Sunday, January 20, 2008

మీడియావికీని అనువదించటానికి ఇంకో కారణం

మీలో చాలా మందికి తెలుగు వికీపీడియా, మరియు ఇతర అన్ని వికీపీడియాలకు మీడియావికీ అనే సాఫ్టువేరును వాడతారని తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ మీడియావికీ సాఫ్టువేరు User Interfaceను ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి అనువదిద్దామనే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. అందుకోసం, అనువదించటాన్ని సులభతరం చేయటానికి బేటావికీ అనే సాఫ్టువేరును కూడా తయారు చేసారు. ఈ సాఫ్టువేరును మీడియావికీ డెవలపర్లు తయారు చేసారు, వారే దీని నడుపుతున్నారు.

ఈ బేటావికీ సాఫ్టువేరును ఉపయోగించి, ఆ సాఫ్టువేరులో వాడే కొన్ని వాక్యాలను నేను అనువదించాను. ఇంకొన్ని అప్పటికే తెలుగు వికీపిడియాలో ఉన్న నిర్వాహకులు అనువదించేసారు. అనువదించటానికి మిగిలిపోయిన వాక్యాలు ఇంకా బోలెడన్ని ఉన్నాయి. ఈ సాఫ్టువేరును అనువదించటం పూర్తయితే, తెలుగు వికీపీడియా మొత్తంగా తెలుగులోనే కనపడుతుంది, ఇలాంటి మరియు ఇలాంటి వెబ్సైట్లన్నీ పూర్తిగా తెలుగులోనే ఉంటాయి. అంతే కాదు ఇతర భాషల వికీపీడియాలను కూడా తెలుగులోనే చూసుకోవచ్చు. ఉదాహరణకు: ఇంగ్లీషు వికీపీడియాను తెలుగు UIతో చూడండి (అక్కడ "ఇటీవలి మార్పులు", "మూలాన్ని చూపించు" లాంటి తెలుగు వాక్యాలను చూడవచ్చు).

బేటావికీ సాఫ్టువేరును ఉపయోగించి మీడియావికీలో వాడే వాఖ్యాలను చాలా సులువుగా అనువదించేయవచ్చు. అనువదిస్తున్నప్పుడు ఆ వాక్యాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, దానిని ఇప్పటికే ఎవరయినా అనువదిస్తే ఆ అనువదం ఏమిటి లాంటి వివరాలన్ని చూపిస్తూ మనకు అనువదించటానికి చాలా సహాయకారిగా ఉంటుంది.

బేటావికీ సాఫ్టువేరు ఒకెత్తయితే, అనువదించేసిన తరువాత మనం పారితోషకం కూడా పొందవచ్చు. అందుకోసం వారు ఒక్కో భాషకూ 293 డాలర్లను (సుమారు 11500 రూపాయలు) కేటాయించారు. అంటే మీడియావికీలో ఉన్న వాక్యాలను మొత్తం తెలుగులోకి అనువదించి, పారితోషకం కావాలని అడిగిన వారందరికీ కలిపి 293 డాలర్లను ఇస్తారు. అనువదించే పనిని నాలుగు మైలురాళ్లుగా విడగొట్టారు, ప్రతీ మైలురాయి ఇంతని కేటాయించారు. మీరు చేసిన అనువదాల వలన తెలుగు భాష ఫలానా మైలురాయిని చేరుకుంటే, ఆ మైలురాయికి కేటాయించిన మొత్తాన్ని పారితోషకంగా కోరవచ్చు. మీకు ఇతర భాషలు కూడా తెలిసుంటే ఆ భాషలకు కూడా అనువదించేసి అక్కడ కూడా పారితోషకాన్ని పొందవచ్చు. (ఒక ముఖ్య గమనిక, నేను కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాను ఆ పారితోషకానికి నాకు ఎటువంటి సంభందం లేదు). మీరు కావాలనుకుంటే పారితోషకం తీసుకోకుండా కూడా పని అనువదించేయవచ్చు, అప్పటికే పూర్తిచేసిన అనువదాలను సరి చేయవచ్చు కూడా.

ప్రస్తుతం బేటావికీలో ఉన్న మీడియావికీ అనువాద గణాంకాల ప్రకారం సుమారు 38% పూర్తయింది (నాలుగు మైలురాళ్ళ సగటు). మరింకెందుకు ఆలస్యం మీడియావికీని త్వరత్వరగా అనువదిద్దాం రండి. అనువదించటం మొదలుపెట్టే ముందు బేటావికీలో సభ్యత్వం తీసుకోవాలి, సభ్యత్వం తీసుకున్న తరువాత అక్కడ అనువదించగలగటానికి హక్కులను కోరుతూ Betawiki:Translators అనే పేజీలో విజ్ఞప్తి చేయాలి (24 గంటల లోపటే మీకా హక్కులను ఇచ్చేస్తారు).

3 comments:

  1. వావ్..ఈ ఆలోచన బాగుంది. మనమంతా కలిసి దీన్ని అనువదించి ఈ పారితోషికాన్ని ఈ-తెలుగు వ్యవస్థాపక మూలనిధిగా ఇస్తే ఎలా ఉంటుంది. దీని గురించి బ్లాగర్ల గుంపులోను, తెవికీ గుంపులోనూ, తెవికీ రచ్చబండలోనూ వ్రాయగలరా

    ReplyDelete
  2. బేటావికీలో మీడియావికీ అనువాద గణాంకాలు:
    మొత్తం మీడియావికీ వాక్యాలు: 1744 (ఇంకా 320 వాక్యాలను అనువదించాల్సి ఉంది) 75% పూర్తయ్యింది
    తరచుగా ఉపయోగించే మీడియావికీ వాక్యాలు: 494 (ఇంకా 0 వాక్యాలను అనువదించాల్సి ఉంది) 100% పూర్తయ్యింది
    మీడియావికీ అనుబంద ప్రోగ్రాములలో ఉపయోగించే వాక్యాలు: 2182 (ఇంకా 1935 వాక్యాలను అనువదించాల్సి ఉంది) 10% పూర్తయ్యింది
    తెవికీలో ఉపయోగించే మీడియావికీ అనుబంద ప్రోగ్రాముల వాక్యాలు: 582 (ఇంకా 371 వాక్యాలను అనువదించాల్సి ఉంది) 34% పూర్తయ్యింది

    అనువదించటం ఎంత ముఖ్యమో, అవి సుళువుగానే అర్థమవుతున్నాయా లేదా, అనేది కూడా అంతే ముఖ్యం. కాబట్టి అనువదిస్తున్న వారికి సహాయంగా అనువాదాలను పరిశీలించేవాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకనే పైన ఇచ్చిన లింకులను నొక్కితే అంగ్లంలో ఉన్న అసలు వాక్యం, తెలుగులోకి అనువదించిన తరువాత దానికి సమానమైన వాక్యాలను చూపించే పేజీకి తీసుకుని వెళ్తాయి. సరిగ్గాలేదనిపించే అనువాదాలు ఏమయినా కనపడితే వాటిని ఆ వాక్యానికి సంభందించిన చర్చా పేజీలలో తెలుపవచ్చు. లేదా అనువాద హక్కులను తీసుకుని ఆ మార్పులను మీరే చేసేసేయవచ్చు (అనువాద హక్కులు ఎలా పొందాలో పైన టపాలోనే పేర్కొన్నాను).

    అనువదించినందుకు పారితోషకం తీసుకోవచ్చని ఇంతకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు మనం మీడియావికీలో తరచుగా ఉపయోగిస్తున్న వాక్యాలన్నిటినీ అనువదించేసి మొదటి మైళురాయికి చేరుకున్నాం, తెలుగు వీరగారన్నట్లు ఈ పారితోషకాన్ని మనం తీసుకుని దానిని e-తెలుగుకు మూలనిధిగా చేర్చవచ్చు. లేదా ఎవరయినా తమ వ్యక్తిగతావసరాలకు వాడుకోవడానికి తీసుకోవచ్చు.

    ReplyDelete
  3. ఇప్పుడు నాలుగో మైలురాయిని కూడా చేరుకున్నాం!

    ReplyDelete