Monday, December 01, 2008

సంకలిని

సంకలిని ఒక ఓపెన్ సోర్సు ఆగ్రిగేటరు. సంకలినిని LAMP architecture లేదా దానికి సమానమైన architectureలలో పనిచేసే విధంగా రూపొందించాను. ఇందులో ఉపయోగించిన సాంకేతికాంశాలు.
- బ్లాగుల నుండి వచ్చే ఫీడ్లను చదవడానికి simplepie అనే ఒక పరికరం.
- చదివిన ఫీడ్లను ఎప్పటికప్పుడు డేటాబేసులో బధ్రపరచుకోడానికి ADOdb అనే ఇంకో పరికరం.
- JSON మరియూ AJAX ద్వారా సమాచారాన్ని వాడుకరులకు అందజేస్తుంది.

సంకలిని codebase మొత్తం, google code నుండీ SVN ద్వారా దిగుమతి చేసుకోవచ్చు.

వీవెన్‌గారు సంకలినిని పరీక్షించడానికి కూడలిలో ఒక ఆల్ఫా-డొమైను కూడా తయారు చేసారు.
http://alpha.koodali.org/code/


సంకలిని బ్లాగు టపాల నుండీ సారాంశాలను మాత్రమే భద్రపరుస్తుంది. అవి సహజంగా టపాలోని మొదటి 3-4 వాక్యాలు, లేదా బ్లాగులలో ఫీడుని configure చేసినదాని బట్టి భద్రపరుస్తుంది.

దీనిని ఎలా వాడుకోవచ్చు?
-- ఏదన్నా పదం ఉన్న టపాల(సారాంశాల)ను వెతకవచ్చు. ఇందుకు q అనే అక్షరాన్ని ఉపయోగించాలి.
ఉదా: సినిమా అనే పదం ఉన్న టపాల కోసం
http://alpha.koodali.org/code/?q=%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE

-- ఫలానా వర్గంలో ఉండే టపాలను వెతకవచ్చు. ఇందుకు c అనే అక్షరాన్ని ఉపయోగించాలి.
ఉదా: సినిమా అనే పదం ఉన్న టపాల కోసం
http://alpha.koodali.org/code/?c=%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE

-- ఏదన్నా ఒక్క బ్లాగుకి సంబందించిన టపాలను మాత్రమే చూసుకోవచ్చు. ఇందుకు b అనే అక్షరాన్ని ఉపయోగించాలి.
ఉదా: పొద్దు వ్యాసాలను మాత్రమే చూడాలని అనుకుంటే
http://alpha.koodali.org/code/?b=poddu.net


అంతే కాదు, సంకలినిని ఉపయోగించి మీరు ఫీడులను కూడా పొందవచ్చు. ఆ ఫీడులకు కూడా పైన తెలిపిన ఫిల్టర్లను పెట్టుకోవచ్చు
http://alpha.koodali.org/code/atom.php


సంకలినిని ప్రస్తుతం శైశవ దశలో వుంది, దీనిని మరింత మెరుగులు దిద్దటానికి మీకు ఉత్సాహం ఉంటే మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. పాల్గొనాలనుకునే వాళ్లు నాకు ఒక e-mail పంపిస్తే మిమ్మల్ని ఈ ప్రాజెక్టులో సభ్యులుగా చేస్తాను.

Wednesday, October 22, 2008

పప్పుసుద్ద

ఈ పేరు వినంగానే, వండేస్తున్నారేమో అని చుట్టూ చూస్తా. ఎప్పుడయినా ఆంధ్రా మెస్సులకు వెళ్తే, అక్కడ పప్పు తప్ప ఇంకే పదార్థం కనపడదు నాకు, నాకు పప్పే fry, పప్పే సాంబారు, పప్పే రసం ఇంకా అన్నీనూ. అంతిష్టం నాకు పప్పు అంటే. ఇంట్లో అయితే రోజుకు ఒక్క సారి అయినా ఆ పప్పు ఉండాల్సిందే. అసలు నాలాంటి పప్పు ప్రేమికులు మన ఆంధ్రదేశంలో చాలామంది ఉంటారు, అందుకేగా ప్రతీ ఆంధ్రా మెస్సులలో వేరే కూరలు ఉన్నా లేకపోయినా పప్పు మాత్రం తప్పనిసరి ఉండేటట్లు చూసుకుంటారు! అందుకనే ఈ పప్పుకు ఒక ప్రత్యేక టపానే రాద్దామని అనుకున్నా. అలాగే ఈ టపా చివర్లో పప్పు తయారు చేసే విధానాన్ని ఒక టెంప్లేటులా అందిస్తున్నా.

మొదటగా నా వల్ల జరిగిన ఒక సంఘటనను వివరిస్తా. ఒకసారి హైదరాబాదు కోఠీలో ఒక హాస్టలులో ఉంటున్న స్నేహితుడిని కలవటానికి వెల్లాను. మధ్యాహ్నం బాగా లేటు అవ్వటంతో ఆ హాస్టలులో ఉన్న మెస్సులోనే భోజనం కూడా చేసేద్దాం అని అనుకున్నా. మెస్సతను కూడా చాలా చాలా ఆనందంగా 15/- ఇచ్చి భోజనం చేసేయండని చెప్పాడు. భోజనం దగ్గర అన్ని పధార్ధాలూ అక్కడ ఒక దగ్గర ఉంటే ఎవరికి వాళ్లు వెళ్లి వడ్డించేసుకుని తినేసేయాలి (buffet type అన్నమాట). చూడటానికి ఒక TV కూడా పెట్టాడు. నేను ఏమేం కూరలో వెతికితే పప్పు కనపడింది (టమాటో పప్పు అనుకుంటా). రుచి చూసా, అమృతంలా అనిపించింది, పప్పుకి అంత మంచి రుచి తీసుకువచ్చిన ఆ మెస్సతనికి వెంటనే సన్మానం చేసేయాలని అనిపించింది. ఓ పక్క TV చూస్తూ ఇంకో పక్క పప్పులో అన్నం నంచుకుంటూ నా మానాన నేను తింటూ ఉన్నా. కొంత సేపటికి (ఓ గంట తరువాత అనుకుంటా) ఆ హాస్టలులో ఉండే వాళ్లు వచ్చారు తింటానికి, వాళ్లకు పప్పు తప్ప అన్ని కూరలూ నిండుగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత వాళ్లు వెళ్లి మెస్సతనితో గొడవపెట్టుకోవడం, నేను తింటం ఆపేసి (పప్పు అయిపోయింది కాబట్టి ఆపేయాల్సి వచ్చింది), డబ్బులిచేసి అక్కడి నుండీ చల్లగా జారుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. తరువాత తెలిసింది అక్కడ అరగంటలోనే మళ్లీ పప్పుని వండేశారంట.

అయితే అందరూ తయారు చేసే పప్పు కూరలు ఒకే రకంగా ఉండవు. కొందరు పప్పుని మెత్తగా ముద్దలా అయ్యేదాకా ఉడకబెడితే, ఇంకొందరు పప్పుని ఉడికీఉడకకుండా ఇంకా పప్పులుగానే కనిపించేటట్లు తయారు చేస్తారు. పెసర పప్పూ, కందిపప్పులకు నాకు మొదటి రకం బాగా ఇష్టం, శనగ పప్పుకయితే రెండో రకం బాగా ఇష్టం. అంతే కాదు, ఈ పప్పుని రకరకాలుగా వండుకోవచ్చని మీ అందరికీ తెలిసే ఉంటుంది: ముద్దపప్పు, టమాటో పప్పు, దోసకాయ పప్పు, బీరకాయా శనగ పప్పు, ఇలాంటివన్నీ కాక ఎన్నిరకాల ఆకుకూరలు ఉంటాయో అన్ని రకాల ఆకుకూరపప్పులు ఉంటాయి.

ఇప్పుడు నేను పప్పును తయారు చేయటం చెప్పేసి అది ఎంత సులువుగా తయారుచేసుకోవచ్చో చూపిస్తా. కుక్కరు గిన్నెలో ఒక కప్పు కడిగేసిన పప్పుని తీసుకోండి, అందులో రెండు కప్పుల నీళ్లుపోయండి, ఆ తరువాత ఒక వుల్లిపాయ, నాలుగు పచ్చి మిరపకాయలు కొంచెం పద్దసైగులోనే తరిగేసి కుక్కరు గిన్నెలోనే వేసేయండి. రెండు ఐదు రూపాయి బిల్లలంత చింతపండును కూడా ఆ కుక్కరు గిన్నెలో వేసేయండి. ఆ తరువాత మీకు నచ్చిన ఆకుకూర ఒక కట్ట, లేకపోతే మీకు నచ్చిన కూరగాయ(మామూలుగా టమాటాలు, దోసకాయలూ వేస్తారు; మీకు మీ వంటమీద నమ్మకం వుంటే గనక వంకాయలు, బెండకాయలూ, చిక్కుడుకాయలు లాంటి ఏ కూరగాయలయినా వేసేయొచ్చు :) ) ఒక 100 - 150 గ్రాములు తరిగేసి వేసేయండి. కుక్కరు మూత పెట్టేసి 3-5 విజిల్సు(పప్పు ముద్దగా లేదా పలుకులుగా ఉండాలనుకునేదాన్ని బట్టి) వచ్చేదాకా కుక్కరును స్టవ్‌మీద వుంచండి.

కుక్కరు తెరిచిన తరువాత అందులోని పప్పుని ఒక సారి కలిపి కొంచెం పలచగా చేయడానికి తగినంత(ఒక కప్పు సరిపోతాయి) నీళ్లు పోయాలి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి, నీళ్లు, ఉప్పు, పప్పు కలిసే వరకూ తిప్పండి. తరువాత అందులో తాలిపు వేసేసి కొత్తిమీర జల్లితే ఘుమఘుమలాడే పప్పు తయారు.

Monday, August 18, 2008

ఇంగ్లీషు స్పెల్లింగులు

మా US కొలీగ్ ఒకతని పేరు QIN అని చూసి క్విన్ అని పిలిచా, వెంటనే అతను క్విన్ కాదు చిన్ అని పలకాలని చెప్పాడు. మరి chin అనే రాసుకోవచ్చు కదా అని అడిగితే, అలా ఎందుకు పిలవాలో తెలుసుకోవడానికి ఈ వెబ్సైటుని చూడమన్నాడు.

అది చూసిన తరువాత మా కొలీగ్ ఒకతను ఫిష్ స్పెల్లింగుకు ఈ గతి పట్టించాడు.
- F-I-S-H; - ఇది మనందరికీ గుర్తుకొచ్చే స్పెల్లింగు.
- G-H-T-I-O; GH as in రఫ్(rough), TIO as in నేషన్(NATION)


--
మరి మీకు కూడా ఇలాంటివి ఇంకేమన్నా తెలుసా...

Wednesday, July 23, 2008

ఈ సినిమా ఒక పజిల్


పోయినాదివారం, హరేరాం సినిమా చూసా. మొదటగా ఆ సినిమా దర్శకుడు హర్షవర్దన్ గారికి కొత్తదనంతో నిండున్న ఇలాంటి సినిమాను అందించినందుకు నేనర్లు. అప్పుడెప్పుడో కల్యాణరాందే అతనొక్కడే సినిమా చూసా, అందులో సినిమా మొదట్లోనే, మిగతా సినిమా మొత్తం ఉత్సాహంగా చూడాలనిపించేటట్లు చేసే సన్నివేశం ఒకటి చూపిస్తాడు. ఆ తరువాత మిగతా సినిమా కొంతవరకూ బలమైన కధతో, ఊహించలేనన్ని మలుపులతో బాగానే నడుస్తుంది. ఆ సినిమా బాగుంది కాబట్టి, రెండు సినిమాలలో కల్యాణ్‌రాం ఉన్నాడు కాబట్టి, ఈ సినిమా కూడా బానే ఉంటుందేమోననే ఒక Transitive Relation ఏర్పరచేసుకుని, స్నేహితులతో పాటుగా చెన్నై నగరానికి 30కీమీల అవతల ఉండే మాయాజాల్ అనే మల్టీప్లెక్సులో చూడటానికి వెళ్లా.

నా అంచనాలను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా, సినిమా మొదట్లోనే కొన్ని సంకేతాలొచ్చాయి. సినిమా మొదటి గంటలోనే అనేకానేక మలుపులు తిరిగి, చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ వచ్చేంతవరకూ నా స్నేహితుడు, ఈనాడువాడి మీద కేసేద్దామని అనుకున్నాడంట (ఈనాడులో ప్రియమణి CBI అని రాసాడు, కానీ అప్పటి వరకు, ఆమె పాత్రకూ CBIకి ఎటువంటి సంభందం కనిపించదు మరి!!). అప్పటికే సినిమాలో వచ్చిన బోలెడన్ని మలుపులను చూడటంవలన మేమందరం ఇంటర్వెల్ తరువాత మిగతా కథ ఎలా ఉంటుందోనని తలా ఒక థియరీని ఏర్పరిచేసుకున్నాం.

ఇంటర్వెల్ తరువాత సినిమాలో ఇంకొన్ని మలుపులతోనూ, ఆశ్చర్యకర సన్నివేశాలనూ కలుపుకుని సినిమా ముగుస్తుంది. అయితే మేము ఇంటర్వెల్ అప్పుడు ఏర్పరచుకున్న థియరీలన్నిటినీ కాకుండా దర్శకుడు తనదైన కొత్త థియరీతో సినిమాను నడిపిస్తాడు. అలా నేను తరువాత సన్నివేశంలో ఈ విధంగా జరుగుతుంది, అని అనుకుంటూ ఉంటే, సినిమా ఇంకో కొత్త మలుపు తిరిగి నేను అనుకున్నది జరగకుండా పోతుంది. అలా కొంతసేపటికి నేను ఏంజరుగుతుందో ఆలోచించటం మానేసి, మిగతా సినిమానంతా అక్కడ ఏంచూపిస్తే అది చూసా. మొత్తానికి సినిమా అయిపోయే సరికి నా మెదడు పాదరసంలా పనిచేయటం మొదలు పెట్టింది!

ఈ సినిమాలో నాకు నచ్చినవి:
  1. పాటలు, ముఖ్యంగా యాఖుదా జర ధేఖోనా అనే పాట. ఈ పాటను ఇప్పటికే వరకూ కొన్ని వందల సార్లయినా వినుంటాను.
  2. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో ఒక కథ ఉంది. చాలా రోజుల తరువాత కధ ఉన్న ఒక తెలుగు సినిమాను చూసాననిపించింది.
  3. క్లైమాక్సులో హీరోని పోలీసులూ, విలన్లూ కలిపి చేసింగు చేసే సన్నివేశం. ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు నాకు NFS most wantedలో hot pursuit, వేరేవాళ్లు ఎవరో ఆడుతుంటే, ఆ ఆటను నేను చూస్తున్నట్లు అనిపించింది (ఆటలో ఉన్నట్లే హెలీకాప్టర్ కూడా ఉంటుంది)
  4. మామూలుగా అన్ని తెలుగు సినిమాలలో కార్లూ సుమోలూ దేన్నయినా(ముఖ్యంగా హీరో ప్రయాణించే కారుని) గుద్దుకుని గాలిలోకి ఎగరాల్సొస్తే నిట్టనిలువుగా పైకి ఎగురుతూ ఉంటాయి, ఈ సినిమాలో మట్టుకూ కొత్తగా పక్కకు ఎగురుతుంది.

సినిమాలో నేను గమనించిన కొన్ని లోపాలు:
  1. కల్యాణ్‌రాం ఇందులో ఒక ACP పాత్ర పోషిస్తాడు. ఆ పాత్ర పేరు హరికృష్ణ, అయితే అతని యూనిఫాం మీద N.Krshna అనే పేరు ఉన్నట్లు అనిపించింది. ఇంకెవరైనా చూసి నేను చూసింది కరెక్టోకాదో చెప్పాలని మనవి.
  2. ఇంకో సన్ని వేశంలో సింధూ తులానీ పోషించిన పాత్ర ఆపదలో ఉంటుంది అలా ఆమె పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పుడే మూసేయబోతున్న ఒక ఇంటర్నెట్టు కఫేలోకి వెల్తుంది. వెళ్లి తన పరిస్తితిని వివరిస్తూ, ఈమెయిలును టైపు చేసేస్తుంది. అంత టెన్షన్లోనూ ఆమె పారాగ్రాఫు మొదట్లో ఖాళీలను వదిలి, మిగతా పారాగ్రాఫునంతటినీ చాలా అందంగా అమరుస్తుంది, కింద తన సిగ్నేచరు కూడా టైపుచేసేస్తుంది. ఇదంతా కూడా outlook లాంటి సాఫ్టువేరు నుండి చేసేస్తుంది. అంత టెన్షనులో ఆమె తన ఈమెయిలుని outlookలో కాన్‌ఫిగరు చేసుకుని మరీ, ఈమెయులుని పంపిందంటారా.
  3. హై సెక్యూరిటీ CBI జైళ్లలో హీరో గారు తప్పించు కోవడానికి వెంటిలేటర్లు ఎల్లవేలలా ఉంటాయి. పైగావారికి తాగటానికి coke tinలను కూడా ఇస్తుంటారు. (ఇది సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది).

మొత్తానికి సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటే గనక, నాకు ఒక పజిల్‌ని పరిష్కరించినట్లు అనిపించింది. అందుకనే కథ గురించి ఎక్కువగా చెప్పలేదు.

Saturday, July 05, 2008

ఇప్పుడు నేను చెన్నైవాసిని

నేటితో చెన్నై వచ్చి సరిగ్గా రెండు నెలలయ్యింది. ఇక్కడికి వచ్చె ముందు ఇక్కడి వాతావరణం గురించి అందరూ చాలా చాలా బయపెట్టారు, కానీ కొత్త ఉద్యోగం బాగా నచ్చి వచ్చేసాను. వచ్చిన తరువాత ఇక్కడి వాతావరనం విజయవాడ ఎండలు కంటే బానే ఉన్నట్లు అనిపించింది!!!

వచ్చిన తరువాత మొదటి శనివారం మెరీనా బీచ్‌కి వెళ్లి సముద్రాన్ని చూద్దామని అనుకున్నాం. అయితే మొదటిసారిగా సముద్రమంటే నీళ్లతోనే కాకుండా జనాలతో కూడా తయారవుతుందని ప్రత్యక్షంగా చూసాం. శనివారం, ఆదివారాలు మాలానే ఇంకా చాలా మంది అనుకుంటూ ఉంటారని అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది. అప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లాగా సముద్రాన్ని చూద్దామని సముద్రపు ఒడ్డున ఉండే ఇసకమీద అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ చివరికి నీళ్ల దగ్గరకు చేరుకునే సరికి చీకటి పడిపోయింది. మొత్తానికి, ఇలాంటి ఇంకో సాయంత్రం అవుతుందని వెళ్లిన మాకు చాలా పెద్దనిరాశ.

అలా కొన్ని రోజులపాటు ఎటూ వెళ్లకుండా, కొన్ని రోజుల తరువాత మళ్లీ ఏదో ఒక సముద్రపు బీచ్‌కి, అదీ జనాలు లేని బీచ్‌కి వెల్లాలని బాగా ప్లానేసి, స్కెచ్చుగీసి, చెన్నై నుండి 30కీమీల దూరంలో ఉండే మహాబలిపురం వెళ్లాలని నిర్ణయించాం. సాయంత్రమైతే చాలా మంది ఉంటారని, మధ్యాహ్నం అయితే ఎవరూ ఉండరని 10:30 కి బయలుదేరి 12 కల్లా అక్కడికి చేరుకున్నాం. ఒక గంట పాటు అక్కడ ఉన్న గుడిని, దాన్ని చూడటానికి వచ్చిన టూరిస్టులను చూసి, కొన్ని ఫొటోలు కూడా దిగేసాం.


తరువాత ఆ గుడికే ఆనుకుని ఉండే సముద్రం దగ్గరకు వెళ్లాం. మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా అక్కడ ఇంత మంది ఉంటారని ఏమాత్రం ఊహించలేదు. కాకపోతే మెరీనా బీచ్‌కంటే ఇది చాలానయం.


మొన్నామధ్య సునామీ వచ్చినప్పుడు ఈ గుడి కూడా మునిగి పోయినట్టుంది, ఈ సారి గుడికేమీ జరగ కూడాదని, ఆ గుడికీ, దాని వెనుక ఉండే సముద్రానికీ మధ్యన పెద్ద పెద్ద బండరాళ్లతో నింపేసారు.


తరువాత అక్కడున్న బండరాళ్ల మీద చాలా సేపు కూర్చుని, సముద్రపు అలలు వచ్చి ఈ బండరాళ్లను ఢీకొట్టటం చూస్తూ కూర్చున్నాం.


---
ప్రస్తుతానికి "తమిళ్ తెరియాదు" అనే వాక్యాన్ని నేర్చుకున్నా. అదేంటో గానీ ఆ వ్యాక్యాన్ని ప్రయోగించిన ప్రతీసారీ ఎదుటోళ్లు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో అరిచేస్తూ ఉంటారు... నేను తరువాత ఇంగ్లీషులో ఏదో మాట్లాడతాను, తరువాత వాళ్లు తమిళంలో ఇంకేదో మాట్లాడతారు. ఇదంతా కాదని చివరికు సైగలతోనూ, ఏకపద వాక్యాలతోనూ నెట్టుకురావడం మొదలుపెట్టా.

ఇదే క్రమంలో మొన్నమధ్య దశావతారం సినిమాని తమిళంలో చూసా. సినిమా నాకు బానే అనిపించింది, కాకపోతే ఇంటర్వెల్ తరువాత వచ్చే అసిన్ పాత్రను కట్ చేసేసి అవతల పారేస్తే బాగుండేదనిపించింది; ఏంటో మరి ఆ పాత్రను మొదటిసారిగా చూపించే పాటలో తప్ప తరువాతంతా ఏదేదో అరుస్తూనే ఉంటుంది, చిరాగ్గా...

Thursday, May 22, 2008

In the name of God


ఈ సినిమా అసలు పేరు "ఖుదా కే లియే". ఇది నేను చూసిన మొట్టమొదటి పాకిస్తానీ సినిమా. అంతేకాదు, ఈ సినిమా భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి పాకిస్థానీ సినిమా అంట... గతకొని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రకరకాల పరిణామాల కారణంగా పాకిస్థానీయులు ఎదుర్కొంటున మానసిక సంఘర్షణను తెలియజేయడమే ఈ సినిమా కధాంశం ముఖ్యోద్దేశం. దాదాపు మూడు గంటల నిడివి వున్న ఈ సినిమాలో 5-6 గంటలకు సరిపడా కదాంశంతో, దర్శకుడు షోయబ్ మన్సూర్ సినిమాను చాలా ఆసక్తికరంగా మలిచాడు.

సినిమా ఒక మెంటల్ రీహాబిలిటేషన్ సెంటర్లో మొదలవుతుంది. ఆ తరువాత పాకిస్తానులో 2000 సంవత్సరానికి స్వాగతం పలకటానికి సనద్దమవుతున యువకుల గుంపునొకదాన్ని చూపిస్తారు, ఇంతలో కొంతమంది బైకుల మీద కర్రలూపుకుంటూ వచ్చి, వారి సన్నాహాలన్నిటినీ పాడు చేసేసి వెళ్ళిపోతారు. ఆ తరువాత సీను లండనులో, షాపులో ఉన్న ఒక పాకిస్తానీయుడి వద్దకు అతని స్నేహితుడు వచ్చి, నీ కూతురు ఎవరో తెల్లోడితో తిరుగుతుంది, దానివలన నా కూతురు కూడా చెడిపోతుంది, ఆమెను అదుపులోపెట్టుకోవడం కూడా చేతకాదని తిడుతుంటాడు. ఇలా ఈ మూడు సనివేశాలలో దర్శకుడు మనకు సినిమాలోని ముఖ్యపాత్రలను పరిచయం చేస్తాడు.

ఈ సినిమా ఇద్దరు అన్నతమ్ముల చుట్టూ తిరుగుతుంది. వాళ్లలో ఒకడు తీవ్రవాదంవైపు ఆకర్షితుడైతే, ఇంకొకడు తాను చేయని తప్పుకు (తీవ్రవాదం) బలిపశువైపోతాడు. ఇవే కాక తాలీబన్ల కాలంలో మహిళల పరిస్థితి, ఇస్లాంమతాచారాలను ఒక్కొక్కరూ ఒక్కోరకంగా ఎలా చూస్తారు అనేవాటిని కూడా ఈ సినిమాలో బాగా చూపించాడు. అలాగే తమకొచ్చిన సందేహాలను నివృత్తి చేసుకునే ప్రక్రియలో కొంతమంది పాకిస్తానీయులు మత చాందసవాదుల మాటలకు ఎలా లొంగిపోతారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు. చివరిలో మౌలానా వలీగా ప్రత్యక్షమయ్యే నాసీరుద్దీన్ షా నటన గురించయితే ఇంక ఎంత చెప్పినా తక్కువే...

సినిమా కథా కథనం ఒకెత్తయితే, ఇందులో పాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేంత బాగుంటాయి. అసలు నాకు ఈ పాటలు విన్న తరువాతే సినిమాను చూడాలనిపించింది. ఈ సినిమా 2007 కెయిరో చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది. అంతే కాదు 2009 ఆస్కారు రేసులో కూడా ఉందిప్పుడు.

Wednesday, April 30, 2008

ఒక ప్రోగ్రాము కథ

అనగనగా ఒక కంప్యూటరు మేధావి. అతనికి ఎల్లప్పుడు తన దగ్గరున్న కంప్యూటరుతోనే కాలం గడిపేసేవాడంట. అయితే అతనికి తన కంప్యూటరులో ఉన్న ప్రోగ్రాములు ఎప్పుడూ యంత్రాలకు మళ్లే, మనం నడవమన్నప్పుడు నడవటం, ఆగిపోమన్నప్పుడు ఆగిపోవడం చూస్తూ ఉండే వాడు. అవి వాటంతటవే జీవించగలిగేటట్లు చేస్తే ఎలా వుంటుందా అని ఎప్పుడూ కలలుగనే వాడు. కొన్ని సార్లు అతని కలల్లోకి, ఒక మగ ప్రోగ్రాము ఆడప్రోగ్రాము, వారి పిల్ల ప్రోగ్రామూ వచ్చేవి. ఇలా కొన్నిరోజులకు అతని కలల నిండా ఈ ప్రోగ్రాము కుటుంభమే కనిపిస్తూ ఉండేది.

ఒక శుభముహూర్తాన ఇలా కాదని జీవించగలిగే ఒక ప్రోగ్రామును సృష్టించాలని అనుకున్నాడు. జీవులలో ఉండే ముఖ్యలక్షణాలు ఏంటా అని అలాచిస్తే అతనికి వచ్చిన జాబితా ఇదీ:
1. సంతానాన్ని కలిగి తమ జాతిని అభివృద్ది పరచుకుంటాయి.
2. తమపై ఇతరుల దాడిని నుండి తమను తాము రక్షించుకోవాలని చూస్తాయి.
3. తమ ఉనికిని చాటే ఏదో ఒక లక్షణం కలిగి ఉండాలి.

ఇలా ఒక ప్రోగ్రామును రాసుకున్నాడు, దానికి అతను self-reproducing automaton అనే పేరుపెట్టుకున్నాడు. ఈ ప్రోగామును తన కంప్యూటరులో నడపడం మొదలు పెట్టాడు. అయితీ ఇది పరాన్న జీవిలా ఇప్పటెకే ఉన్న ప్రోగ్రాములపై ఆధారపడుతుంది. వాటిని మొదలుపెట్టినప్పుడు ఇవి కూడా మొదలవుతాయి, కానీ ఇవి మొదలైనటు ఎవరికీ తెలియదు! అలా ఈ ప్రోగ్రాము తన వంశాన్ని అభివృద్ది పరచుకోవడానికి ఒక అన్ని మాంలు ప్రోగ్రాములలోకీ తన సంతానాన్ని వ్యాపింప చేసింది. అలా వ్యాపిస్తున్నప్పుడు తన గురించి ఎవరికీ తెలియకుండా అప్పటికే ఉన్న ప్రోగ్రాముల స్వభావాన్నికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండేది. కానీ ప్రతీ ప్రోగ్రాములో ఈ ప్రోగ్రాము కలవటం వలన వాటి సైజు మాత్రం పెరిగి పోయేది, ఈ విధం దాని ఉనికిని పరోక్షంగా తెలిపుతూ ఉండేది.

ఇలా ఈ ప్రోగ్రామును ఒక పెంపుడు జీవిలా సాకుతూ ఉండే వాడు. దానిని అభివృద్ది పరచటానికి రోజూ కొత్త ప్రోగ్రాములను తన కంప్యూటరులో స్థాపించేవాడు. మన ప్రోగ్రామేమో వాటిలోకి కూడా వ్యాపించేసి దిన దిన ప్రవర్ధమానం చెందేది. అయితే కొన్ని రోజులకు తాను తయారు చేసిన ఈ ప్రోగ్రాము ఏమేమి చేయగలదో అందరికీ చూపించాలని అనుకున్నాడు. ఉంట్టినే అందరినీ తన కంప్యూటరు వద్దకు తీసుకు వచ్చి చూపిస్తే పెద్దగా మజా ఉండదని, అతని కంప్యూటరుకు అనుసంధానమైన కంప్యూటర్లలోకి కూడా వ్యాపించగలగే సామర్ధ్యాన్ని కల్పించాడు. అలాగే ప్రోగ్రాము తన ఉనికిని బహిరంగంగా చాటుకునేటట్లు రూపొందించాడు.

అయితే అతని కంప్యూటరుకు అనుసంధానమై ఉన్న అతని మితృలు, తమ తమ కంప్యూటర్లలో ఈ ప్రోగ్రామును చూసేసరికి, అది చేసే పనులు నచ్చక దానిని తొలగించడానికి ప్రయత్నాలను మొదలు పెటారు. అంతేకాదు ప్రోగ్రాముకు "కంప్యూటరు వైరస్సు" అనే కొత్త బిరుదును తగిలించారు. ఇది వైరస్సు కాదు నేను పెంచుకుంటున్న ప్రోగ్రాము, అని అతను ఎంత చెప్పినా అతని మిత్రబృంధం పెద్దగా పట్టించుకోలేదు. ఆ రకంగా జీవించగలిగే లక్షణాలున్న ప్రోగ్రాములన్నీ చెడ్డవైపోయాయి. అవి కంప్యూటరుకు ఎటువంటి హానీ తలపెట్టక పోయినా కూడా, వాటిని చెడగొట్టే ప్రాగ్రాములుగా అభివర్ణించడం మొదలుపెట్టారు.


--- "The Little Black Book of Computer Viruses" చదివినప్పుడు నాకు కలిగిన ఆలోచనలకు రూపమే ఈ టపా...

Thursday, April 17, 2008

అప్పుడేం జరిగిందంటే...

సమయం ఉదయం 10 గంటలవుతుంది.
[ఇంతకు ముందే వర్షం వడటం ఆగిపోయింది. ఎప్పుడూ సిమ్మెంటు ఫ్యాటరీ పొగగొట్టాల నుండి వచ్చే దుమ్ముతో మట్టి కొట్టుకుపోయుండే చెట్లంటినీ వర్షం నీరు కడిగేయటం వలన ఆకుపచ్చని రంగులో చాలా అందంగా కనబడ్తున్నాయి. మగవారంరూ ఫ్యాక్టరీకి వెళ్లిపోయారు, ఆడవాళ్లందరూ ఇళ్లలో పనులు పూర్తిచేసుకునే హడవిడిలో ఉన్నారు, ఇంక కాలనీ వీధిలో ఆ నలుగురు పిల్లలు తప్ప ఇంకెటువంటి జనసంచారం లేదు.]

శ్రీనివాస్: అన్నా క్రికెట్ ఆడదామా. groundలో ఎవరూ లేరు.
రాహుల్: we cannot, yesterday it rained heavily. And see how dirty the ground is.
ప్రకాష్: అవునురా బాబు, రాహుల్గాడు చెప్పింది కరెక్టే ground అంతా ఎంత రొచ్చు రొచ్చుగా ఉందో చూడు.
సుధాకర్: సెలవలు నిన్నే మొదలైనాయి, నాకేమో అప్పుడే bore కొట్టేస్తుంది. ఇంకేమైనా చేద్దాం.
శ్రీనివాస్: (తన నిరాశను అనచుకుంటూ) కావాలంటే మిగతావాళ్లందైనీ నేనే పిలుచుకు వస్తాను... సీత కూడా మనతో క్రికెట్ ఆడతానంది.
రాహుల్: (సుధాకర్ చెప్పింది పట్టించుకోకుండా) me too, feeling bored from the very first day of the holidays.
ప్రకాష్: (ఆలోచిస్తూ...) hey rAhul, how about playing an indoor game in my house, say vaikunTapAli.
సుధాకర్: (కంగారుగా...) లేదు లేదు ఇంకేమైనా చేద్దాం, ఇంట్లో మట్టుకు నేను ఉండలేను.
ప్రకాష్: మీ ఇంటికి కాదులేరా మా ఇంటికని చెబుతున్నాలే... అవును అందరం అలా దేవీ సిమెంట్ వైపు వెల్దామా?
సుధాకర్: వాళ్లు రానివరేమో...
ప్రకాష్: వాడా గొడకట్టుకుని రెండు మూడు సంవత్సరాలవుతుంది, ఇంకా ఫ్యాక్టరీ కట్టడం కూడా మొదలు పెట్టలేదు, రానివ్వకపోవడానికి అక్కడ ఎవరన్నా ఉన్నారా అసలు...
శ్రీనివాస్: అన్నా, అదిగో కాశీ కూడా వచ్చేస్తున్నాడు, మనమింకా క్రికెట్ మొదలు పెట్టేయ వచ్చు.
ప్రకాష్: నోర్ముయ్యిబె, ఇందాకే చెప్పాగా ground అంతా రొచ్చు రొచ్చుగా ఉందని.
(సుధాకర్ మొఖంలో ఇప్పుడు నిరాశ స్పష్టం కనిపిస్తుంది).
ప్రకాష్: ఒరే కాశీ, మేము దేవీ సిమ్మెంట్స్ వైపు వెల్తున్నాం నువ్వూ వస్తావా...
కాశీ: ఓ yes. తప్ప కుండా...

సమయం 11 గంటలు కావొస్తుంది
వాళ్లయిదుగురూ అలా నడుసుకుంటూ నడుసుకుంటూ, దేవీ సిమ్మెంట్సు వైపు వెళ్తున్నారు.
సుధాకర్: రోజూ బస్సులో వెళ్తుంటే వెంటనే వచ్చేస్తుంది కదా, ఇవాళ నడుస్తుంటే ఇంకా రాటల్లేదేంటి.
రాహుల్: hey look there is a spring flowing there...
శ్రీనివాస్: ఏంటీ స్ప్రింగా, ఇక్కడెవరు పారేసుకున్నారు, (వెతుకుతున్నట్లు అటూ ఇటూ చూస్తున్నాడు).
ప్రకాశ్: నీయబ్బ రాహుల్ చెప్పే స్ప్రింగు, అదిగో ఆ పిల్ల కాలవ గురించి.
కాశీ: అదా... అది పక్కన పొలాల్లోనుండి వస్తుంది, మనం రోజూ స్కూలు కెళ్లేటప్పుడు మన ఫ్యాక్టరీ దాటంగానే ఒక చిన్న బ్రిడ్జీ వస్తుంది కదా... దాని కింద నుండీ వెళ్లేది ఈ కాలవే. అందులో చేపలు కూడా ఉంటాయి తెలుసా...
శ్రీనివాస్: (కొంచెం ఉత్సాహంగా) ఏంటీ చేపలా.
కాశీ: మరి ఎండా కాలంలో కూడా, ఈ కాలువలో నీళ్లుంటాయి.
రాహుల్: hey! look this, look this, there are even fish in this water.
ప్రకాశ్: yeah... thats what we are talking about.
రాహుల్: hey all instead of playing cricket. why dont we come every day here and catch fish. I will sponsor for the fishing hooks and sticks...
శ్రీనివాస్: ఏంమంటున్నాడు? ఈ చేపల్ని ఇక్కడే వదిలేసి వెళ్లి క్రికెట్ ఆడుకుందామంటున్నాడా?
సుధాకర్: కాదురా బాబూ... ఈ సెలవలంతా క్రికెట్ ఆడే బదులుగా, రోజూ ఇక్కడికి వచ్చి చేపలుపడదామంటున్నాడు.
శ్రీనివాస్: (మరింత నిరాశగా, కంగాఉగా) ఏంటీ సెలవలంతానా... వదొద్దు... నాకు క్రికెట్టె కావాలి.
కాశీ: (సొంచెం నవ్వుతూ) ఈ రాహుల్గాడు వాళ్లూరిలో ఎప్పుడూ చేపల్ని చూసినట్టులేడులాగుంది. అసలు వాళ్లూర్లో ఇలా కాలువలు ఉంటాయో ఉండవో.
రాహుల్: what kasi. you are saying something?
కాశీ: (నవ్వునాపుకుంటూ) విన్నాడూ... (వచ్చీరాని ఇంగ్లీషులో) I talk worms.
రాహుల్: साला... we need worms too, but where will we get them now.
కాశీ: why worry? I here no.
[కాశీ చుట్టూ చూసి ఒక కర్రముక్కను తీసుకుని అక్కడ బాగా చిత్తడిగా ఉన్న నేలను తవ్వడం మొదలు పెట్టాడు.]

రాహుల్: kasi, what are you doing.
ప్రకాశ్: ఎందుకు తవ్వుతున్నావురా.
కాశీ: (తవ్వటం ఆపకుడా) వాన పాముల కోసం...
[అలా అంటుండగానే ఒక వానపాము బయట పడింది. కాశీ గర్వంగా వానపాముని బయటకు తీస్తుంటే అందరూ నోరు తెరచి అలా చూస్తూ ఉండిపోయారు.]

రాహుల్: man, you are really genius. how did you know you can get worms here?
కాశీ: my grandfather. ఇలా కాలువల పక్కనే నేలలోపల వాన పాములుంటాయని మా తాతయ్య చెప్పాడు. సెలవలకు మా ఊరుకి వెళ్లినప్పుడు, తాతయ్య నన్ను చేపలు పట్టడానికి తీసుకెతాడు కూడా.
[ప్రకాశ్, రాహుల్‌కి కాశీ చెప్పిందాన్ని ఇంగ్లీషులో చెప్పడం మొదలు పెడతాడు...]

సుధాకర్: నేను సాయంత్రం మేళ్లచెరువు వెల్తున్నా... అందరూ డబ్బులిస్తే నేను కొక్కాలవీ తెస్తాను మరి.
రాహుల్: so you are going to mellacheruv. here take this money and bring 5-6 hooks plastic wires. We can start our fishing from tommorow.
శ్రీనివాస్: నాకాకలేస్తుంది, ఇంకా ఇంటికి వెల్దామా...
ప్రకాశ్: what rahul, you always carry a 100 rupee note with you.
[రాహుల్ గర్వంగా నవ్వాడు... తరువాత ఇంకొంచెం సేపు చేపల్ని పట్టడానికున్న మెలుకువలు గురించి మాట్లాడుకుని అందరూ ఇంటిదారి పట్టారు...]

సమయం సాయంత్రం 5 గంటలు కావొస్తుంది...
[బయట వీధిలో కొంతమంది హడావిడిగా తిరుగుతున్నారు.]
గొంతు #1: నువ్వు చూసినప్పుడు ఎటెల్తున్నాడో, ఏమయినా చెప్పాడా...
గొంతు #2: (శ్రీనివాస్ గొంతులా ఉంది) ఆ అక్కడ క్వారీలో వర్షం నీళ్లకు చెరువులా అయ్యిందని అక్కడికి ఈతకొట్టడానికి వెల్తున్నానని చెప్పాడు.
గొంతు #3: (కొంచెం ఆందోలనగా...) ఈత కొట్టడానికి ఆ క్వారీనే దొరిందా... అయిన ఇంతసేపు ఈతకొట్టడమేంటి... అవును నువ్వెందుకెళ్లావటు?
గొంతు #2: (కొంచెం భయం భయంగా) నేనటెల్లలేదు. నేను మేళ్లచెరువెళ్లి వస్తుంటే నాకు దారిలో కనిపించి క్వారీ దగ్గరికి వెళ్తున్నాడని చెప్పాడు.
[కొంతమంది అటేపెల్తున్నట్లు సబ్దం, అక్కడే ఉన్న మిగతావాళ్లు గుసగుసలు మొదలుపెట్టారు.]


సమయం సాయంత్రం 6:30 గంటలు కావొస్తుంది. అప్పటికే బాగా చీకటి పడుతోంది...
[దూరం నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం. మెళ్లగా దగ్గరవుతుంది. ఎవరో ఒకాయన చేతిలో 10-12 సంవత్సరాల పిల్లోడిని రెండు చేతులతో మోసుకొస్తున్నాడు. అతను వీధి దగ్గరికి రాంగానే, అతని చేతిలో ఉన్న పిల్లోడి తాలూకూ తల్లి గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది. ఎవరూ ఆమెను సముదాయించడానికి కూడా ప్రయతించలేదు.]
గొంతు #3: ఎలా జరిగింది?
గొంతు #1: (వస్తున్న ధుఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ) క్వారీలో ఈ వర్షాలకు మొక్కలు కూడా పెరిగాయి. నీళ్లలో ఈ తకొడుతుంటే, ఆ మొక్కలు కాళ్లకు చుట్టుకున్నటున్నాయి...
గొంతు #3: మొన్నట్నుంచే అక్కడ ఒక security gaurdని పెడదామనే ఆలోచనవచ్చింది, కానీ ఎందుకనో మర్చిపోయాను.
గొంతు #1: వాడికలా రాసిపెట్టుంటే మీరయినా ఏంచేయగలర్లేండి...

తరువాతి రోజు ఉదయం 10 గంటలయ్యింది.
[అంతకు ముందురోజు రాత్రి వర్షం పడక పోవడంవలన చెట్లన్నీ ఫ్యాక్టరీ నుండి వచ్చే బూడిదతో కప్పేసుకుపోయాయి... groundలో క్రికెట్ ఆడటానికి సన్నాహాలు మొదలైయ్యాయి. సీత వికెట్లతో కుస్తీ పడుతుంది...]
ప్రకాశ్: (అప్పుడే అక్కడికి వచ్చాడు) ఇదేంటి మనం ఇవాళ చేపలు పట్టడానికి వెళ్దామని అనుకున్నాంగా... మళ్లీ క్రికెట్టెందుకు?
సుధాకర్: నిన్న నేనూ శ్రీనూగాడూ కలిసి మేళ్లచెరువు వెళ్లి అక్కడ కావలిసినవన్నీ కొన్నాం. ఇవాళ రాహుల్ వచ్చి ఇంక చేపలొద్దూ ఏంవద్దని, ఆ కొక్కేలనూ వైర్లనూ ఎక్కడో పరేసాడు.
ప్రకాశ్: ఎందుకు పారేశాడు, మనకిస్తే మనమన్నా చేపలుపట్టుకోవడానికి వెళ్లేవాళ్లం కదా... అవునూ శ్రీనూగాడేడి కనపడటంలేదు, నిన్నంతా క్రికెట్ క్రికెట్ అని ఒకటే గొడవ చేసాడు.
సుధాకర్: నీకింకా తెలీదా, శ్రీనూగాడికి బాగా జ్వరం అంట. అయినా కాశీగాడు అలా అయిపోతాడని వాడికయినా ఎలా ఊహిస్తాడు, పాపం.
ప్రకాశ్: కాశీకేమయ్యింది?...
సుధాకర్: (కొంచెం ఆశ్చర్యంగా మొఖంపెట్టి...) నిన్న ఆ క్వారీలో ఈతకొట్టడానికి వెళ్లి చనిపోయాడు, నీకింకా తెలీదా... అసలు శ్రీనూగాడికి జ్వరమొచ్చిం కూడా అందుకే. నిన్న కాశీగాడు కూడా మాతోపాటే మేళ్లచెరువొచ్చాడు. వెనక్కొస్తుంటే వర్షం పడటం వళ్ల క్వారీలో బాగా నీళ్లు చేరాయని ఈతకొట్టడానికి వెల్దామన్నాడు. నాకు వేరేపనుండటం వళ్ల నేనెల్లలేదు. శ్రీనూగాడూ, వాడూ వెళ్లారు. శ్రీనూగాడికి ఈతరాక ఒడ్డుమీదనే ఉన్నాడు, ఈతకొట్టడానికి నీళ్లలోని వెళ్ళిన కాశీగాడు ఎంతకీ బయటికి రాకపోవడంతో, వాడికేంచేయాలో తెలీక పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి వాళ్ళమ్మకు చెప్పాడంట.... అందుకనే రాహుల్ మనం ఇంకా నీళ్ల దగ్గరకు కూడా వెళ్లకూడాదని నిన్న మేము కొన్న కొక్కాలనీ పారేసాడు...
సీత: తొందరగా రండ్రాబాబూ, ఆట్టం మొదలు పెడదాం, మళ్లీ ఎండ వచ్చేస్తుంది...


[ఇది వాస్తవంగా జరిగిన సంఘటనకు కొంత కల్పితాన్ని జోడించి రాసాను. పాత్రల పేర్లను కూడా మార్చాను. google mapsలో నేను చిన్నప్పుడు పెరిగిన ప్రదేశాలను చూస్తుంటే ఎందుకో ఈ సంఘటన గుర్తుకొచ్చింది, అందరితో పంచుకోవాలని ఇలా ...]

Wednesday, April 02, 2008

పైథాను భాష

మీరు ఒక సాఫ్టువేరు ఇంజినీరయ్యుంటే పైథాను భాష గురించి పలువిధాలుగా ఇప్పటికే వినుంటారు. అన్ని కంప్యూటరు భాషలలోకీ నేర్చుకోవడానికి అత్యంత సులువైన భాష అనీ; ఇందులో రాసే ప్రోగ్రాములు ఇంగీషు భాషకు అతి దగ్గరగా ఉండి, ఇతరులు రాసిన ప్రోగ్రాములను కూడా చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చనీ; ఇలా రకరకాలుగా వినే ఉంటారు.

అయితే నేను ఈ మధ్యన చూసిన ఒక వెబ్సైటువలన పైథాను భాషను ఇంకో కొత్తకోనంలో చూడగలిగాను. అదేంటంటారా...

పైథాను భాషను, మన మాతృభాషలో ఉన్న పదాలను ఉపయోగించి ప్రోగ్రాములు రాసుకునేటట్లు మలుచుకోవచ్చు. కామెంట్లు మాత్రమే కాకుండా, మొత్తంగా తెలుగులోనే ఉన్న ప్రోగ్రామును ఒకసారి ఊహించుకోండి... మామూలు తెలుగు వాక్యాలలో ఉండే ప్రోగ్రాములతో, ఎవరయినా చాలా సుల్వుగా ప్రోగ్రాములను రాసేయవచ్చు. అలా మాతృభాషలోనే ప్రోగ్రాములు రాయగలిగితే, రాస్తున్న వారికి కంప్యూటరు పరిజ్ఞానం కూడా పెద్దగా అవసరంలేదేమో...

అయితే సమస్యల్లా అలాంటి పైథాను భాష ప్రస్తుతానికి చైనావారి లిపిలోనే లభ్యమవుతుంది. ఇది త్వరలోనే ఇతరభాషలకు కూడా విస్తరిస్తుందేమో చూడాలి. మరిన్ని వివరాలకు చైనా పైథాను భాషకోసం ఏర్పాటుచేసిన ఈ వెబ్సైటును సందర్శించండి. http://www.chinesepython.org/cgi_bin/cgb.cgi/english/english.html

Friday, February 08, 2008

బొమ్మలలోని భావాలు

వంద మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క బొమ్మతో చెప్పొచ్చంటారు. దానికి సరిగ్గా సరిపోయే బొమ్మ ఇది. "పై" అనే సంఖ్యకు 3.1415... అనే విలువ ఎలా వచ్చిందని అడిగితే, అది వృత్తం యొక్క వ్యాసానికి దాని చుట్టుకొలతకు మధ్యన ఉన్న నిష్పత్తి అని చెప్పొచ్చు. అలా కాకుండా కింద ఉన్న బొమ్మను చూపిస్తే ఎవరైనా సరే "పై" అంటే ఏమిటో చిటికెలో అర్ధం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాదు, దానిని ఇంక జీవితంలో మర్చిపోరు.


వికీమీడియా కామన్సులో ఇటువంటి బొమ్మలు వేలకొలదీ ఉన్నాయి. చూడంగానే చూస్తూ ఉండిపోవాలనిపించే బొమ్మలు కూడా ఇక్కడ వేలలోనే ఉన్నాయి. క్రితం సంవత్సరం అప్లోడుచేసిన బొమ్మలలో అత్యుత్తమ బొమ్మలుగా ఎన్నుకున్న బొమ్మలను కూడా ఒకసారి చూడండి.

Monday, February 04, 2008

ఆణిముత్యాల్లాంటి రెండు సినిమాలు చూసాను

మొన్నా మధ్యన షేరు మార్కెట్టులో అన్ని కంపెనీల షేర్లు ఒక్కసారిగా ఠపీ ఠపీమని పడిపోవటంతో, చేతులు కాల్చుకుంది చాలని దాని జోలి వెళ్లటం మానేసాను. అయితే అలా షేరు మార్కెట్లో జరుగుతున్న మార్పులను చూడక పోవటం వలన చాలా ఖాళీ సమయం దొరికి ఇదిగో ఇలా కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు చూసాను.

అలా చూసిన మొదటి సినిమా ప్రేమికులు. ఈ సినిమా ఎప్పుడో 2005లోనే విడుదలైయింది. మామూలుగా అయితే ఈ సినిమాను చూసే వాడిని కాదు, కానీ నా రూంమేటు ఈ మధ్య తెలుగు సినిమాల సీడీలు తెగకోనేస్తూ ఉండటం వలన ఈ సినిమాను నేను కూడా చూడాల్సొచ్చింది. ఒకే కథతో రెండు సినిమాలను తీసి, ఆ రెండు సినిమాలనూ పక్కపక్కనే అతికించేస్తే తయారయ్యిందే ఈ సినిమా. మొదటి భాగంలో (అదే మొదటి సినిమాలో) ప్రేమికుల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవటంతో, మేడమీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయి, ఇసకలారీలో పడి గతం మర్చిపోతారు. రెండో సినిమాలో "అనుకోకుండా" కలుసుకుని మళ్లీ స్నేహితులయిపోతారు, కానీ వాళ్లకు వారి ప్రేమ గుర్తుకురాదు. వాళ్లకు గుర్తొస్తుందా, రాదా, అని మనం ఎంతో ఆతృతగా సినిమా చూస్తూ ఉంటే చివరాఖరున హీరోయిన్ పెళ్లయిపోయి అరుంధతీ నక్షత్రం చూస్తున్నప్పుడు, ఈ ప్రేమికుల కాలు జారి ఈతకొలనులో పడిన తరువాత వాళ్లకు, అప్పటికే తామిద్దరూ ప్రేమికులని గుర్తొస్తుంది. అప్పటికి మూడో సినిమాకోసం ఎదురు చూస్తున్న మాకు సినిమా అయిపోయినట్లు తెలిసి కొంచెం నిరాశ కలిగింది :(

సినిమాలో నాకు బాగా నచ్చిన సన్నివేశాలు రెండున్నాయి. ఈ రెండు చూట్లా మొత్తం సినిమా యునిట్టంతా చాలా బాగా కష్టపడ్డారు. అదేంటంటే హీరో-హీరోయిన్లు మేడమీద నుండి దూకు ఆత్మహత్య చేసుకోవాలను కునే సన్నివేశం ఒకటి, ఆ తరువాత చినిమా చివరణ కాలు జారి ఈతకొలనులో పడిపోయే సన్నివేశం ఇంకోటి. సాధారనంగా ఎవరయినా మేడమీదనుండి దూకి కొంద పడిపోవడానికి 5 సెకండ్లు పడిపోతుందేమో. కానీ అలా చూపిస్తే మన కెమెరామ్యాను పనితనం, స్టంటు మాస్టారు పనితనం సరిగ్గా చూపించలేమని, ఈ సన్నివేశాలను స్లో మోషన్లో చూపిస్తారు. అలా తీయడం వలన మేడమీదనుండి కింద పడిపోయే వాళ్లమొఖాలలో ఎటువంటి హావభావాలు పెడతారు, వాళ్లు కాళ్లెలా ఆడిస్తారు, చేతులేలా ఆడిస్తారన్నే విషయాలన్నీ డైరెక్టరుగారు మనకు చాలా బాగా వివరిస్తారు. ఈ వివరణంతా మనం ఎక్కడ మర్చి పోతామేమోనని క్లైమాక్సులో ఇంకోసారి హీరో-హీరోయిన్లను మేడమీదనుండి తోసేసి మనతో రివిజను చేపిస్తారు. సరిగ్గా గుర్తులేదు కానీ హీరో-హీరోయిన్లు మేడమీదనుండి పడిపోయేలోపట నేను వెళ్లి ఒక మాగీ ప్యాకెట్టు కొని తెచ్చుకుని వండుకుని తినేశాను, అంత వివరంగా చూపిస్తారు.

ఇప్పటికే ఈ సినిమాను చూడకపోతే గనక మీరీ సినిమాను తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. పైగా ఈ సినిమా Eternal Sunshine of the Spotless Mind అనే ఇంగ్లీషు సినిమాలానే ఉందంత, ఇందుకోసమైనా మీరీ సినిమాను తప్పక చూడాలి. చూసిన తరువాత సినిమాపై మీ అభిప్రాయాన్ని చెప్పటం మర్చిపోవద్దే.


నేను చూసిన రెండో సినిమా ఒక ఇంగ్లీషు సినిమా National Treassure: Book of Secrets ఈ సినిమా కూడా పై సినిమా లాగానే, ఒకే కథతో రెండు సినిమాలు తీసేసారు, అయితే ఇంగ్లీషోడు కొంచెం తెలివిగా దానిని రెండు సినిమాలుగా విడుదలచేశాడు. అయితే ఈ సినిమాలో కొత్తదనం లేదా అంటే ఉంది. మొదటిదాంట్లో ఎదో ఒక మ్యూజియంలోకి చొరబడి బయటకు వచ్చేస్తారు. ఈ సారి ఏకంగా బక్కింహాం ప్యాలెసులోకీ, స్వేతసౌధంలోకి మంచినీళ్లు తాగినంత సులువుగా చొరబడి మళ్లీ బయటకు వచ్చేస్తారు. అంతెందుకు అనుకున్నదే తడవుగా అమెరికా ప్రెసిడెంటునే కిడ్నాపు చేసిపడేస్తాడు మన హీరో.

cost cutting సూచనలు ఈ సినిమాలో బాగా కనిపించాయి, ఉదాహరణకు మొదటి సినిమాలో నిధి ఉన్న ప్రదేశంలోకి చేరిన తరువాత హీరో ఒక లైటు వెలిగిస్తాడు, వెలిగించిన ఆ మంట కాస్తా ఎంతో పెద్దగా ఉన్నా భావనంమొత్తం పరుచుకుని బోలెడంత వెలుగునిస్తుంది, ఈ సినిమాలో కూడా మళ్లీ హీరోనే నిధిని కనుక్కుని అక్కడ పక్కనే కనిపించే పాత్రలో మంటను వెలిగిస్తాడు, కానీ ఈసారి ఎదో కొంచెం ప్రదేశం మాత్రమే వెలుగుతుంది. నిధిలో బంగారం కూడా మొదటి సినిమా అంత పెట్టలేదు. అయితే డైరెక్టరు డబ్బునంతా సినిమా తారాగణాన్ని ఎన్నుకోవటంలో చూపెట్టాడు. ఈ సినిమాలో నికోలస్ కేజ్, హెలెన్ మిరెన్, జాన్ వోయిట్లు ఆస్కారు అవార్డు గెలుచుకోగా, ఎడ్ హారీస్, హార్వే కేయిటెల్లు ఆస్కార్ నామినేషను వరకూ వెళ్లారు. వీళ్లందరినీ తీసుకుని కొత్త కథను తీసుకోవడంలో cost cutting చేసేసినట్లున్నాడు మన డైరెక్టరు జాన్ టార్టెల్టాబుగారు. మొదటి సినిమాలో ఉన్నట్లే ఇందులో కూడా ఒక చేసింగు సీను ఉంటుంది, మొదటి సినిమాలో లాగానే పాతాళలోకంలోకి పోయే ఒక పేద్ద నిలువు సొరంగం ఉంటుంది. అయితే ఈ సారి విలనెనకమాల మొదటి సినిమాలో ఉన్నంత అనుచరగణం ఉండదు (cost cutting), కాబట్టి మన దృష్టినంతా ముఖ్య పాత్రలపైనే పెట్టి సినిమాను ఇంకా బాగా అస్వాదించవచ్చు. ఇందు మూలంగా నేను చేప్పేదేమిటంటే మీకు మొదటి సినిమా నచ్చితే, ఈ సినిమా కూడా మీకు బాగా నచ్చుతుంది, అది నచ్చక పోయినా సరే ఈ సినిమా మీకు నచ్చేస్తుందని నా ప్రగాడ విశ్వాసం. కాబట్టి ఈ సినిమాను కూడా మీరు తప్పక చూసేయాలి.

కొసమెరుపు: ఈ ఆణిముత్యాల్లాంటి సినిమాలను చూసిన తరువాత ఒక్క సారిగా, షేరు మార్కెట్టు మరీ అంత చెడ్డదేమీ కాదని అనిపిస్తుంది.

Sunday, January 20, 2008

మీడియావికీని అనువదించటానికి ఇంకో కారణం

మీలో చాలా మందికి తెలుగు వికీపీడియా, మరియు ఇతర అన్ని వికీపీడియాలకు మీడియావికీ అనే సాఫ్టువేరును వాడతారని తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ మీడియావికీ సాఫ్టువేరు User Interfaceను ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి అనువదిద్దామనే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. అందుకోసం, అనువదించటాన్ని సులభతరం చేయటానికి బేటావికీ అనే సాఫ్టువేరును కూడా తయారు చేసారు. ఈ సాఫ్టువేరును మీడియావికీ డెవలపర్లు తయారు చేసారు, వారే దీని నడుపుతున్నారు.

ఈ బేటావికీ సాఫ్టువేరును ఉపయోగించి, ఆ సాఫ్టువేరులో వాడే కొన్ని వాక్యాలను నేను అనువదించాను. ఇంకొన్ని అప్పటికే తెలుగు వికీపిడియాలో ఉన్న నిర్వాహకులు అనువదించేసారు. అనువదించటానికి మిగిలిపోయిన వాక్యాలు ఇంకా బోలెడన్ని ఉన్నాయి. ఈ సాఫ్టువేరును అనువదించటం పూర్తయితే, తెలుగు వికీపీడియా మొత్తంగా తెలుగులోనే కనపడుతుంది, ఇలాంటి మరియు ఇలాంటి వెబ్సైట్లన్నీ పూర్తిగా తెలుగులోనే ఉంటాయి. అంతే కాదు ఇతర భాషల వికీపీడియాలను కూడా తెలుగులోనే చూసుకోవచ్చు. ఉదాహరణకు: ఇంగ్లీషు వికీపీడియాను తెలుగు UIతో చూడండి (అక్కడ "ఇటీవలి మార్పులు", "మూలాన్ని చూపించు" లాంటి తెలుగు వాక్యాలను చూడవచ్చు).

బేటావికీ సాఫ్టువేరును ఉపయోగించి మీడియావికీలో వాడే వాఖ్యాలను చాలా సులువుగా అనువదించేయవచ్చు. అనువదిస్తున్నప్పుడు ఆ వాక్యాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, దానిని ఇప్పటికే ఎవరయినా అనువదిస్తే ఆ అనువదం ఏమిటి లాంటి వివరాలన్ని చూపిస్తూ మనకు అనువదించటానికి చాలా సహాయకారిగా ఉంటుంది.

బేటావికీ సాఫ్టువేరు ఒకెత్తయితే, అనువదించేసిన తరువాత మనం పారితోషకం కూడా పొందవచ్చు. అందుకోసం వారు ఒక్కో భాషకూ 293 డాలర్లను (సుమారు 11500 రూపాయలు) కేటాయించారు. అంటే మీడియావికీలో ఉన్న వాక్యాలను మొత్తం తెలుగులోకి అనువదించి, పారితోషకం కావాలని అడిగిన వారందరికీ కలిపి 293 డాలర్లను ఇస్తారు. అనువదించే పనిని నాలుగు మైలురాళ్లుగా విడగొట్టారు, ప్రతీ మైలురాయి ఇంతని కేటాయించారు. మీరు చేసిన అనువదాల వలన తెలుగు భాష ఫలానా మైలురాయిని చేరుకుంటే, ఆ మైలురాయికి కేటాయించిన మొత్తాన్ని పారితోషకంగా కోరవచ్చు. మీకు ఇతర భాషలు కూడా తెలిసుంటే ఆ భాషలకు కూడా అనువదించేసి అక్కడ కూడా పారితోషకాన్ని పొందవచ్చు. (ఒక ముఖ్య గమనిక, నేను కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాను ఆ పారితోషకానికి నాకు ఎటువంటి సంభందం లేదు). మీరు కావాలనుకుంటే పారితోషకం తీసుకోకుండా కూడా పని అనువదించేయవచ్చు, అప్పటికే పూర్తిచేసిన అనువదాలను సరి చేయవచ్చు కూడా.

ప్రస్తుతం బేటావికీలో ఉన్న మీడియావికీ అనువాద గణాంకాల ప్రకారం సుమారు 38% పూర్తయింది (నాలుగు మైలురాళ్ళ సగటు). మరింకెందుకు ఆలస్యం మీడియావికీని త్వరత్వరగా అనువదిద్దాం రండి. అనువదించటం మొదలుపెట్టే ముందు బేటావికీలో సభ్యత్వం తీసుకోవాలి, సభ్యత్వం తీసుకున్న తరువాత అక్కడ అనువదించగలగటానికి హక్కులను కోరుతూ Betawiki:Translators అనే పేజీలో విజ్ఞప్తి చేయాలి (24 గంటల లోపటే మీకా హక్కులను ఇచ్చేస్తారు).

Wednesday, January 16, 2008

బాగా బోరుకొడుతుందా...

మీకు నిజంగానే బోరుకొడుతుందా? అయితే మిగతా పోస్టును కూడా చదివేసి ఆ తరువాత పక్కనున్న ఈ బొమ్మపై నొక్కి ఆటను అడేయండి. ఈ ఆటను ఫైరుఫాక్సులోనే ఆడగలరు, IEలో పని చేయకపోవచ్చు. నాకు కూడా రెండు మూడు నెలల క్రితం బాగా బోరుకోట్టి ఈ ఆటను తయారు చేయడం మొదలు పెట్టాను. కొంత మంది దీనిని చుక్కలాట లేదా చుక్కలు-డబ్బాలాట అని కూడా పిలుస్తారు. ఈ ఆట గురించి మరింత తెలుసుకోవడానికి ఆంగ్ల వికీపీడియాలో ఉన్న ఈ వ్యాసాన్ని చదవండి. బీటెక్ చదువుతున్నప్పుడు క్లాసు బోరు కొడుతున్నప్పుడల్లా పక్కన కూర్చున్నోడితో ఈ ఆట ఆడే వాళ్ళం. ఒక సారి పరీక్షలకు చదువుదామని నోట్సు తీస్తే అందులో నాకు నోట్సు కంటే కూడా ఈ గీతలే ఎక్కువ కనపడ్డాయి!!!

ఆటను తయారు చేయడం నెల రోజులలో పూర్తయిపోయింది. కంప్యూటరే ఆలోచించి ఎత్తులువేసేటట్లుగా తయారుచేసాను. ఆ తరువాత ఇంకో నాలుగైదు రోజులు కష్టపడి, ఈ ఆటను w3 standardsకి తీసుకుని వచ్చాను. (ఈ ఆటను పూర్తిగా DHTMLలోనే రాశాను). అంతే కాదు ఫ్లాషు గానీ అప్లెట్టులు కానీ వాడకుండా ప్రోగ్రామును SVG+javascript లోనే రాసేసాను. అంటే నేను మీకు ఆటతోపాటు దాని సోర్సుకోడును కూడా ఇచ్చేసున్నాన్నమాట. మీరు ఈ ప్రోగ్రామును తీసుకుని మీ ఇస్టమొచ్చినట్లు మార్చుకోవచ్చు కూడా.

మీలో సోర్సుకోడును చూసేవాళ్ళు చాలామంది ఉంటారనే అనుకుంటున్నాను. అలా చూసేవాళ్ళకు ఒక చిన్న పరీక్ష. ఇందులో ఆటను మూడో లెవెల్లో ఆడేటప్పుడు కంప్యూటరు ఎత్తులువేయటంలో ఒక చిన్న పొరపాటు చేస్తుంది. ఆ పొరపాటు ఏమిటి? అలా ఎందుకు చేస్తుంది? దానిని సరి చేయడానికి ఏం చేయాలి? ఆ పురుగును పట్టుకోగలరేమో చూడండి!!!

ఇది కాకుండా వేవెనుడి బ్లాగులో ఇంకో ఆట ఉంది అది కూడా ఆడండి. ఈ ఆట యొక్క UI Designని అక్కడి నుండే తీసుకున్నా...