Wednesday, July 04, 2007

రెండవ బెబ్లాసా సమావేశం

మొదటిగా, శుక్రవారం సాయంత్రం నవీన్ గార్ల గారి నుండి gtalk‌లో నాకు పిలుపు వచ్చింది. శనివారం కానీ, ఆదివారం కానీ కలుద్దామని చెప్పారు. సరేమరి ప్రవీణ్‌ను కూడా అడిగి నాకు ఎప్పుడు ఎక్కడికి రావాలో ఫోను చేసి చెప్పండని, చెప్పాను. అంతకు ముందు రోజు రవికుమార్ మండాలా నా దగ్గరకు వచ్చి ఈ వికీపీడియా కధా కమీషూ ఏమిటో కనుక్కుందామని, శనివారం నా రూముకు వస్తానన్నాడు.

ఎప్పటిలాగానే శనివారం ఆఫీసులేదని కొంచెం ముందే నిద్రలేచాను :) ఏంచేయాలో తోచక వికీపీడియాలో వ్యాసాలను కెలుకుతూ కూర్చున్నాను. రవీ వస్తాననడం గుర్తొచ్చి, రమ్మని ఫోను చేసాను. ఇంకో అరగంట తరువాత ఎప్పుడూ సైలెంటు మోడులో ఉండే నా సెల్లులోని మిస్సుడు కాల్సు చూస్తే నవీన్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చిందని ఉంది. ఫోన్‌చేస్తే నవీన్, ప్రవీణ్ ఇద్దరూ సమావేశమై అప్పుడే గంటయ్యిందని చెప్పాడు. రవీ వచ్చేవరకూ ఆగి అతనిని కూడా అటు పట్టుకెళ్ళాను.

వెళ్ళిన వెంటనే ఒక ప్లేటులో కాజూబర్ఫీ, ఇంకో ప్లేటులో హాటు వచ్చేసాయి మాదగ్గరకి. ఇంకొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నా తరువాత ప్రవీణ్, నవీన్ తయారు చేద్దామనుకుంటున్న తెలుగు సహాయక వీడియోలు ఎలా తయారు చేద్దామనుకుంటున్నదీ చెప్పి, వాళ్ళు అప్పటికే తయారు చేసిన, ఒక చిన్న వీడియోను చూపెట్టారు. చాలా బాగా వచ్చింది ఆ వీడియో. ఆ తరువాత గంటా, రెండు గంటలు ఏవేవో చర్చించాము, వాటిలో ముఖ్యమైనవి ఇవి:
  1. ఇంటర్నెట్టులో తెలుగును బాగా వ్యాప్తి చేయటానికి పనికి వస్తాయనుకునే ఆలోచనలను అన్నీ ఒకేచోట ఎప్పటికప్పుడు చేర్చడం. ఈ-తెలుగు సంఘాన్ని, ఏర్పాటు చేసిందే అందుకు కదా మరి. ఇదేకాదు తెలుగు ప్రచారానికి అవసరమైన వ్యాసాలను కూడా తయారు చేసి, వాటన్నిటినీ కూడా ఒకే చోట పదిలపరిస్తే బాగుంటుందని అనుకున్నాము.
  2. కంప్యూటరులో తెలుగును స్థాపించటానికి సహాయపడే వీడియోలను మరిన్ని తయారు చేయటం. ఒక పేజీడు సూచనలకన్నా 2 నిమిషాల వీడియో చూస్తే ఇంకా తొందరగా బాగా తెలుసుకోవచ్చు కదా మరి.
  3. తెవికీకి ఒక Recruitment Bulletinని మొదలు పెడితే ఎలా ఉంటుందో అనే కూడా ఒక ముఖ్యమైన విషయం. రాశిలో తెవికీ భారతీయ వికీలన్నిటికన్నా ముందుంది అనేది అందరికీ తెలిసిందే. వాశిలో మాత్రం మనం కన్నడ, తమిళ భాషలు మనకు చాలా పోటీని ఇస్తున్నాయి, అవి మనకంటే ముందు కూడా ఉండి ఉండవచ్చు. అయితే తెవికీని వాశిలో కూడా ముందుంచే చిన్న ఆలోచన ఇది. తెవికీలో ప్రస్తుతం బోలెడన్ని వ్యాసాలు మెరుగుపరచటానికి ఎదురుచూస్తున్నాయి. ఎవరెవరికి ఏ ఏ రంగాలలో ప్రవేశముందో లేదా ఇష్టముందో తెలుసుకుని వారిని తెవికీలో ఆయా వ్యాసాలను మెరుగుపరచటానికి ప్రోత్సహించటం ఈ Bulletin యొక్క ముఖ్యోద్దేశం.
  4. తెవికీలో అనువాదాలకు వ్యాసాలను ఆంగ్లవికీ నుండే కాకుండా ఇతర భారతీయ భాషలనుండి కూడా తేగలిగితే ఎలాఉంటుందో అని కొంచెం సేపు చర్చించాము. ఉదాహరణకు తెవికీలో ఉన్న ఈ పేజీని చూడండి, దీనిని కన్నడ వికీ నుండి అనువదిస్తున్నారు.
  5. తెవికీకో ఉన్న అన్ని సహాయ పేజీలకు WP:5MINలా ఉండే సంక్షిప్త పేర్లతో దారిమార్పు(redirect) పేజీలను సృష్టించాలి అనికూడా అనుకున్నాము. దీనివలన మన గుంపులలో ఎప్పుడయినా ఆ పేజీలకు లింకులను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సంక్షిప్త చిరునామాలయితే సులువుగా ఉంటుండి.
  6. మాటల మధ్యలో తెవికీలో RTS-తెలుగు Transliteratorని ఇంకోంచెం వేగంగా పనిచేయించటానికి ప్రయత్నించాలని అభిప్రాయపడ్డాము.
  7. పేరుకి బ్లాగరుల సమావేశం అనే మనం పిలుస్తున్నా కానీ, ప్రతీ సారీ బ్లాగరులు మరియు వికీపీడియనులు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అందుకని ఈ సమావేశాలకు "ఈ-తెలుగు సమావేశం" అనే పేరే సరయినదని కూడా కొంచెం సేపు చర్చించుకున్నాం.

అప్పటికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. మొదటి సమావేశంలో అనుకునట్లు MTRలో తినలేక పోయినా, అంతకంటే ఎన్నోరెట్లు రుచికరమైన విందు భాజనం చేసాము. అందునా ఆ విందులో వడ్డించిన వంకాయ కూర అదుర్స్. కాబట్టి ఇంక వారం వారం సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. భోజనం ముగించిన తరువాత కొంచెం సేపు లినక్సు గురించీ ఉబుంటూ ఉచిత CDల గురించి మాట్లాడుకున్నాము. ఆ తరువాత జరిగిన సన్నివేశాలన్నీ మీరు ప్రవీణు రాసిన పోస్టులో ఇప్పటికే చదివేసి ఉంటారు.

నలుగురమూ కలిసినందుకు గుర్తుగా(రుజువుగా) చివరిలో ఈ ఫొటో తీసుకున్నాము. ఫొటోలో ఎడమ నుండి కుడి వైపుకు, నేను, ప్రవీణ్, తెవికీ, నవీన్, రవీ నుంచున్నాము.

Saturday, June 23, 2007

టిన్ టిన్

ఇతను నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు నాకు పరిచయమయ్యాడు. తన పెంపుడు కుక్క స్నోయితో కలిసి, దేశ దేశాలు తిరుగుతూ, బోలెడన్ని సాహసాలు చేసేవాడు. ఎక్కడా కూడా వెన్నుచూపి పారిపోయేవాడు కాదు, అందరినీ తెలివిగా ఎదుర్కొనేవాడు. టిన్ టిన్ జనవరి 10 1929లో పుట్టాడు. టిన్ టిన్ మొదట Le Petit Vingtième అనే ఫ్రెంచి పత్రికలోని పిల్లల ప్రత్యేక విభాగంలో కనిపిస్తాడు.

Hergé అనే కలం పేరుతో Georges Prosper Remi అనే బెల్జియం రచయిత ఇతనిని సృస్టించాడు. టిన్ టిన్ మొట్ట మొదట రష్యాలోని అప్పటి కమ్యూనిష్టు పాలనా విశేషాలను తన తోటి ప్రజలయిన బెల్జియం దేశస్తులకు చేరవేయడానికి వెళ్తాడు. టిన్ టిన్ ద్వారా Hergé రష్యా పట్ల తనకు ఉన్న వ్యతిరేకతను వ్యక్త పరిచేవాడు. అందుకే గావచ్చు Tintin in the Land of the Soviets అనే పుస్తకం మనకు ఏ స్కూలు లైబ్రరీలోనూ కనిపించదు. Hergé రష్యా పట్ల ఉన్న వ్యతిరేకతకు ఉదాహరణగా ఈ క్రింది బొమ్మలను చూడొచ్చు.




కానీ ఈ ఒక్క పుస్తకాన్ని చూసి మొత్తం అన్ని టిన్ టిన్ పుస్తకాలపై ఒక అంచనాకు రాకూడదు మరి. ఈ పుస్తకాన్ని మొదలు పెట్టినప్పుడు Hergé వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాతి కొన్ని పుస్తకాలలో టిన్ టిన్ ఎన్నో అంతర్జాతీయ మాదకద్రవ్య ముటాలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు. ఇలా మాదకద్రవ్య వ్యాపారులను వేటాడే క్రమంలో భారతదేశానికి కూడా ఒక వస్తాడు.

అమెరికా వ్యోమగామి Neil Armstrong చంద్రుడి మీద కాలుపెట్టక ముందే టిన్ టిన్ చంద్రుడి మీద కాలు పెట్టేసి మనం బూమి నుండి చూడలేని చంద్రుడి ఇంకో వైపును కూడా చూసేసి వచ్చాడు. అది కూడా Neil Armstrong కంటే ఏకంగా 19 సంవత్సరాల ముందుగానే వెళ్ళి వచ్చాడు. Hergé ఈ పుస్తకం రాయడానికి ముందు చాలా పరిశోధన చేసాడంట. అప్పట్లో అమెరికాగానీ, రష్యాగానీ మానవ సహిత అంతరిక్ష యాత్రకు సన్నాహాలు కూడా మొదలు పెట్టలేదు. Hergé తనకు దొరికిన అతి తక్కువ సమాచారంతో వైజ్ఞానికంగా పెద్ద పెద్ద తప్పులు చేయకుండా కధను చాలా బాగా నడిపించాడు.


మొదటి రెండు మూడు పుస్తకాల కధంతా టిన్ టిన్ అతని పెంపుడు కుక్క స్నోయీల చుట్టూనే నడిచేది. తరువాత కధలలో అతనికి కొంతమంది స్నేహితులు కూడా తోడవుతారు. వాళ్ళలో ముఖ్యమయిన వారు, కాప్టన్ హాడ్డాక్, ఇతను ఒక మందు బాబు. మందు పుచ్చుకున్న తరువాత, అది దిగేదాకా ఏం చేస్తాడో అతనికే తెలియదు. కవలలు కాకపోయినా ఒకేలా కనిపించే థాంసన్ మరియు థాంప్సన్‌లు టిన్ టిన్‌కు పోలీసు మిత్రులు. వీళ్ళిద్దరూ కష్టాలను కొని తెచ్చుకోనిదే నిద్రపోరు, వీళ్ళు ఎప్పుడూ కలిసే కనిస్తుంటారు విడివిడిగా చూడటం చాలా అరుదు. వీరికి ఇంకో స్నేహితుడు సగం చెవుడు ఉన్న ఒక మతిమరుపు "ప్రొఫెసర్ కాల్కులస్". బియాంకా కాస్టాఫియోర్ అనే ఒక గాయిని కూడా వీరికి స్నేహితురాలు.

స్పిల్‌బర్గ్ తీసిన ఇండియానా జోన్స్ సినిమాలోని ముఖ్యపాత్ర కూడా టిన్ టిన్ పాత్రకు దగ్గరగా ఉంటుందని కూడా కొంత మంది భావిస్తారు. అంతేకాదు స్పిల్‌బర్గ్ కూడా నాలాగే టిన్ టిన్ అభిమాని.

Monday, May 07, 2007

హ్యారీ పోటరు బుక్కులు

ఎప్పుడొ పది సంవత్సరాల క్రితం రాయటం మొదలు పెట్టింది, J.K.Rowling, ఈ పుస్తాకాలను. అప్పటి నుండి తరువాతి పుస్తకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని, ప్రతీ పుస్తకం తరువాత అందరూ ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆఖరు పుస్తాకాన్ని విడుదల చేయటానికి ముహూర్తం కూడా నిర్ణయించేసారు. కవరు పేజీలలో ఉండే బొమ్మలను అప్పుడే విడుదల కూడా చేసేసారు. కధముగింపులో ఏ పదముంటుందో కూడా చెప్పేసారు. అంతేకాదు పుస్తకం వెనుక అట్టపై ఉండే కధ గురించి వాఖ్యాలు కూడా విడుదల చేసేశారు. ఆఖరుకి పుస్తకంలో ఎన్ని పేజీలుంటాయో కూడా చెప్పేసారు.

ఇవన్నీ చూసి/విన్న తరువాత పుస్తకం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టాను. ఈ టపా రాసే సమయానికి ఇంకా 74 రోజుల 5 గంటల 15 నిమిషాలు దూరంలో ఉంది పుస్తకం విడుదల చేసే సమయం.

అయితే ఈ లోగా ఇలా వేచి చూడలేని కొంతమంది, వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఏడవ పుస్తకాన్ని రాసేసుకున్నారు. ఇంకొంతమందేమో ఏడవ పుస్తకంలో ఏముంటుందో అని ఊహించేసి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాసేసి అమ్మేసుకుంటున్నారు మరి. ఏదయితేనేం ఈ కొసరు కధలను కూడా అసలు కధకు మల్లేనే ఉత్కంటతతో నడుపుతున్నారు, మెయిన్ కోర్సుకు ముందు స్టార్టర్ల లాగా.

ఇవన్నీ కాక ఈమధ్య ఏడవ పుస్తకంలో కొంతబాగం అప్పుడే లీకయినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇదెంతవరకూ నిజమో మరి. ఏదేమయినా ఆ ఏడవ పుస్తకం కోసం ఇంకా రెండునర్ర నెలలు వేచి చూడాల్సిందే...