ఇతను నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు నాకు పరిచయమయ్యాడు. తన పెంపుడు కుక్క స్నోయితో కలిసి, దేశ దేశాలు తిరుగుతూ, బోలెడన్ని సాహసాలు చేసేవాడు. ఎక్కడా కూడా వెన్నుచూపి పారిపోయేవాడు కాదు, అందరినీ తెలివిగా ఎదుర్కొనేవాడు. టిన్ టిన్ జనవరి 10 1929లో పుట్టాడు. టిన్ టిన్ మొదట Le Petit Vingtième అనే ఫ్రెంచి పత్రికలోని పిల్లల ప్రత్యేక విభాగంలో కనిపిస్తాడు.
Hergé అనే కలం పేరుతో Georges Prosper Remi అనే బెల్జియం రచయిత ఇతనిని సృస్టించాడు. టిన్ టిన్ మొట్ట మొదట రష్యాలోని అప్పటి కమ్యూనిష్టు పాలనా విశేషాలను తన తోటి ప్రజలయిన బెల్జియం దేశస్తులకు చేరవేయడానికి వెళ్తాడు. టిన్ టిన్ ద్వారా Hergé రష్యా పట్ల తనకు ఉన్న వ్యతిరేకతను వ్యక్త పరిచేవాడు. అందుకే గావచ్చు Tintin in the Land of the Soviets అనే పుస్తకం మనకు ఏ స్కూలు లైబ్రరీలోనూ కనిపించదు. Hergé రష్యా పట్ల ఉన్న వ్యతిరేకతకు ఉదాహరణగా ఈ క్రింది బొమ్మలను చూడొచ్చు.
కానీ ఈ ఒక్క పుస్తకాన్ని చూసి మొత్తం అన్ని టిన్ టిన్ పుస్తకాలపై ఒక అంచనాకు రాకూడదు మరి. ఈ పుస్తకాన్ని మొదలు పెట్టినప్పుడు Hergé వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాతి కొన్ని పుస్తకాలలో టిన్ టిన్ ఎన్నో అంతర్జాతీయ మాదకద్రవ్య ముటాలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు. ఇలా మాదకద్రవ్య వ్యాపారులను వేటాడే క్రమంలో భారతదేశానికి కూడా ఒక వస్తాడు.
అమెరికా వ్యోమగామి Neil Armstrong చంద్రుడి మీద కాలుపెట్టక ముందే టిన్ టిన్ చంద్రుడి మీద కాలు పెట్టేసి మనం బూమి నుండి చూడలేని చంద్రుడి ఇంకో వైపును కూడా చూసేసి వచ్చాడు. అది కూడా Neil Armstrong కంటే ఏకంగా 19 సంవత్సరాల ముందుగానే వెళ్ళి వచ్చాడు. Hergé ఈ పుస్తకం రాయడానికి ముందు చాలా పరిశోధన చేసాడంట. అప్పట్లో అమెరికాగానీ, రష్యాగానీ మానవ సహిత అంతరిక్ష యాత్రకు సన్నాహాలు కూడా మొదలు పెట్టలేదు. Hergé తనకు దొరికిన అతి తక్కువ సమాచారంతో వైజ్ఞానికంగా పెద్ద పెద్ద తప్పులు చేయకుండా కధను చాలా బాగా నడిపించాడు.
మొదటి రెండు మూడు పుస్తకాల కధంతా టిన్ టిన్ అతని పెంపుడు కుక్క స్నోయీల చుట్టూనే నడిచేది. తరువాత కధలలో అతనికి కొంతమంది స్నేహితులు కూడా తోడవుతారు. వాళ్ళలో ముఖ్యమయిన వారు, కాప్టన్ హాడ్డాక్, ఇతను ఒక మందు బాబు. మందు పుచ్చుకున్న తరువాత, అది దిగేదాకా ఏం చేస్తాడో అతనికే తెలియదు. కవలలు కాకపోయినా ఒకేలా కనిపించే థాంసన్ మరియు థాంప్సన్‌లు టిన్ టిన్‌కు పోలీసు మిత్రులు. వీళ్ళిద్దరూ కష్టాలను కొని తెచ్చుకోనిదే నిద్రపోరు, వీళ్ళు ఎప్పుడూ కలిసే కనిస్తుంటారు విడివిడిగా చూడటం చాలా అరుదు. వీరికి ఇంకో స్నేహితుడు సగం చెవుడు ఉన్న ఒక మతిమరుపు "ప్రొఫెసర్ కాల్కులస్". బియాంకా కాస్టాఫియోర్ అనే ఒక గాయిని కూడా వీరికి స్నేహితురాలు.
స్పిల్‌బర్గ్ తీసిన ఇండియానా జోన్స్ సినిమాలోని ముఖ్యపాత్ర కూడా టిన్ టిన్ పాత్రకు దగ్గరగా ఉంటుందని కూడా కొంత మంది భావిస్తారు. అంతేకాదు స్పిల్‌బర్గ్ కూడా నాలాగే టిన్ టిన్ అభిమాని.
Saturday, June 23, 2007
Subscribe to:
Posts (Atom)