Tuesday, January 11, 2011

ఉలవచారు బిరియాని

వారం రోజులుగా ఆఫీసుకి సెలవు పెట్టి విజయవాడలో రెస్టు తీసుకుంటున్నాను. అందులో ఒక వారం రోజులు జలుబు తలనొప్పులతో గడిచిపోయింది. తరువాత విజయవాడ పుస్తక ప్రదర్శనకు వెళ్లి రెండు ఆంగ్ల నవలలు కొన్నా. రాంగోపాలవర్మ రాసిన "నా ఇష్టం" పుస్తకం కొందామనుకున్నా కూడా అందులో ముందుపేజీలలో ఉన్న వెనుక మాట, వెనుక ఉన్న సూక్తులూ చూసి, అతని బ్లాగులో ఉన్న దాన్నే తెలుగులో చదవాల్సొస్తుందేమోనని, కొంటానికి బయపడ్డాను.

అసలు విషయంలోకి వస్తున్నా. మొన్న విజయవాడలో ఉన్న మా బందువులకు చిన్న పార్టీ ఇచ్చాను. నేను ఎప్పుడూ ఆర్డరుచేసే ఉలవచారు బిరియానీ కూడా మెనూలో చేర్చాను. ఉలవచారు ప్రియులు, బిరియానీ ప్రియులు తప్పకుండా రుచి చూడాల్సిన వంటకం ఇది. ఉలవచారుని బిరియానీని కలిపితే అంత మంచి వంటకం తయారవుతుందని కనిపెట్టినాయనకు ఒక పది వీరతాళ్లు వేయాల్సిందే. ధం బిరియానీకి హైదరాబాదు ప్యారడైసు హోటలు పేరు ఎలా స్పురిస్తుందో, ఈ ఉలవచారు బిరియానీకి విజయవాడ డీవీ మానరు హోటలు మంచి పేరు సంపాదించింది. ఈ ఉలవచారు బిరియానిని ఎలా తయారు చేస్తరో తెలీదు కానీ, ముక్కల్ని మాత్రం ఉలవచారులో ఉడికిస్తారని మాత్రం అర్థమయ్యింది. ఉలవచారు బిరియానీతోపాటు ఇచ్చే రైతా కూడా చాలా బాగుంటుంది.

మీరెప్పుడయినా విజయవాడ వస్తేగనక ఈ ఉలవచారు మటన్ బిరియానీని తప్పకుండా రుచిచూడండి, అది కూడా డీవీ మానరులోనే తినండి.