మొన్నా మధ్యన షేరు మార్కెట్టులో అన్ని కంపెనీల షేర్లు ఒక్కసారిగా ఠపీ ఠపీమని పడిపోవటంతో, చేతులు కాల్చుకుంది చాలని దాని జోలి వెళ్లటం మానేసాను. అయితే అలా షేరు మార్కెట్లో జరుగుతున్న మార్పులను చూడక పోవటం వలన చాలా ఖాళీ సమయం దొరికి ఇదిగో ఇలా కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు చూసాను.
అలా చూసిన మొదటి సినిమా ప్రేమికులు. ఈ సినిమా ఎప్పుడో 2005లోనే విడుదలైయింది. మామూలుగా అయితే ఈ సినిమాను చూసే వాడిని కాదు, కానీ నా రూంమేటు ఈ మధ్య తెలుగు సినిమాల సీడీలు తెగకోనేస్తూ ఉండటం వలన ఈ సినిమాను నేను కూడా చూడాల్సొచ్చింది. ఒకే కథతో రెండు సినిమాలను తీసి, ఆ రెండు సినిమాలనూ పక్కపక్కనే అతికించేస్తే తయారయ్యిందే ఈ సినిమా. మొదటి భాగంలో (అదే మొదటి సినిమాలో) ప్రేమికుల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవటంతో, మేడమీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయి, ఇసకలారీలో పడి గతం మర్చిపోతారు. రెండో సినిమాలో "అనుకోకుండా" కలుసుకుని మళ్లీ స్నేహితులయిపోతారు, కానీ వాళ్లకు వారి ప్రేమ గుర్తుకురాదు. వాళ్లకు గుర్తొస్తుందా, రాదా, అని మనం ఎంతో ఆతృతగా సినిమా చూస్తూ ఉంటే చివరాఖరున హీరోయిన్ పెళ్లయిపోయి అరుంధతీ నక్షత్రం చూస్తున్నప్పుడు, ఈ ప్రేమికుల కాలు జారి ఈతకొలనులో పడిన తరువాత వాళ్లకు, అప్పటికే తామిద్దరూ ప్రేమికులని గుర్తొస్తుంది. అప్పటికి మూడో సినిమాకోసం ఎదురు చూస్తున్న మాకు సినిమా అయిపోయినట్లు తెలిసి కొంచెం నిరాశ కలిగింది :(
సినిమాలో నాకు బాగా నచ్చిన సన్నివేశాలు రెండున్నాయి. ఈ రెండు చూట్లా మొత్తం సినిమా యునిట్టంతా చాలా బాగా కష్టపడ్డారు. అదేంటంటే హీరో-హీరోయిన్లు మేడమీద నుండి దూకు ఆత్మహత్య చేసుకోవాలను కునే సన్నివేశం ఒకటి, ఆ తరువాత చినిమా చివరణ కాలు జారి ఈతకొలనులో పడిపోయే సన్నివేశం ఇంకోటి. సాధారనంగా ఎవరయినా మేడమీదనుండి దూకి కొంద పడిపోవడానికి 5 సెకండ్లు పడిపోతుందేమో. కానీ అలా చూపిస్తే మన కెమెరామ్యాను పనితనం, స్టంటు మాస్టారు పనితనం సరిగ్గా చూపించలేమని, ఈ సన్నివేశాలను స్లో మోషన్లో చూపిస్తారు. అలా తీయడం వలన మేడమీదనుండి కింద పడిపోయే వాళ్లమొఖాలలో ఎటువంటి హావభావాలు పెడతారు, వాళ్లు కాళ్లెలా ఆడిస్తారు, చేతులేలా ఆడిస్తారన్నే విషయాలన్నీ డైరెక్టరుగారు మనకు చాలా బాగా వివరిస్తారు. ఈ వివరణంతా మనం ఎక్కడ మర్చి పోతామేమోనని క్లైమాక్సులో ఇంకోసారి హీరో-హీరోయిన్లను మేడమీదనుండి తోసేసి మనతో రివిజను చేపిస్తారు. సరిగ్గా గుర్తులేదు కానీ హీరో-హీరోయిన్లు మేడమీదనుండి పడిపోయేలోపట నేను వెళ్లి ఒక మాగీ ప్యాకెట్టు కొని తెచ్చుకుని వండుకుని తినేశాను, అంత వివరంగా చూపిస్తారు.
ఇప్పటికే ఈ సినిమాను చూడకపోతే గనక మీరీ సినిమాను తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. పైగా ఈ సినిమా Eternal Sunshine of the Spotless Mind అనే ఇంగ్లీషు సినిమాలానే ఉందంత, ఇందుకోసమైనా మీరీ సినిమాను తప్పక చూడాలి. చూసిన తరువాత సినిమాపై మీ అభిప్రాయాన్ని చెప్పటం మర్చిపోవద్దే.
నేను చూసిన రెండో సినిమా ఒక ఇంగ్లీషు సినిమా National Treassure: Book of Secrets ఈ సినిమా కూడా పై సినిమా లాగానే, ఒకే కథతో రెండు సినిమాలు తీసేసారు, అయితే ఇంగ్లీషోడు కొంచెం తెలివిగా దానిని రెండు సినిమాలుగా విడుదలచేశాడు. అయితే ఈ సినిమాలో కొత్తదనం లేదా అంటే ఉంది. మొదటిదాంట్లో ఎదో ఒక మ్యూజియంలోకి చొరబడి బయటకు వచ్చేస్తారు. ఈ సారి ఏకంగా బక్కింహాం ప్యాలెసులోకీ, స్వేతసౌధంలోకి మంచినీళ్లు తాగినంత సులువుగా చొరబడి మళ్లీ బయటకు వచ్చేస్తారు. అంతెందుకు అనుకున్నదే తడవుగా అమెరికా ప్రెసిడెంటునే కిడ్నాపు చేసిపడేస్తాడు మన హీరో.
cost cutting సూచనలు ఈ సినిమాలో బాగా కనిపించాయి, ఉదాహరణకు మొదటి సినిమాలో నిధి ఉన్న ప్రదేశంలోకి చేరిన తరువాత హీరో ఒక లైటు వెలిగిస్తాడు, వెలిగించిన ఆ మంట కాస్తా ఎంతో పెద్దగా ఉన్నా భావనంమొత్తం పరుచుకుని బోలెడంత వెలుగునిస్తుంది, ఈ సినిమాలో కూడా మళ్లీ హీరోనే నిధిని కనుక్కుని అక్కడ పక్కనే కనిపించే పాత్రలో మంటను వెలిగిస్తాడు, కానీ ఈసారి ఎదో కొంచెం ప్రదేశం మాత్రమే వెలుగుతుంది. నిధిలో బంగారం కూడా మొదటి సినిమా అంత పెట్టలేదు. అయితే డైరెక్టరు డబ్బునంతా సినిమా తారాగణాన్ని ఎన్నుకోవటంలో చూపెట్టాడు. ఈ సినిమాలో నికోలస్ కేజ్, హెలెన్ మిరెన్, జాన్ వోయిట్లు ఆస్కారు అవార్డు గెలుచుకోగా, ఎడ్ హారీస్, హార్వే కేయిటెల్లు ఆస్కార్ నామినేషను వరకూ వెళ్లారు. వీళ్లందరినీ తీసుకుని కొత్త కథను తీసుకోవడంలో cost cutting చేసేసినట్లున్నాడు మన డైరెక్టరు జాన్ టార్టెల్టాబుగారు. మొదటి సినిమాలో ఉన్నట్లే ఇందులో కూడా ఒక చేసింగు సీను ఉంటుంది, మొదటి సినిమాలో లాగానే పాతాళలోకంలోకి పోయే ఒక పేద్ద నిలువు సొరంగం ఉంటుంది. అయితే ఈ సారి విలనెనకమాల మొదటి సినిమాలో ఉన్నంత అనుచరగణం ఉండదు (cost cutting), కాబట్టి మన దృష్టినంతా ముఖ్య పాత్రలపైనే పెట్టి సినిమాను ఇంకా బాగా అస్వాదించవచ్చు. ఇందు మూలంగా నేను చేప్పేదేమిటంటే మీకు మొదటి సినిమా నచ్చితే, ఈ సినిమా కూడా మీకు బాగా నచ్చుతుంది, అది నచ్చక పోయినా సరే ఈ సినిమా మీకు నచ్చేస్తుందని నా ప్రగాడ విశ్వాసం. కాబట్టి ఈ సినిమాను కూడా మీరు తప్పక చూసేయాలి.
కొసమెరుపు: ఈ ఆణిముత్యాల్లాంటి సినిమాలను చూసిన తరువాత ఒక్క సారిగా, షేరు మార్కెట్టు మరీ అంత చెడ్డదేమీ కాదని అనిపిస్తుంది.
Monday, February 04, 2008
Subscribe to:
Post Comments (Atom)
ఆణిముత్యాలలాంటి సినిమాలన్నారని ఆశక్తిగా చూస్తుంటే ప్రేమికులు అని కనపడింది.ఒక్క నిమిషం షా....కు లో వుండిపోయాను.ప్రదీపు గారేమిటి ఈ సినిమాని ఆణిముత్యమనడమేమిటని?హ హ హ...ఫిబ్రవరిలో ఫూల్ నయ్యాను నేను.
ReplyDeleteహ హ హ...
ReplyDeleteఅరెరె నేను రెండూ మిస్సయిపోయానే...
ReplyDeleteఆ "National Treasure" మొదటిది నేను చూసినట్టున్నా.
ఈ సారి ఇలాంటి ఆణిముత్యాలు చూడడానికి నన్ను పిలవండి. వచ్చి మాగీ తింటా :)
@రాధికగారు, నేను తిన్న షాకును పంచుకోవడానికే ఈ టపా :)
ReplyDelete@రమ్యగారు, ఈ రెండు సినిమాలనూ తప్పక చూడండి, కనీసం మొదట సినిమానయినా చూడండి, అయినా సూపర్‌హిట్ సినిమా అని చెప్పి ఏదో ఒక టీవీ చానల్లో ఈ పాటికే వేసేసి ఉంటాడు.
@ప్రవీణ్‌గారూ, ఫోరంలో "బుక్ ఆఫ్ సీక్రెట్స్" ఇంకా తెరిచే ఉంది. అలా ఒక సారివెళ్లి ఆ సినిమాను చూసేసి, ల్యాండ్మార్కులో "ప్రేమికులు" CDని కొనేసేయండి (మా రూములోది ఎందుకోగానీ సినిమా చూడంగానే విరిగి రెండు ముక్కలైయింది!). ప్రేమికులు సినిమాను మాత్రం తప్పక చూడాల్సిన సినిమా...
అమ్మో నేను అస్సలు చూడను.
ReplyDeleteమీరు ఇంత శాడిస్తులన్న మాట( మమ్మల్నీబలి చేయాలనే!)
మొదట ఈ టపా చుడగానే హమ్మయ్య ఈ వారానికి ఒక రెండు సినిమాలు చుడొచ్చు అనుకున్న. ప్రేమికులు అని చుడగానే షాక్ అయ్యను... అసలు ఈ సినిమా పేరు విన్నట్టు కూడా లేదె అనుకున్నాను... తరువాత idlebrain లో ఫొటొ చూసి తెలుసుకున్న... మీరు బలి అయింది కాక ఇంకొ నలుగురిని బలిద్దామనుకున్నారా!... లేక ఆ సినిమాలో చివరిలో ఎమన్న సందేశం ఇచ్చారా... "మీరు బలి అయ్యరు కదా ఇంకొ నలుగురిని బలిచ్చి అనందించండి" అని ఇచ్చారా.... :))
ReplyDeleteApprreciate this blog post
ReplyDelete