Friday, October 19, 2007

అమెరికా తెలుగు కథ (మొదటి సంకలనం)


రెండు నెలల క్రితం ఈ పుస్తకాన్ని మా చుట్టాల ఇంట్లో చూసాను, అప్పటికే వాళ్లింట్లో చదవాల్సినవారందరూ చదివేసినట్లున్నారు, బీరువాలో ఓ మూలకెళ్లిపోయింది... ఏట్లాంటి కథలుంటాయో చూద్దామని మొదటి పేజీ చదవటం మొదలుపెట్టాను, ఇంకొంత సేపటికి పుస్తకంలోని మొదటి కథ పూర్తయిపోయింది; అప్పుడే ఇది మొత్తమంతా చదవాల్సిన పుస్తకం అని అనిపించింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని రెండోసారి చదువుతున్నాను!

ఈ పుస్తకాలలోని కథలు చదువుతున్నంత సేపూ బ్లాగులలోని పోస్టులు చదువుతున్నట్లే అనిపించింది. కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని పరవాలేదనిపించాయి, ఇంకొన్ని నాకు నచ్చలేదు(అర్థంకాలేదు?). కానీ ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న కథలన్నీ, రచయితల అనుభవాల నుండి పుట్టినవే ఉన్నాయి (నాకలా అనిపించింది).

ఆ పుస్తకంలోని మొదటి కథే (యాదృచ్చికం) నాకు అన్నింటికంటే చాలా బాగా నచ్చిన కథ, అసలు ఆ కథే నన్ను పూర్తి పుస్తకాన్ని చదివేటట్లు చేసింది. ఆ తరువాత వెంటనే చెప్పుకోవలిసిన కథ "తుపాకి", ఇది ఆ పుస్తకంలో అన్నిటికంటే పెద్దకథ. కానీ అది కాదు దీని గొప్పదనం. కథలోని కధనం పాత్రలను మలచిన తీరు, నాకు బాగా నచ్చాయి. ఈ కథను చదివితే అమెరికా జీవితాన్ని విహంగవీక్షణం చేసిన అనుభూతికి లోనవుతారు. పుస్తకంలోని కథలను చదువుతున్నంతసేపూ వాటి పైన ఒక సమీక్షరాద్దామని అనుకున్నాను. కానీ రాయటం మొదలు పెట్టిన తరువాత తెలిసింది సమీక్షను రాయటం అంత సుళువు కాదని. ఈ పుస్తకం లోని 50% కథలు చాలా బాగున్నాయి, ఇంకో 30% బాగున్నాయి. మిగిలిన 20% కథలు, పేజీలు నింపటానికి మాత్రమే, అని చెప్పను కానీ, నాకు అర్థంకాని ఇంకో స్థాయిలో రాసారేమో అని అనిపించింది, వాటిని పూర్తిగా చదవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

పొరుగింటి పుల్లకూర, అమెరికా ఇల్లాలు, అమ్మ, లక్ష డాలర్లు, అగాధం మొదలైన కథలు చదువుతుంటే మాతృదేశాన్ని వదిలి, అమెరికా వచ్చి, చాలా కోల్పోయామేమోననే భావన నుండి తయారయ్యాయి. అంతేకాదు, మనం విన్న "కుందేలూ-తాబేలు" కథకు ముందు జరిగిన కథను వేమూరిగారు అద్భుతంగా వివరించారు. "తెమీనచా-నమీతెచా" అంటూ సత్యం మందపాటిగారు బాగా వాతలు పెట్టారు. "సావాసం సహవాసం", పదాల మధ్యన తేడాను, "ఆవగింజ ఆంతర్యాన్ని" కూడా కథలరూపంలో వివరించేసారు. పుస్తకంలోని కథలు ఒక ఎత్తయితే, పుస్తకం చివరన కథకులను పరిచయం చేయటం ఇంకో ఎత్తు. వారందరు ఒక్క జీవితకాలంలోనే అన్ని అద్భుతాలు ఎలా సాధించారా అనిపించటం కద్దు.

ఈ పుస్తకం మొత్తంలో నాకు అస్సలు అర్థంకాని కథ "లుండెర్ క్లుంపెన్". నేను రెండు సార్లు చదివినా, ఆ కథ ద్వారా రచయిత ఏంచెప్పాలనుకున్నడో, నాకు అస్సలు అర్థం కాలేదు.

ఈ పుస్తకంలో ఒక్కో కథా 2-3 పేజీల నుండీ 15-20 పేజీల వరకూ ఉంది. మొత్తం 35 కథలు. రొజుకో కథ చప్పున పుస్తకాన్ని పూర్తిచేయడానికి నెలపైనే పట్టింది నాకు. "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు అమెరికాలో అయితే 15డాలర్లు, భారతదేశంలో 100 రూపయలు మాత్రమే.

అనట్లు ఈ పుస్తకంలో మన నాసీగారి కథ కూడా ఒకటి ఉందండోయ్.

Sunday, September 23, 2007

ఎలా జరిగింది?

అసలు మొదటిగా ఏం జరిగిందో తెలుసుకుందాము. ఆ తరువాత ఎలా జరిగింది అని అలోచిద్దాము. నా బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో ఎప్పుడొ online photo hosting sites కోసం వెతుకుతున్నప్పుడు నాకు flickr గురించి తెలిసింది. ఇంకొన్ని వేరే సైట్లు ఉన్నా కూడా flickr నచ్చినంతగా అవి నచ్చలేదు. అప్పుడప్పుడూ అలా flickrలో తిరుగుతున్నప్పుడు కొంత మంది పేర్ల పక్కన pro అని కనపడుతూ ఉండేది. మొదట్లో మంచి మంచి ఫొటోలు తీసేవాళ్ల పక్కన అలా pro అని వస్తుందేమో అని అనుకున్నాను, తరువాత తెలిసింది లెండి, ప్రతీ నెలా రెందు డాలర్లు కడితే మన పేరు పక్కన కూడా pro అని వచ్చేస్తుందని తెలిసింది. నాకంతెందుకులే అని, ఉచిత సేవలతోనే సరిపెట్టుకున్నాను.

అయితే మొన్న 21న జరిగిందది. flickrలో నా పేరు పక్కన కూడా pro అని కనిపించటం మొదలయింది, అలా అని నేను డబ్బులేమయినా కట్టానా అంటే, ఒక్క రూపాయి కూడా కట్టలేదు. మరింకెందుకు అలా కనిపించటం మొదలయ్యింది. ఇంకా వివరాలలోకి వెళితే నేను ఇంకో నెలపాటు(వచ్చే నెల 21 వరకు) అలా నా పేరు పక్కన proని చూసుకుంటూ మురిసిపోవచ్చని తెలిసింది.

ఇప్పుడు అసలు ప్రశ్న flickrలో నేను డబ్బులు కట్టకపోయినా, నా ఎకౌంటు proగా ఎలా మారిపోయింది? ఇలా జరగటానికి నాకు రెండు కారణాలు కనపడుతున్నాయి. ఈ రెండిటిలో ఏదయినా కవొచ్చు. ఎవరయినా నాకు బహుమతిగా పంపించుండొచ్చు... కానీ అలా నాకు ఒక pro ఎకౌంటు కొంటునట్లు ఎటువంటి మెయిల్లు రాలేదు... ఇంక రెండోది flickrలో ఇదొక feature లాంటి bug అనుకుంటా :)

మీకీ సంగతి తెలుసా; flickrలోకి మీరు ఎక్కించిన ఫొటోలు, ఇతరులకు నచ్చుతాయా నచ్చవా అనే అంశం పరిశీలించి వాటిని ఆ రకంగా వర్గీకరిస్తుంది. ఇది కూడా మనుషులు కాకుండా ప్రోగ్రాములే చేస్తాయని నా వుద్దేశం...

Friday, September 21, 2007

తెలుగులో అతి తరచుగా ఉపయోగించే అక్షరం ఏది?

ఆంగ్లంలో "E" అనే అక్షరాన్ని అతి తరచుగా వాడతారని మనందరికీ తెలిసిందే, మరి తెలుగులో కూడా అటువంటి అక్షరం ఒకటి ఉండాలి కదా... ఈ ప్రశ్నకు జవాబును కనుక్కోవటానికి తెలుగు వికీపీడియాలో ఉన్న సుమారు 58 వేల పేజీల సమాచారాన్ని సేకరించి పరిశీలించాను. అయితే చివరికి వచ్చే ఫలితాల నాణ్యత కాపాడటానికి 2KB కంటే తక్కువ సమాచారం ఉన్న పేజీలను పరిశీలన నుండి తప్పించాను, ఇలా తప్పించటం వలన దాదాపు అన్ని గ్రామాల పేజీలు, చాలా మట్టుకు సినిమా పేజీలు విశ్లేషణ నుండి బయట పడ్డాయి. అంటే విశ్లేషణకు ఇక మిగిలిన పేజీలలో ఉన్న సమాచారం మొత్తాన్ని ప్రోగ్రాములతో కాకుండా దాదాపూ పూర్తిగా మనుషులతోనే సృష్టించారు.

ఈ గణాంకాలు తీసుకుంటున్నప్పుడు వత్తులను కూడా మామూలు అక్షరాలతో సమానంగా లెక్కగట్టాను. ఈ గణాంకాలను తెలుగు వికీపీడియాలోని 3419 పేజీలలో ఉన్న సుమారు 66 లక్షల అక్షరాల(వత్తులు గుణింతాలు కలుపుకుని) నుండి సేకరించాను.

అచ్చులలో "ఇ లేదా ి" ఎక్కువగా ఉపయోగిస్తుంటే, హల్లులలో "ర"ను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ రెండిటికంటే కూడా ఎక్కువగా అచ్చు-హల్లు కాని ్(పొల్లును) ఉపయోగిస్తున్నారు!!!

వికీపీడియాలో నాకు వచ్చిన పూర్తి ఫలితాలను ఇక్కడ చూడండి.

ఇలాంటి విశ్లేషణ ఇంతకు ముందే ఒకసారి అన్నమైయ్య పాటలపై ఒకసారి, రచ్చబండ గుంపులోని చర్చలో ఇంకోసారి జరిగాయి. ఈ రెండు చోట్లా మట్టుకు "న" అనే అక్షరం అత్యధికంగా వాడుతున్నట్లుగా గణాంకాలు వచ్చాయి.