించుకున్నాం.

అప్పటికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. మొదటి సమావేశంలో అనుకునట్లు MTRలో తినలేక పోయినా, అంతకంటే ఎన్నోరెట్లు రుచికరమైన విందు భాజనం చేసాము. అందునా ఆ విందులో వడ్డించిన వంకాయ కూర అదుర్స్. కాబట్టి ఇంక వారం వారం సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. భోజనం ముగించిన తరువాత కొంచెం సేపు లినక్సు గురించీ ఉబుంటూ ఉచిత CDల గురించి మాట్లాడుకున్నాము. ఆ తరువాత జరిగిన సన్నివేశాలన్నీ మీరు ప్రవీణు రాసిన పోస్టులో ఇప్పటికే చదివేసి ఉంటారు.

నలుగురమూ కలిసినందుకు గుర్తుగా(రుజువుగా) చివరిలో ఈ ఫొటో తీసుకున్నాము. ఫొటోలో ఎడమ నుండి కుడి వైపుకు, నేను, ప్రవీణ్, తెవికీ, నవీన్, రవీ నుంచున్నాము.