Sunday, July 29, 2007

రూపాయి విలువ

నేను ఇన్ని రోజు డాలరుతో రూపాయి విలువ పెరగటం వలన మనకు ఇక్కడ అన్నీ లాభాలే అని భావిస్తూ ఉండేవాడిని. అంటే డాలరు విలువతో మన రూపాయి విలువ సమానంగా అవుతున్న కొద్దీ ఇక్కడ మన జీవన ప్రమాణాలు కూడా అమెరికా జీవన ప్రమాణాలకు దగ్గరగా అవుతాయి అని అనుకుంటూ ఉండే వాడిని. 1000 డాలర్లు ఉండే ల్యాప్‌టాపుని ఇప్పుడు 40000 రూపాయలకే కొనుక్కోవచ్చు, అంటే ఇక్కడ మనం సుమారు 10000 మిగుల్చుకున్నాము. ఇంకో రకంగా చెప్పాలంటే రూపాయి విలువ పెరుగుతున్నంత కాలం, మన కొనుగోలు శక్తి పెరుతుంది. అంటే దిగుమతుల వ్యాపారం కనీ వీనీ ఎరుగనంత లాభాలు ఆర్జిస్తున్నాయన్నమాట.

కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, రెండో వైపు ఎగుమతులు ఉన్నాయి. భారత దేశంలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న రంగమైన సాఫ్టువేరు రంగం, పూర్తిగా ఎగుమతుల మీదనే ఆధారపడుతున్న రంగం. ఈ రంగం అతిపెద్ద వినియోగదారుడు నిస్సంకోచంగా అమెరికానే. అయితే డాలరు విలువ 49 రూపాయల నుండి 40 రూపాయలకు పడిపోయిందంటే ఇది సాఫ్టువేరు కంపెనీలకు చాలా పెద్ద దెబ్బ. కంపెనీలకే కాదు వాటిలో పనిచేసే కూలీలకు కూడా ఈ దెబ్బ తగులుతుంది. అది ఎలా గంటే డాలరు విలువ పడిపోవటం వలన, ఇక్కడ రూపాయలలో జీతం తీసుకునే సాఫ్టువేరు కూలీలకు, జీతాలు పెంచక పోయినా కూడా
ఎక్కువ డాలర్లు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు సాఫ్టువేరు కంపెనీలు తమ మీదున్న భారాన్ని ఈ కూలీల పైకి కూడా తోసేయటానికి ప్రయత్నించవచ్చు.

ఒక సాఫ్టువేరు కూలీగా రూపాయి విలువ మళ్లీ పడిపోతే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఒక భారతీయుడిగా చూస్తే ఇది
మనందరికీ చాలా శుభసూచకం అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా మనదేశంలో మట్టుకు పెరగలేదు. ఇది పెరిగిన రూపాయి మహత్యమే. ఇలాంటి లాభాలు ఇంకా చాలా ఉంటాయి. వాటిలో ఒకటి మన మీద వేసే పరోక్ష పన్నులను తగ్గించటం, కూడా ఉండొచ్చు.

పెరిగిన రూపాయి విలువ తీసుకొచ్చిన సమస్యలపై ఇవాల్టి ఈనాడులో ఆదివారం అనుభందంలో వచ్చిన శ్రీధర్ కార్టూను చూడండి.

7 comments:

  1. అదే మరి మార్కెట్ ప్రపంచం మాయాజాలం. అందుకనే చైనా కృత్రిమంగా తమ కరెన్సీ విలువను తగ్గింస్తోంది అని అమెరికా అక్కసు. మనం చివరిసారిగా రూపాయి విలువను పివి గారి హయాంలోనో చంద్రశేఖర్ హయాంలోనో తగ్గించి నట్లు గుర్తు.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  2. నిజానికి డాలరుతో పోల్చితే రూపాయి చాలా అండర్ వ్యాల్యూడ్. ఒక డాలరుకు కేవలం 8 నుండి 10 రూపాయల కొనుగోలు శక్తి ఉంది. దాన్ని బట్టి డాలరుకు 10 రూపాయలే. కానీ ఈ మార్కెట్ని కెలకడాలు ఎప్పుడాపుతారో మనవాళ్లు. స్వాతంత్ర్యానంతరం మేం చాలా తెలివైన వాళ్లం. అన్నీ నియంత్రించగలం అన్న అహంభావంతో మెడన కత్తినెత్తుకున్నారు. ఇప్పుడు డ్యాన్స్ చెయ్యకతప్పదు మరి.

    ReplyDelete
  3. ల్యాప్‌టాపు ఇప్పుడు కూడా 1000 డాలర్లే వుంటుందా?

    రవి గారు కొంచెం వివరంగా చెబుతారా.

    ReplyDelete
  4. ఎగుమతి సుంకాలు, దిగుమతి సుంకాలు ఆ పన్నులు, ఈ పన్నులని మధ్యన ప్రభుత్వం కత్తెర వెయ్యకుండా ఉంటే ఇంకా అన్ని దేశాలు తమ కరెన్సీలని స్వేఛ్చగా వదిలేస్తే అప్పుడు ల్యాప్‌టాప్ ధరను మార్కెట్ డిమాండ్, సప్లైని బట్టి నిర్ణయిస్తుంది. అప్పుడు అన్ని దేశాల్లోను ఒక వస్తువు ధర ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అమెరికాలో గ్యాలను పెట్రోలు 3 డాలర్లయితే, భారతదేశంలో అక్షరాలా ఇంచుమించు 5 డాలర్ల దాకా ఉందంటే ప్రభుత్వమెంత కత్తెర వేస్తుందో అర్ధమవుతుంది. ఎందుకంటే క్రాస్ సబ్సిడైజేషన్ (మార్కెట్ని కెలడానికి ఉదాహరణ) డీజీల్ కి రాయితీలు, కిరోసిన్ కి రాయితీలు అవన్నీ పెట్రోల్ పై వడ్డింపులు. మన ఆర్ధికవేత్తల తెలివంతా ఇలా కాకులను కొట్టి గద్దలకు వెయ్యడానికే సరిపోయింది.

    ReplyDelete
  5. ఇక్కడ నేనంతా తిరిగి రాసే బదులు మరింత వివరణాత్మక విశ్లేషణకు ఈ వ్యాసం చదవండి
    http://www.newindpress.com/Column.asp?ID=IE620060612145000&P=old

    ReplyDelete
  6. ఒక రకంగా ఇప్పటి వరకూ ఎగుమతులను ప్రోత్సహించారు. ఇప్పుడు దిగుమతులను ప్రోత్సహించటం మొదలుపెట్టారేమో...

    ReplyDelete
  7. ఏ విధమైన ఆర్థిక ఒడుదుడుకులోనైనా నష్టపోయే రంగాలు కొన్నీ లాభపడే రంగాలు కొన్నీ ఉంటాయి. అంతమాత్రం చేత రక్తపోటు పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనకు మృదుసామాగ్రి (sotware) రంగం ముఖ్యమైనది కనుక "తన చావు జగత్‌ప్రళయము" అన్నట్లు బెంబేలెత్తిపోతున్నాం. విదేశాలనుంచి దిగుమతయ్యే మందులు ఇప్పుడు చౌకబారతాయని ఆనందిస్తున్నవాళ్ళున్నారు. అలాగే ఎన్నో ఇతర రంగాలు.

    ReplyDelete