Wednesday, October 22, 2008

పప్పుసుద్ద

ఈ పేరు వినంగానే, వండేస్తున్నారేమో అని చుట్టూ చూస్తా. ఎప్పుడయినా ఆంధ్రా మెస్సులకు వెళ్తే, అక్కడ పప్పు తప్ప ఇంకే పదార్థం కనపడదు నాకు, నాకు పప్పే fry, పప్పే సాంబారు, పప్పే రసం ఇంకా అన్నీనూ. అంతిష్టం నాకు పప్పు అంటే. ఇంట్లో అయితే రోజుకు ఒక్క సారి అయినా ఆ పప్పు ఉండాల్సిందే. అసలు నాలాంటి పప్పు ప్రేమికులు మన ఆంధ్రదేశంలో చాలామంది ఉంటారు, అందుకేగా ప్రతీ ఆంధ్రా మెస్సులలో వేరే కూరలు ఉన్నా లేకపోయినా పప్పు మాత్రం తప్పనిసరి ఉండేటట్లు చూసుకుంటారు! అందుకనే ఈ పప్పుకు ఒక ప్రత్యేక టపానే రాద్దామని అనుకున్నా. అలాగే ఈ టపా చివర్లో పప్పు తయారు చేసే విధానాన్ని ఒక టెంప్లేటులా అందిస్తున్నా.

మొదటగా నా వల్ల జరిగిన ఒక సంఘటనను వివరిస్తా. ఒకసారి హైదరాబాదు కోఠీలో ఒక హాస్టలులో ఉంటున్న స్నేహితుడిని కలవటానికి వెల్లాను. మధ్యాహ్నం బాగా లేటు అవ్వటంతో ఆ హాస్టలులో ఉన్న మెస్సులోనే భోజనం కూడా చేసేద్దాం అని అనుకున్నా. మెస్సతను కూడా చాలా చాలా ఆనందంగా 15/- ఇచ్చి భోజనం చేసేయండని చెప్పాడు. భోజనం దగ్గర అన్ని పధార్ధాలూ అక్కడ ఒక దగ్గర ఉంటే ఎవరికి వాళ్లు వెళ్లి వడ్డించేసుకుని తినేసేయాలి (buffet type అన్నమాట). చూడటానికి ఒక TV కూడా పెట్టాడు. నేను ఏమేం కూరలో వెతికితే పప్పు కనపడింది (టమాటో పప్పు అనుకుంటా). రుచి చూసా, అమృతంలా అనిపించింది, పప్పుకి అంత మంచి రుచి తీసుకువచ్చిన ఆ మెస్సతనికి వెంటనే సన్మానం చేసేయాలని అనిపించింది. ఓ పక్క TV చూస్తూ ఇంకో పక్క పప్పులో అన్నం నంచుకుంటూ నా మానాన నేను తింటూ ఉన్నా. కొంత సేపటికి (ఓ గంట తరువాత అనుకుంటా) ఆ హాస్టలులో ఉండే వాళ్లు వచ్చారు తింటానికి, వాళ్లకు పప్పు తప్ప అన్ని కూరలూ నిండుగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత వాళ్లు వెళ్లి మెస్సతనితో గొడవపెట్టుకోవడం, నేను తింటం ఆపేసి (పప్పు అయిపోయింది కాబట్టి ఆపేయాల్సి వచ్చింది), డబ్బులిచేసి అక్కడి నుండీ చల్లగా జారుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. తరువాత తెలిసింది అక్కడ అరగంటలోనే మళ్లీ పప్పుని వండేశారంట.

అయితే అందరూ తయారు చేసే పప్పు కూరలు ఒకే రకంగా ఉండవు. కొందరు పప్పుని మెత్తగా ముద్దలా అయ్యేదాకా ఉడకబెడితే, ఇంకొందరు పప్పుని ఉడికీఉడకకుండా ఇంకా పప్పులుగానే కనిపించేటట్లు తయారు చేస్తారు. పెసర పప్పూ, కందిపప్పులకు నాకు మొదటి రకం బాగా ఇష్టం, శనగ పప్పుకయితే రెండో రకం బాగా ఇష్టం. అంతే కాదు, ఈ పప్పుని రకరకాలుగా వండుకోవచ్చని మీ అందరికీ తెలిసే ఉంటుంది: ముద్దపప్పు, టమాటో పప్పు, దోసకాయ పప్పు, బీరకాయా శనగ పప్పు, ఇలాంటివన్నీ కాక ఎన్నిరకాల ఆకుకూరలు ఉంటాయో అన్ని రకాల ఆకుకూరపప్పులు ఉంటాయి.

ఇప్పుడు నేను పప్పును తయారు చేయటం చెప్పేసి అది ఎంత సులువుగా తయారుచేసుకోవచ్చో చూపిస్తా. కుక్కరు గిన్నెలో ఒక కప్పు కడిగేసిన పప్పుని తీసుకోండి, అందులో రెండు కప్పుల నీళ్లుపోయండి, ఆ తరువాత ఒక వుల్లిపాయ, నాలుగు పచ్చి మిరపకాయలు కొంచెం పద్దసైగులోనే తరిగేసి కుక్కరు గిన్నెలోనే వేసేయండి. రెండు ఐదు రూపాయి బిల్లలంత చింతపండును కూడా ఆ కుక్కరు గిన్నెలో వేసేయండి. ఆ తరువాత మీకు నచ్చిన ఆకుకూర ఒక కట్ట, లేకపోతే మీకు నచ్చిన కూరగాయ(మామూలుగా టమాటాలు, దోసకాయలూ వేస్తారు; మీకు మీ వంటమీద నమ్మకం వుంటే గనక వంకాయలు, బెండకాయలూ, చిక్కుడుకాయలు లాంటి ఏ కూరగాయలయినా వేసేయొచ్చు :) ) ఒక 100 - 150 గ్రాములు తరిగేసి వేసేయండి. కుక్కరు మూత పెట్టేసి 3-5 విజిల్సు(పప్పు ముద్దగా లేదా పలుకులుగా ఉండాలనుకునేదాన్ని బట్టి) వచ్చేదాకా కుక్కరును స్టవ్‌మీద వుంచండి.

కుక్కరు తెరిచిన తరువాత అందులోని పప్పుని ఒక సారి కలిపి కొంచెం పలచగా చేయడానికి తగినంత(ఒక కప్పు సరిపోతాయి) నీళ్లు పోయాలి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి, నీళ్లు, ఉప్పు, పప్పు కలిసే వరకూ తిప్పండి. తరువాత అందులో తాలిపు వేసేసి కొత్తిమీర జల్లితే ఘుమఘుమలాడే పప్పు తయారు.

29 comments:

  1. Super ga undi mee pappu post. Maa ramani gari to poatee naa ?

    Inko vishayam. pottu tiyyani minappappu / pesara pappu (nallaga / green gaa vuntundi) toa pappu cheyyandi. manchi protein, fibre, B vitamin.. annee okea shot loa tinocchu.

    ReplyDelete
  2. మంచి పప్పన్నంలాంటి టపానందించారు.

    ReplyDelete
  3. :)బాగుంది మీ పప్పోపాఖ్యానం. జిందాబాద్ పప్పు. మా ఇంట్లో నేను తప్ప అందరూ మీ టైపే:)

    @సుజాత గారు, పట్టు తియ్యని మినప్పప్పుతో పప్పా!!

    ReplyDelete
  4. పప్పు బ్యాచిలర్ ల పాలిట ఓ వరం. ఏమంటారు ? త్వరగా అయిపోయేది అదే కదా.

    ReplyDelete
  5. మీరు చేసీ ఆ పదార్దం గట్టి గా ఉంటే - అది పప్పు.
    జారుగా ఉంటే - సాంబారు.
    ఇంకా జారుగా ఉంటే - చారు/రసం

    ReplyDelete
  6. హమ్మనీ!!! నా రాబోయే పోష్టు ఇదే!!! కొంతమందికి నా టెంప్లేట్ కాంన్సెప్టు నచ్చల...
    భాస్కర్

    ReplyDelete
  7. @sujata గారు: పొట్టుతీయని మినప్పప్పుతో పప్పు చేస్కుంటారా? అసలు మినప్పప్పుతో పప్పు వండుకుంటారా?
    ఎంత బెమ్మచారులైతే మాత్రం ఇంత మోసమా!!! ముడిపెసలు ఉడకవు. ముందుగా నానబెట్టుకోవాలి.

    ReplyDelete
  8. ఈ పప్పు సుద్ద టపా గురించి రాయాల్సుంది చాలా ఉంది అధ్యక్షా,కానీ జ్వరం,నీరసం చేత ఇంతకన్నా ఎక్కువరాయలేకపోతున్నాననీ,త్వరలో ఆ సంగతి రాస్తానని మీద్వారా తెలియజేస్ కుంటూ,ఆ విధంగా ముందుకు పోవాలని విన్నవించుకుంటూ ...

    ReplyDelete
  9. పప్పు పురాణం బావుంది కానీ, పైన తమరు పెట్టిన బొమ్మ మసూర్ పప్పుది. తెలుగువాడికి అత్యంత ప్రియమైన కంది పప్పుని వదిలి ఇలా ఎర్రపప్పుని గద్దెనెక్కించడం ఏం బాలేదు.

    మినప్పప్పుతో (నిజానికి, మినుముల్తో) పప్పు - దీన్ని సాధారణంగా దాల్ మఖానీ అనే పంజాబీ వంటకంగా చూసి ఉంటారు. కానీ ఎత్తుకెత్తు వెన్న పొయ్యకుండానే చాలా మంది రుచికరంగా చేస్తారు. కానీ తెలుగు వాళ్ళెవరూ చెయ్యడం నేను చూళ్ళేదు.

    ReplyDelete
  10. అసలు సంగతి తెలియదు కానీ మినప్పప్పు తో పప్పు చేస్తే చెముడు వస్తుందని అంటారు.అందుకే మనవాళ్ళు తినరు.దాల్ మాఖినీ బాగుంటుంది చపాతీతో.

    ReplyDelete
  11. మీరు నాకెంతో నచ్చేసారు - పప్పు అయిపోయింది కాబట్టి/అవగొట్టాకే భోజనం ముగించినందుకు! :)
    ఇప్పుడు..
    ==కొన్ని వాస్తవాలు==
    పప్పుల్లోకెల్లా అత్యుత్తమమైనది కందిపప్పు. అందునా ముద్ద పప్పు! దాంతో ఆవకాయ కలుపుకుని ఇంత నెయ్యేసుకుని గానీ, ఉత్తపప్పు లోనే అంత నెయ్యేసుకుని గానీ, గోంగూరతోగానీ, వంకాయో, బెండకాయో, బీరకాయో.. ఏదో ఒక పులుసుతోగానీ తింటే జన్మరాహిత్యం కలుగుతుంది.
    ==మూలాలు, వనరులు==
    నేనే!

    ReplyDelete
  12. @oremuna :)

    @sujata
    నా దృష్టిలో పప్పులంటే మొదటగా కందిపప్పు, ఇది లేకపోతే పెసరపప్పు లేదా ఎర్రపప్పు; ఇంకా మిగతావేవీ నాకు పప్పులు కానట్టే లెక్క!

    @చిలమకూరు విజయమోహన్
    నేనర్లు.

    @సిరిసిరిమువ్వ
    అసలు మిమ్మల్ని కూడా ఈ పప్పు క్లబ్బులో చేరిపోదామని చెప్దామని అనుకున్నా, కానీ పప్పు రేట్లు పెరిగిపోతుండటంతో ప్రస్తుతానికి మిమ్మల్ని ఈ క్లబ్బులోకి ఆహ్వానించటంలేదండీ ... అసలు నేను ఈ టపాకు పప్పోఖ్యానం ముందు అని పేరుపెడదామని అనుకున్నా, కానీ అది సరైన పద ప్రయోగమో కాదో తెలీక పెట్టలేదు...

    @చైతన్య
    దీనికంటే తొందరగా అయిపోయేది టమాటోకూర. కానీ దేనికైనా పప్పు అంత టేస్టు రాదుగా, కాబట్టి మీరు చెప్పెనట్లు పప్పు బ్యాచిలర్సు పాలిట ఒక వరం!!

    @krishna rao jallipalli
    మీరు చెప్పింది అక్షరాలా నిజం, అందుకే పూర్తిగా చేసే వరకూ ఏం వండుతున్నామో ఎవరికీ చెప్పకూడాదు :)

    @భాస్కర్ రామరాజు
    మీరు మీ పోస్టును కూడా వేసేయండి. పప్పు గాధను ఎన్ని సార్లు విన్నా/చదివినా ఇంకా ఇంకా వినాలని/చదవాలనీ అనిపిస్తూ ఉంటుంది.

    @రాజేంద్ర కుమార్ దేవరపల్లి
    అవునండి ఎంత రాసినా తరగదు, ఎప్పటికీ రాయాల్సింది అలా ఎంతో కొంత మిగిలే ఉంటుంది, కాబట్టి మీరు కూడా తొందరగా కోలుకుని రాసేయాలని మనవి.

    @కొత్త పాళీ
    అవునండీ ఈ ఎర్రపప్పు ఫొటో పెట్టి, కంది పప్పు మాతకు చాలా ద్రోహం చేస్తున్నాను. వికీపీడియాలో తూర్ దాల్ అని వెతికితే ఒక పేజీ వచ్చింది, అందులో ఉన్న ఫొటోలు పెడితే కందిపప్పుకే అవమానం అని చివరికి ఎర్రపప్పుతో తృప్తిపడ్డాను. కానీ మీరు చెప్పిన తరువాత నేనే కందిపప్పు మాతను ఫొటోతీసేసి ఇక్కడ పెట్టేసాను. అసలు వండిన పప్పుని ఫొటో తీసి పెడదామని అనుకున్నా, కాకపోతే ప్రతీ సారి ఫొటో తీసే సమయానికి గిన్నెలో పప్పు ఖాళీ అయిపోతుంది!

    @రాధిక
    మినప్పప్పు తింటే చెముడు వస్తుందా! మరి అట్లా అయితే నాకు ఇస్టమైన ఇంకో వంటకం ఇడ్లీల సంగతేంటి :(

    @chaduvari
    అవునండీ తరువాత పప్పును మళ్లీ వండారనీన్నూ, నేను అక్కడ రెండో సారికి లేన్నందుకూనూ తరువాత చాలా బాధపడ్డాను... ముద్ద పప్పులో వంకాయ fry కలుపుకుంటా భలేగా ఉంటుంది, ఒక సారి ప్రయత్నించి చూడంది.
    == కొన్ని పుకార్లు ==
    పప్పు తింటే పొట్ట వచ్చేస్తుంది అని చాలా పుకార్లు వ్యాప్తిలో ఉన్నాయి అవేవి నిజంకాదనీ. ఇలాంటి వాటిని నమ్మకుండా పప్పు ప్రియులు ఎప్పటిలాగానే పప్పును తింటూ ఉండాలని నా మనవి.
    == మూలాలూ వనరులు ==
    నేను అతి రహస్యంగా సేకరించిన కొన్ని గణాంకాలు :)

    ReplyDelete
  13. ప్రదీప్ స్వయంపాకం మొదలెట్టినట్టున్నావు. గుడ్ ...నాతరఫు నుండి ఒక చిట్కా. తాళింఫులో వెల్లుల్లి కలిపితే పోపు ఘాటు పొలిమేర దాటి పోతుంది. ఇక పప్పు సంగతి అదుర్స్..

    ReplyDelete
  14. పప్పు సూపరు.

    ReplyDelete
  15. @ ప్రదీప్ గారు
    ఇక్కడ నేను రాయకపోతే కందిపప్పు నా మీద అలిగి నాకు దొరక్కుండాపోతుందేమో అని భయంతో రాస్తున్నా...
    నాక్కూడా మీలానే పప్పు అంటే కందిపప్పు, ఆ తరవాతా చాలా దూరంలో పెసర పప్పు, ఆ తరవాత ఇంకా చాలా దూరంలో సనగ పప్పు కనబడతాయి... మిగిలిన రంగు రంగుల పప్పులు, ఈ నార్త్ వాళ్ళు తినేవి అసలు యాక్ అన్నమాట...

    ReplyDelete
  16. హాయ్‌..
    నేను పప్పు.. అరుణ పప్పు..
    (బాండ్‌.. జేమ్స్‌ బాండ్‌లాగా చదువుకోగలరు..)
    :)
    That is my surname.
    పప్పు మీద టపా బాగుంది ప్రదీప్‌!

    ReplyDelete
  17. @జ్యోతి
    గత 10 సంవత్సరాల నుండి, మధ్య మధ్యలో కొన్ని విరామాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. కాబట్టి మరీ ఇంత అత్భుతంగా కాకపోయినా ఓమాదిరిగా నెట్టుకు రాగలను. అప్పుడప్పుడూ ఈ వెల్లులి కూడా వేస్తుంటాను, కానీ తాలింపు వేసేటప్పుడు ఘాటు అందరికీ తెలవటానికి వేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది!

    @రవి
    నిజమే పప్పెపుడూ సూపరే.

    @ఏకాంతపు దిలీప్
    అవునండీ ఆ దాల్, ఈ దాల్ అని ఎదేదో పేర్లతో కొన్ని పప్పులు వండుతారు వాళ్లు. ఒక్క దాల్ fry తప్ప, ఇంకవేటినీ పప్పు అని నాకు పిలవాలనిపించదు!

    @Aruna Pappu
    పప్పు.. అరుణ పప్పు.. గారు, మీ ఇంటి పేరు నాకు తెగ నచ్చేసింది. బ్లాగులోకంలో ఇంకో పప్పుగారు కూడా ఉండేవారు. ప్రస్తుతం ఆయన తాళంపెట్టుకుని ఎటో వెళ్లిపోయారు...

    ReplyDelete
  18. అదీ ఇప్పుడు ఫొటొ మార్చి అసలు పప్పు ఫోటో పెట్టాక మీ టపా ఇంకా బాగుంది. పప్పుల్లో మహరాజు కందిపప్పు కదా!
    వట్టి మినుములు (ఉడకపెట్టకుండా) తింటే చెవుడు వస్తుంది అంటారు, ఇడ్లీకి ఏం కాదులేండి, భయపడకండి.
    @రాజేంద్ర గారు, మీరిలా రాయవలసినవి ఎన్నెన్ని పేరుకు పోతున్నాయో!!వాటన్నిటికి మోక్షం ఎప్పుడంటారూ?

    ReplyDelete
  19. పప్పు దీపు గారూ ... సారీ ప్రదీపు గారూ... మీ పప్పోపాఖ్యానం విందు బహు పసందు! అది చదివి, ఊరికే కామెంటడానికి మనసొప్పక, మీ పప్పన్నం మహా రంజుగా మారడానికి నేను ఆవకాయ పురాణం రాసానండీ.... ! మీతోపాటుగా మిగతా బ్లాగరులందరూ పప్పూ ఆవకాయ కలిపి లాగించేస్తారని అశిస్తున్నాను.

    ReplyDelete
  20. @సిరిసిరిమువ్వ,
    కందిపప్పుకు నేను చేసిన ద్రోహాన్ని గుర్తించి, సరిదిద్దుకున్నా, మినప్పప్పు గురించి చెప్పి నన్ను రక్షించారు.

    @విరజాజి,
    మీ ఆవకాయ రుచిని ఇప్పుడే చూసాను. కల్లలో నీళ్లు తిరిగాయి (ఆవకాయ కారం గుర్తొచ్చి)...

    ReplyDelete
  21. పప్పు ప్రియుల క్లబ్బులో నాకూ ఓ మెంబర్షిప్పు ఇప్పించండీ బాబూ.

    కందిపప్పు పప్పు రాజమైనా, పెసరపప్పుకే నా వోటు.
    చెనగపప్పు కొబ్బరి కొబ్బరి కోరు ట్రై చేసారా. వెల్లుల్లి దట్టించిన పోపుతో

    ReplyDelete
  22. అన్నయ్యా...ఇక్కడజూడు..
    తలైవా!! ఇంగే పారు
    http://nalabhima.blogspot.com/2008/10/blog-post.html

    ReplyDelete
  23. @సిరిసిరిమువ్వ గారు నిజ్జంగా జాం వచ్చిందండి(మా బబ్లుగాడి మాటల్లో)దానికితోడు విపరీతమైన నీరసమండి,అలా బ్లాంకుగా చదువుకెళ్ళిపొతున్నా తప్ప ఆలోచించే ఓపిక ఉండటం లేదు.ఇప్పుడు కాస్త ఫర్లేదు.:)
    ఇక్కడ ఎవరూ అడగకపోయీనా ఒక ఉచితసలహా:-చలికాలమన్నాళ్ళూ ఆ కందిపప్పును వాడండినెయ్యి తప్పనిసరిగా వాడాలి,అది రూలు,అలాగె వేసవికాలములో మాత్రం పెసరపప్పు శ్రేష్టమని నిపుణులు చెప్తున్నారు.అప్పుడూ నెయ్యి ఉండాలండోయ్.
    పప్పు తాలింపులో వెల్లుల్లి వెయ్యకపోతే అది బోరు కొట్టని తెలుగు సినిమాతోనూ,సాగతీయని ఏక్తాకపూర్ సీరియల్ తోనూ సమానమని తెలియజేస్ కుంటూ...

    ReplyDelete
  24. @చదువరి .. జన్మరాహిత్యం .. hilarious

    ReplyDelete
  25. అందరికీ, ఇప్పుడు వండిన పప్పు ఎలా ఉంటుందో చూపించటానికి ఒక ఫొటో కూడా తీసి పెటాను. అందులో కొత్తిమీరలేదేంటి అని అడక్కండి. హైదరాబాదులో అక్కడెక్కడో mid-night బిరియానీ లాగా మాయింట్లో కూడా mid-night పప్పు చేసుకున్నాం, కాబట్టి ఉన్నవాటితోనే కానిచ్చేసేయాల్సి వచ్చింది!!

    @బొల్లోజు బాబా,
    ఈ క్లబ్బులోకి రోజూ పప్పు తినగలిగే సత్తా ఉన్నవాళ్లు అందరూ ఆహ్వానితులే :) కంది పప్పు, పెసర పప్పు, రెండూ దేనికవే సాటి.
    a
    @భాస్కర్ రామరాజు,
    చూసా, అక్కడ ఒక కామెంటుని కూడా వేసేసాను.

    @రాజేంద్ర కుమార్ దేవరపల్లి,
    అసలు పప్పు తాలింపునే నెయ్యితో వేసేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది.

    ReplyDelete
  26. పప్పు లేని కూడు ఒప్పదు రుచుల అన్నారు కదండి...(మా ఇంటి పేరు కూద "పప్పే"లెండి..)

    ReplyDelete
  27. పప్పు గురించి ఇంత గొప్ప టపా ఇప్పుడే , పైగా లేటుగా చదువుతున్నాను. మీరు పెట్టింది కందిపప్పు ఫొటోనే!

    ఈ పోస్టు చదివాక అసలు బాచెలర్లకు వంట రాదని ఎవడంటాడో రమ్మనండి చూద్దాం! మీ కుక్కర్లో పప్పు చాలా కలర్ ఫుల్ గా ఉంది, చూడ్డానికే రుచిగా కనపడిపోతోంది.

    సుజాతా, పొట్టు తీయని మినప్పప్పుతో పప్పేమిటండీ, ఏదైనా ఒరియా వంటకమా?

    చదువరి గారు చెప్పినట్టు పప్పుతో ఆవకాయ కలిపి లాగిస్తే జన్మ రాహిత్యం కలగడం ఖాయం. ఆ క్షణంలో ఆవకాయ, పప్పు తప్ప ప్రపంచంలో ఇంకేమీ శాశ్వతం కాదనిపిస్తుంది.

    ReplyDelete
  28. pradeep garu,
    mee pappopaakhanam chaala bagundi. andukee kabolu
    kandipappu aakasamloki vellipotu...uristondi

    ReplyDelete