Friday, October 19, 2007

అమెరికా తెలుగు కథ (మొదటి సంకలనం)


రెండు నెలల క్రితం ఈ పుస్తకాన్ని మా చుట్టాల ఇంట్లో చూసాను, అప్పటికే వాళ్లింట్లో చదవాల్సినవారందరూ చదివేసినట్లున్నారు, బీరువాలో ఓ మూలకెళ్లిపోయింది... ఏట్లాంటి కథలుంటాయో చూద్దామని మొదటి పేజీ చదవటం మొదలుపెట్టాను, ఇంకొంత సేపటికి పుస్తకంలోని మొదటి కథ పూర్తయిపోయింది; అప్పుడే ఇది మొత్తమంతా చదవాల్సిన పుస్తకం అని అనిపించింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని రెండోసారి చదువుతున్నాను!

ఈ పుస్తకాలలోని కథలు చదువుతున్నంత సేపూ బ్లాగులలోని పోస్టులు చదువుతున్నట్లే అనిపించింది. కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని పరవాలేదనిపించాయి, ఇంకొన్ని నాకు నచ్చలేదు(అర్థంకాలేదు?). కానీ ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న కథలన్నీ, రచయితల అనుభవాల నుండి పుట్టినవే ఉన్నాయి (నాకలా అనిపించింది).

ఆ పుస్తకంలోని మొదటి కథే (యాదృచ్చికం) నాకు అన్నింటికంటే చాలా బాగా నచ్చిన కథ, అసలు ఆ కథే నన్ను పూర్తి పుస్తకాన్ని చదివేటట్లు చేసింది. ఆ తరువాత వెంటనే చెప్పుకోవలిసిన కథ "తుపాకి", ఇది ఆ పుస్తకంలో అన్నిటికంటే పెద్దకథ. కానీ అది కాదు దీని గొప్పదనం. కథలోని కధనం పాత్రలను మలచిన తీరు, నాకు బాగా నచ్చాయి. ఈ కథను చదివితే అమెరికా జీవితాన్ని విహంగవీక్షణం చేసిన అనుభూతికి లోనవుతారు. పుస్తకంలోని కథలను చదువుతున్నంతసేపూ వాటి పైన ఒక సమీక్షరాద్దామని అనుకున్నాను. కానీ రాయటం మొదలు పెట్టిన తరువాత తెలిసింది సమీక్షను రాయటం అంత సుళువు కాదని. ఈ పుస్తకం లోని 50% కథలు చాలా బాగున్నాయి, ఇంకో 30% బాగున్నాయి. మిగిలిన 20% కథలు, పేజీలు నింపటానికి మాత్రమే, అని చెప్పను కానీ, నాకు అర్థంకాని ఇంకో స్థాయిలో రాసారేమో అని అనిపించింది, వాటిని పూర్తిగా చదవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

పొరుగింటి పుల్లకూర, అమెరికా ఇల్లాలు, అమ్మ, లక్ష డాలర్లు, అగాధం మొదలైన కథలు చదువుతుంటే మాతృదేశాన్ని వదిలి, అమెరికా వచ్చి, చాలా కోల్పోయామేమోననే భావన నుండి తయారయ్యాయి. అంతేకాదు, మనం విన్న "కుందేలూ-తాబేలు" కథకు ముందు జరిగిన కథను వేమూరిగారు అద్భుతంగా వివరించారు. "తెమీనచా-నమీతెచా" అంటూ సత్యం మందపాటిగారు బాగా వాతలు పెట్టారు. "సావాసం సహవాసం", పదాల మధ్యన తేడాను, "ఆవగింజ ఆంతర్యాన్ని" కూడా కథలరూపంలో వివరించేసారు. పుస్తకంలోని కథలు ఒక ఎత్తయితే, పుస్తకం చివరన కథకులను పరిచయం చేయటం ఇంకో ఎత్తు. వారందరు ఒక్క జీవితకాలంలోనే అన్ని అద్భుతాలు ఎలా సాధించారా అనిపించటం కద్దు.

ఈ పుస్తకం మొత్తంలో నాకు అస్సలు అర్థంకాని కథ "లుండెర్ క్లుంపెన్". నేను రెండు సార్లు చదివినా, ఆ కథ ద్వారా రచయిత ఏంచెప్పాలనుకున్నడో, నాకు అస్సలు అర్థం కాలేదు.

ఈ పుస్తకంలో ఒక్కో కథా 2-3 పేజీల నుండీ 15-20 పేజీల వరకూ ఉంది. మొత్తం 35 కథలు. రొజుకో కథ చప్పున పుస్తకాన్ని పూర్తిచేయడానికి నెలపైనే పట్టింది నాకు. "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు అమెరికాలో అయితే 15డాలర్లు, భారతదేశంలో 100 రూపయలు మాత్రమే.

అనట్లు ఈ పుస్తకంలో మన నాసీగారి కథ కూడా ఒకటి ఉందండోయ్.